నారాయణపేట, వెలుగు: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు బీపీ చౌహాన్ అన్నారు. గురువారం ఆర్డీవో ఆఫీసులో పోలీసు పరిశీలకులు బీఎస్ ధ్రువ, వ్యయ పరిశీలకులు అభిషేక్ దేవల్, కలెక్టర్ కోయ శ్రీ హర్ష, ఎస్పీ యోగేశ్ గౌతంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఉల్లంఘనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయడానికి సహకరించాలన్నారు. సభలు, సమావేశాలకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్ఓ రాంచందర్, అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయవద్దు-
నాగర్ కర్నూల్ టౌన్: ఓటర్లను భయభ్రాంతుల గురిచేయవద్దని వివిధ పార్టీల లీడర్లకు జిల్లా జనరల్ అబ్జర్వర్ మిథిలేశ్ మిశ్రా సూచించారు. గురువారం నాగర్ కర్నూల్ ఆర్వో ఆఫీసులో పోటీ చేస్తోన్న అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు తప్పనిసరిగా ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోగా ఖర్చు వివరాలను ఈసీకి సమర్పించాలన్నారు. ప్రచారానికి వాడే ప్రతి వాహనానికి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఓ అభ్యర్థి గరిష్టంగా రూ.40 లక్షలు ఖర్చు పెట్టవచ్చన్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి ఫలితాలు ప్రకటించే తేదీ వరకు పెట్టిన ఖర్చు వివరాలను అభ్యర్థులు నమోదు చేసుకోవాలన్నారు.
అభ్యర్థులు నగదు రూపంలో రూ.2 వేలకు మించి విరాళాలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. అంతకుమించిన విరాళాలను చెక్కు రూపంలో తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు రోజుకు గరిష్టంగా రూ.20 వేల వరకు ఖర్చులను నగదు రూపంలో చేసుకోవడానికి అనుమతి ఉండగా, తాజాగా రూ.10 వేలకు తగ్గిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. సమావేశంలో ఆర్వో వెంకట్ రెడ్డి, అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్నికలకు పార్టీలు సహకారం అందించాలి
మహబూబ్ నగర్ కలెక్టరేట్,: జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్ రవినాయక్ తో కలిసి అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లతోపాటు , కలెక్టర్, పోలీసులకు, తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల30 న జిల్లాలో జరిగే పోలింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాలు, ఓటర్లు, పోలీసు బందోబస్తు, పోస్టల్ బ్యాలెట్, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు, పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
పోలింగ్ కు నోడల్ అధికారులు సిద్ధంగా ఉండాలి
ఈ నెల 30న నిర్వహించే పోలింగ్ కు నోడల్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ మిశ్రా సూచించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా వ్యయ పరిశీలకులు డాక్టర్ కుందన్ యాదవ్, తేజస్వీ, పోలీసు పరిశీలకురాలు ఇళక్కియా కరుణాగరన్ తో కలిసి నోడల్, రిటర్నింగ్ అధికారులకు ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. పీవో, ఏపీవో, ఓపీవోలకు ఓటరు స్లిప్పుల పంపిణీ, ఈవీఎంలు, పోలింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలు తదితర వాటిపై సూచనలు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎస్పీ హర్షవర్ధన్, ఆర్వోలు అనిల్ కుమార్, మోహన్ రావు, నటరాజ్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఖర్చును నమోదు చేయాలి
వనపర్తి : ప్రతి అభ్యర్థి ఎన్నికల ఖర్చులను ప్రతిరోజు నమోదు చేసి సమర్పించాలని జిల్లా జనరల్ అబ్జర్వర్ సోమేశ్ మిశ్రా సూచించారు. గురువారం వనపర్తి ఐడీవోసీ ఆఫీసులో వనపర్తి నుంచి పోటీ చేసే అభ్యర్థులతో పోలీస్ అబ్జర్వర్ రాజీవ్ మల్హోత్రా, వ్యయ పరిశీలకులు రాజేందర్ సింగ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షిత కె మూర్తితో కలిసి ఎన్నికల నియమావళిపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల రిజిస్టర్ పార్ట్- ఏ, పార్ట్- బి, పార్ట్- సి లపై, సి- విజిల్ యాప్ పనితీరుపై అవగాహన కల్నించారు. జిల్లాలో ఎఫ్ఎస్టీ , ఎస్ఎస్టీ, వీఎస్టీ బృందాలు 24 గంటలు పర్యటిస్తుంటాయని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటాయన్నారు. కార్యక్రమంలో అభ్యర్థులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.