
- నేటి నుంచి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు
- 9 రోజుల ఉత్సవాలకు హాజరుకానున్న లక్షల మంది భక్తులు
సంగారెడ్డి (గుమ్మడిదల), వెలుగు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెంలోని బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయంలో ఈనెల 30 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. తొమ్మిది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలకు హైదరాబాద్ తోపాటు చుట్టుపక్కల రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరుకానున్నారు. దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఈ ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఐదు దశాబ్దాల చరిత్ర
ఐదు దశాబ్దాల చరిత్ర గల భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం హైదరాబాద్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతంలో స్వామివారు పాముల పుట్టలో స్వయంభుగా వెలిసినట్టు ప్రచారంలో ఉంది. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు స్వామిని ఇలవేల్పుగా కొలుస్తూ శుభకార్యాలు, వివాహాలు చేసుకునే ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు, వీరభద్ర ప్రస్తాయం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. స్వామి వారి సన్నిధిలో తరచుగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రస్తుతం మరింత విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు వైపులా ప్రాకారాలు, సత్రాలు నిర్మించి ఆలయ ప్రాంగణంలోని కోనేటిని పునరుద్ధరించారు.
తొమ్మిది రోజులు ఇలా..
భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఉత్సవాలు శనివారం నుంచి ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు ఉదయం సుప్రభాతం, బిందె తీర్థం, బాలభోగము, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై నందీశ్వర వాహన సేవ నిర్వహిస్తారు. రెండో రోజు ఆదివారం ఆశ్వవాహన సేవ, ఏప్రిల్ 1న హంసవాహన సేవ, 2న బృంగీశ్వర వాహన సేవ, 3న పొన్నవాహన సేవ, అగ్నిగుండాలు తొక్కడం ఉంటుంది.
4నస్వామి వారి కల్యాణోత్సవం, 5న రథోత్సవం, 6న దోపుసేవ, మిరిమిడి, పూర్ణాహుతి, రాత్రి నాకబలి నిర్వహిస్తారు. 7న ఏకాంత సేవ, డోలోత్సవం, పవళింపు సేవతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో శశిధర్ గుప్తా మాట్లాడుతూ.. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు కల్పిస్తామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేయించి తాగునీటి సౌకర్యాలు కల్పించినట్టు వెల్లడించారు.
ఆలయానికి ఎలా చేరుకోవాలి..
బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయానికి వెళ్లేందుకు అన్ని వైపుల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వారు బోధన్ ద్వారా బొంతపల్లి కమాన్ వరకు చేరుకోవచ్చు. మెదక్ వైపు నుంచి వచ్చే వారు హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో బొంతపల్లికి రావచ్చు. కమాన్ నుంచి ఆటో ద్వారా రెండు కిలోమీటర్ల దూరంలో ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. సంగారెడ్డి, పటాన్‌చెరు ప్రాంతాల నుంచి ఆలయానికి నేరుగా బస్సు సౌకర్యాలు ఉన్నాయి.