ఇయ్యాల్టి నుంచి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు రెడీ అయింది. మంగళవారం నుంచి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వయంభూ నరసింహుడు కొలువైన ప్రధానాలయ పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న మొట్టమొదటి బ్రహ్మోత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని ప్రధానాలయాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 21న స్వస్తివాచనంతో మొదలై మార్చి 3న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. ఈ నెల 22న ధ్వజారోహణం, 27న ఎదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో నిత్యం నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలను తాత్కాలికంగా రద్దు చేశారు. 

23 నుంచి అలంకార, వాహన సేవలు

ఈ నెల 23న ఉదయం మత్స్యాలంకార సేవ, రాత్రి శేషవాహన సేవ.. 24న ఉదయం వటపత్రశాయి, రాత్రి హంసవాహన సేవ నిర్వహించనున్నారు. ఇక 25న ఉదయం శ్రీకృష్ణ అలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ.. 26న ఉదయం గోవర్ధనగిరిధారి, రాత్రి సింహవాహన సేవ జరపనున్నారు. ఇక 27న ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు.. 28న ఉదయం శ్రీరామ అలంకార సేవ, రాత్రి 8 గంటలకు లక్ష్మీనారసింహుల తిరుకల్యాణం.. మార్చి 1న ఉదయం మహావిష్ణు అలంకార సేవ, రాత్రి 7గంటలకు దివ్య విమాన రథోత్సవం, మార్చి 2న మహాపూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం పుష్పయాగం, దేవతా ఉద్వాసన నిర్వహించనున్నారు. మార్చి 3న నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. ఈ11 రోజులు ఉదయం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కల్యాణానికి సీఎం కేసీఆర్ దంపతులు

ఈ నెల 28న నిర్వహించే స్వామివారి తిరుకల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ దేవస్థానానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ తమిళిసై కూడా కల్యాణంలో పాల్గొని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. టీటీడీ, పోచం పల్లి చేనేత సంఘం తరఫున కూడా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం.

ఆలయ పునఃప్రారంభం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా.. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించే ముఖ్య ఘట్టాల నిర్వహణకు సర్వం సిద్ధం చేశాం. వీఐపీలు ఎంతమంది వచ్చినా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణ టికెట్ల ధరను రూ.3 వేలుగా నిర్ణయించి ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచాం. ఒక టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది.

- యాదగిరిగుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి