
- నేటి నుంచి 11వ తేదీ వరకు యాదగిరిగుట్టలో ఉత్సవాలు
- 7న ఎదుర్కోలు, 8న కల్యాణం, 9న రథోత్సవం
- ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కల్యాణం టికెట్లు
- సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సలు మొదలయ్యాయి. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. మార్చి 1 నుంచి మార్చి 11 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేటి ఉదయం స్వస్తివాచనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉత్సవాల సందర్భంగా యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో ప్రత్యేక లైటింగ్, స్పెషల్ సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. సప్తగోపుర సముదాయంగా నిర్మించిన ప్రధానాలయానికి లేజర్ లైటింగ్, యాదగిరికొండను ప్రత్యేక విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూ. 3.15 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి యాదగిరిగుట్టకు ఆర్టీసీ ఆధ్వర్యంలో బస్సులు నడపనున్నారు.
3 నుంచి అలంకార సేవలు
స్వస్తివాచనంతో మొదలు కానున్న బ్రహ్మోత్సవాల్లో 2వ తేదీన ధ్వజారోహణం, గరుడముద్దలు ఎగురవేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. 3వ తేదీ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారికి వివిధ రకాల అలంకార, వాహన సేవలు నిర్వహించనున్నారు. 7న రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించిన అనంతరం ఎదుర్కోలు, 8న గజవాహన సేవ తర్వాత లక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవం, 9న రాత్రి 7 గంటలకు దివ్యవిమాన రథోత్సవం నిర్వహించనున్నారు. 11న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలను రద్దు చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట
బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు దేవస్థానం పెద్దపీట వేసింది. ఇందుకోసం ప్రధానాలయ ఉత్తర దిక్కున ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. మార్చి 1 నుంచి 3 వరకు నృసింహ వైభవంపై గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు, 4న ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌చే భక్తి సంగీత విభావరి, 5న ప్రముఖ జానపద, సినీ గాయకురాలు తేలు విజయతో భక్తి సంగీత కార్యక్రమం, 6న శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌చే అన్నమయ్య సంకీర్తన విభావరి, 7న డాక్టర్ శోభారాజ్‌తే అన్నమాచార్య, త్యాగరాజ కీర్తనలు, భక్తి సంగీతం, 9న లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు, సంగీత దర్శకుడు కోమండూరి రామాచార్యులచే మ్యూజికల్ ఈవెంట్స్ జరగనున్నాయి.
కల్యాణం టికెట్ రూ. 3 వేలు
నారసింహుడి కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ఆఫీసర్లు కల్యాణ టికెట్లను అందుబాటులో ఉంచారు. టికెట్ రేటును రూ. 3 వేలుగా నిర్ణయించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కల్యాణంలో పాల్గొనే దంపతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతి రోజు వెయ్యి మందికి అన్నదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు.