కొంత మంది సాధించిన చిన్నచిన్న విజయాలకే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్టు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారు. మరి కొందరు ఎన్నో విజయ సౌధాలను అధిరోహించినా సాదాసీదా జీవితం గడుపుతుంటారు. రాజకీయ నాయకులు ఇందులో మొదటి కోవకు చెందుతారు. ప్రజల్లో కాకుండా మీడియాలో మాత్రమే ఉద్యమాలు చేసే వ్యక్తులు వీరంతా. ఇక విజయ సౌధాలను అధిరోహిస్తూ సాదాసీదా జీవితం సాగించే వారు ప్రభావశీల, కాలాతీత వ్యక్తులుగా, చారిత్రక పురుషులుగా చరిత్రలో నిలిచిపోతారు. ఈ కోవకు చెందిన మహనీయుల బాటలో నడిచిన మణిహారం బిందేశ్వరీ ప్రసాద్ మండల్. బీపీ మండల్‌గా మనందరికీ తెలిసిన మండల్ జీవితం దేశ ప్రజలపై చెరగని ముద్ర వేసింది. బీపీ మండల్ జీవితం ఓ సామాజిక సంతకం, బీసీల చైతన్య స్రవంతి. సామాజిక న్యాయం, సహజ న్యాయం, చట్టబద్ధ న్యాయం అసమానంగా ఉన్న నేపథ్యంలో ఓబీసీలకు అంత దామాషా దక్కాలనే సహజ న్యాయసూత్రానికి కట్టుబడి ఏర్పడిందే మండల్ కమిషన్. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఈ కమిషన్‌కు బీపీ మండల్ చైర్మన్‌గా వ్యవహరించారు.
బీపీ మండల్ 1918 ఆగస్టు 25న ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో పుట్టారు. బనారస్‌లో పుట్టినా ఆయన పెరిగింది మాత్రం బీహార్‌లోని మధేపూర్ జిల్లా మోరో గ్రామంలోనే. మండల్‌ది పెద్ద జమిందారీ కుటుంబం. మండేపురాలో ప్రాథమిక విద్య, దర్భంగాలో ఉన్నత విద్య, పాట్నాలో ఇంటర్ పూర్తి చేశారు. 1945- 51 మధ్యకాలంలో మధేపూర్ డివిజన్లో జీతం తీసుకోకుండా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. బీపీ మండల్ తండ్రి రాజ్బీహారీ మండల్ బ్రిటిష్ ఇండియాలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన బాబాయి ప్రజల పక్షాన ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించి జైలుకెళ్లారు. బీపీ మండల్ రాజకీయ జీవితం కాంగ్రెస్‌తోనే ప్రారంభమైంది. 1952లో బీహార్ అసెంబ్లీకి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అధికార పక్షంలో ఉండి బలహీనులైన కుర్మీలపై అగ్రవర్ణ రాజపుత్రులు దాడి చేయటాన్ని ఖండించటానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి పాండే అవకాశం ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బయటకొచ్చేశారు. సంయుక్త సోషలిస్ట్ పార్టీ(ఎస్ఎస్పీ)లో చేరి 1962 ఎన్నికల్లో 7 సీట్లు మాత్రమే ఉన్న ఆ పార్టీ 1967లో 69 సీట్లు గెలిపించేలా చేశాడు. 1968 ఫిబ్రవరి 1న కాంగ్రెస్ మద్దతుతో బీహార్ రెండో బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి హయ్యర్ కమిషన్ ను వేయడంతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించింది. దీంతో మండల్ నెల రోజుల ముఖ్యమంత్రిగా మిగిలారు.
1980లోనే నివేదిక ఇచ్చిన కమిషన్
1967లో అప్పటి జనతా పార్టీ తాము ఎన్నికల్లో గెలిస్తే బీసీల రాజకీయ, సామాజిక, సంక్షేమ, సమగ్ర అభివృద్ధి కోసం ఓ కమిషన్ వేస్తామని మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే 1978లో ఐదుగురు సభ్యులతో మండల్ కమిషన్ వేసింది. ఈ కమిషన్ 1980 డిసెంబర్ 31న తన నివేదికను సమర్పించింది. ఆ తర్వాత జనతా ప్రభుత్వం కూలిపోవడం కాంగ్రెస్ నాయకత్వంలో ఇందిరాగాంధీ ప్రధాని కావడంతో మండల్ కమిషన్ నివేదిక మరుగునపడింది. పదేండ్ల తర్వాత వీపీ సింగ్ ప్రధాని కావడంతో మరుగునపడ్డ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్, కాన్షీరామ్.. వీపీ సింగ్‌ను కోరారు. అందుకు అంగీకరించిన ఆయన మండల్ కమిషన్ సిఫార్సుల్లో ఒక్కటైన బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 1990 ఆగస్టు 7న అది అమలులోకి వచ్చింది.
రిజర్వేషన్ల అమలుతో దేశవ్యాప్తంగా అల్లర్లు
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామన్న వీపీసింగ్ ప్రకటనతో దేశం రెండుగా చీలిపోయింది. అల్లర్లు చెలరేగి కొందరు ప్రాణత్యాగం చేశారు. మండల్ కమిషన్ సిఫార్సులను అగ్ర కులాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని రెచ్చగొట్టారనే పేరుంది. మండల్ సిఫార్సులకు వ్యతిరేకంగా అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఈ యాత్ర శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది. లాలూప్రసాద్ యాదవ్ పాట్నాలో అద్వానీని అరెస్ట్ చేయించటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్‌లో ములాయంసింగ్ యాదవ్ రథయాత్రను అడ్డుకున్నారు. కాన్షీరామ్ మండల్ కమిషన్ సిఫార్సులకు అనుకూలంగా ఢిల్లీలోని బోట్స్ క్లబ్లో రోజుల తరబడి ధర్నా చేశారు. మరోవైపు అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు, సోమనాథ్‌చటర్జీ లాంటి కమ్యూనిస్ట్ నాయకులు మండల్ కమిషన్ సిఫార్సులు తమకు సమ్మతమని చెప్పి ఇంకోవైపు కులాన్ని గుర్తించబోమని ద్వంద్వ ప్రమాణాలు పాటించారు. దీనికి నిరసనగా కాన్షీరామ్ యూపీ నుంచి బెంగాల్‌కు నడిచే రైళ్లను బంద్ చేయించారు. దీంతో అప్పటి బెంగాల్ ప్రభుత్వం క్షమాపణలు వేడుకుంది. కులాన్ని గుర్తించమని చెప్పే కమ్యూనిస్టు పార్టీలకు నేటికి తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, రెడ్లే కార్యదర్శులుగా ఉండటం ఏ శాస్త్రీయ సిద్ధాంతానికి సంకేతం. రిజర్వేషన్ల వ్యతిరేకులు కొందరు సుప్రీంకోర్టులో కేసు వేయడంతో 1990 నుంచి 1993 వరకు మూడేండ్లు అమలు ఆగింది. 1993లో స్టే తొలగించటంతో క్రీమీలేయర్‌తో మండల్ కమిషన్ సిఫార్సులను అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అమలు చేశారు. కానీ 30 ఏండ్లుగా కేవలం విద్య, ఉద్యోగ రంగాల్లో మాత్రమే అమలు జరగడంపై దేశవ్యాప్తంగా ఓబీసీలు అసంతృప్తితో ఉన్నారు. చట్టసభల్లోనూ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
మండల్ డేగా ఆగస్టు 7
రోజూ మీడియాలో కనబడే, వినబడే కొందరు బీసీ నాయకులు.. రాజ్యాధికారం, ఓటు విలువ, బీసీలకు అధికారం లేకపోవటం వల్ల కలిగే నష్టం లాంటి లక్ష్యాన్ని వదలి స్వకార్యం చూసుకుంటున్నారు. తమకొక్కరికే అధికారం ఉంటే చాలనుకుంటున్నారు. అందుకు ఎన్ని పార్టీలు మారడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. మండల్ కమిషన్ సిఫార్సుల అమలుతోనే ఓబీసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. ఆ దిశగా మేధావులు, చిత్తశుద్ధి కలిగిన బీసీ సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మండల్ కమిషన్ సిఫార్సుల అమలు ఆకాంక్ష కూడా 60 ఏండ్ల తెలంగాణ ఆశయం లాగే మేధావులు, జనాల ఆలోచనల్లో నిక్షిప్తమై ఉందని బహుజన మేధావి, విశ్రాంత ప్రొఫెసర్ సింహాద్రి అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ కలలాగే రైట్ టైమ్ లో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు జరుగుతాయని ఆయన చెబుతున్నారు. మండల్ భావజాల వ్యాప్తికి దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్‌లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, లాయర్లు నడుం బిగించాలి. అలాగే మండల స్థాయిలో బీపీ మండల్ విగ్రహాలను నెలకొల్పాలి. మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏటా ఆగస్టు7ను మండల్ డేగా జరుపుకుంటున్నాం.
- సాధం వెంకట్,
సీనియర్ జర్నలిస్ట్