‘బ్రహ్మాస్త్ర’ సినిమాని మూడు పార్టులుగా అనౌన్స్ చేసినప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక పాపులర్ స్టార్స్ అందరూ యాక్ట్ చేయడం, ఆరేళ్ల పాటు ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించడం లాంటివి ఎక్స్పెక్టేషన్స్ ను మరింత పెంచేశాయి. ఎట్టకేలకు ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉంది?.. అంచనాలను అందుకుందా?.. ఆ మూవీ టీమ్ చెప్పినట్టు అద్భుతాలు సృష్టించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం..
కథేమిటంటే..
అస్త్రాలన్నింటికీ బ్రహ్మాస్త్ర అధిపతి. దాన్ని మూడు భాగాలుగా చేసి దుష్టశక్తుల చేతికి చిక్కకుండా ఒక గ్రూప్ కాపాడుతూ ఉంటుంది. ఆ మూడింటిలో ఒక భాగం అనీష్ (నాగార్జున) దగ్గర, రెండోది మోహన్ భార్గవ్ (షారుఖ్ ఖాన్) దగ్గర ఉంటాయి. మూడో భాగం కోసం శక్తులన్నీ వెతుకుతుంటాయి. ఈ మూడు భాగాలనూ కలిసి బ్రహ్మాస్త్రను పొందాలని మౌనీరాయ్ గ్రూప్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకోసం బ్రహ్మాస్త్ర గ్రూప్‌లోని వారందరినీ చంపేస్తూ ఉంటారు. ఇదంతా డీజే శివ (రణ్‌బీర్)కి తెలుస్తూ ఉంటుంది. ఏం జరుగుతోందో అర్థం కాక అతను సతమతమవుతుంటాడు. అసలు అతనికీ బ్రహ్మాస్త్రకి సంబంధం ఏంటి, అది తెలిశాక అతనేం చేశాడు అనేది మిగతా కథ.
ఎలా ఉందంటే..
ఫ్యాంటసీ అనేది చాలా రిస్కీ సబ్జెక్ట్. ఎందుకంటే అదంతా ఊహల్లో అందంగా ఉంటుంది. రియాల్టీలో ఎలా ఉంటుంది అనేది తెరకెక్కించాక గానీ అర్థం కాదు. అలాంటి ఓ సబ్జెక్ట్ ను తీసుకుని ఆరేళ్ల పాటు చెక్కాడు అయాన్ ముఖర్జీ. పైగా నటించినవారంతా పెద్ద పెద్ద వాళ్లు. దాంతో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందా అని అంచనాలు వేయడం కామన్. అయితే సినిమా తయారయ్యేటప్పుడు చెప్పిన విషయాల స్థాయిలో తెరపై విజువల్స్ ఉన్నాయా లేదా అనేది చాలా అవసరం. చరిత్రలో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు అనే రేంజ్‌లో ఈ సినిమా గురించి చెప్పారు మేకర్స్, యాక్టర్స్. అది నిజమేననుకుంటే మాత్రం డిజప్పాయింట్‌మెంట్ తప్పదు. ఇదొక హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్. చాలా రిచ్‌గా తీశారు. వాళ్లు పెట్టిన ఖర్చంతా తెరపై ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
అయితే ప్రేక్షకుడిని చివరి వరకు సీటులో కూర్చోబెట్టడానికి అదొక్కటే చాలదు. కథ వినడానికి బానేవున్నా కథనం దాన్ని బలపర్చేలా లేదు. చాలా సీన్స్ ఆకట్టుకోలేదు. చాలా చక్కగా మొదలైన మూవీ ముందుకు వెళ్లేకొద్దీ మూసగా అనిపిస్తుంది. సెకెండాఫ్ అయితే పూర్తిగా వీక్ అనిపిస్తుంది. కనీసం హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా సరిగ్గా లేదు. స్లో నేరేషన్ అతి పెద్ద మైనస్. ఇంత ల్యాగ్‌ని భరించడం ప్రేక్షకుడి వల్ల కాదు. అయినా ఇలాంటి సినిమాల నుంచి కోరుకునేదే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అవి లేకుండా ఎలా సక్సెస్ అవుతామనుకున్నారనేది అతి పెద్ద ప్రశ్న. నెగిటివ్ ఫోర్స్ కు పాజిటివ్ ఫోర్స్ కు మధ్య పోరు మామూలుగా ఉంటుందా.. దాన్ని కూడా నీరసంగా తీస్తే ఇక ఏం చూసి ఆనందించాలి ఆడియెన్స్! చేతిలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. కావలసినంత ఖర్చుపెట్టే నిర్మాతలు ఉన్నారు. ఆరేళ్లు తీసుకున్నా వాళ్లు కిక్కురుమనలేదు. అలాంటప్పుడు ఎలాంటి ఔట్‌పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ విషయంలో పూర్తిగా నిరాశ చెందాల్సిందే. కథ, కథనాలను గాలికొదిలేసి మేకింగ్ మీద దృష్టి పెడితే ఎలాంటి సినిమాలు బయటికొస్తాయనేదానికి బ్రహ్మాస్త్ర బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచింది.
ఎవరెలా చేశారంటే..
వంక పెట్టడానికి అవకాశం ఇవ్వని నటీనటులున్నారు. వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. శివ పాత్రలో రణ్‌బీర్ కపూర్ బెస్ట్ ఇచ్చాడు. ఎమోషన్స్ ని పలికించిన తీరుకి ఫుల్ మార్కులు వేయొచ్చు. ఆలియా చేసిన అద్భుతమైన పాత్రలు ఎన్నో చూశాక ఇందులోని ఆమె పాత్రపై ఎలాంటి ప్రత్యేకమైన ఫీల్ కలగదు. ఇలాంటి రోల్స్ వల్ల తన ఇమేజ్ కొత్తగా పెరిగేదేమీ లేదు. కానీ ఎప్పటిలానే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. అమితాబ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. లెజెండ్ అనిపించారు. నాగార్జున, షారుఖ్‌ల పాత్ర పరిధి తక్కువ.. అయినా వాటికి న్యాయం చేశారు. నెగిటివ్ పాత్రలో మౌనీ రాయ్ మెప్పించింది. మిగతా వారంతా మామూలే.
ఇక టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే.. ఈ సినిమాకి మ్యూజిక్ పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. సినిమాలో గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ లేకపోవడం వల్ల నిరాశ చెందాడో ఏమో తెలీదు కానీ.. సంగీత దర్శకుడు బీజీఎంని పూర్తిగా తేల్చేశాడు. పాటలు కాస్త ఫర్వాలేదు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి చెప్పుకోడానికేమీ లేదు. సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్ బాగుంది. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది వీటితో అర్థమయ్యింది. అయితే ఏవి ఎంత బాగున్నా అసలు కథనమే సరిగ్గా లేనప్పుడు ఏం ప్రయోజనం! అయాన్ అనుభవం లేని దర్శకుడేమీ కాదు. కానీ తన అనుభవాన్ని మించిన బాధ్యతను నెత్తిన పెట్టుకున్నాడేమో అనిపిస్తుంది సినిమా చూసినంతసేపు. కథలో తనకి క్లారిటీ ఉందో లేదో తెలీదు కానీ ప్రేక్షకుడికి మాత్రం అతనేం చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు. కాబట్టి నిరాశ చెందక తప్పదు. గ్రాఫిక్ వర్క్ ఎలా ఉంటుందో చూడాలనుకునేవారిని తప్ప మిగతావారిని ఈ సినిమా ఏ రకంగానూ అలరించదు.
కొసమెరుపు: బ్రహ్మాస్త్ర అస్త్రం గురి తప్పింది, బ్రహ్మాస్త్ర: అంత శక్తి లేదు.
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారుఖ్ ఖాన్, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా తదితరులు
సంగీతం: ప్రీతమ్
నిర్మాణం: కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, మార్క్ జె డిసూజా, అయాన్ ముఖర్జీ
దర్శకత్వం: అయాన్ ముఖర్జీ