అడ్డాకుల, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలో దక్షిణ కాశీగా పేరొందిన కందూరు రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ రమేశ్ గౌడ్ తెలిపారు.
బ్రహ్మోత్సవాల వివరాలు..
శనివారం యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, త్రిశూల పూజ, అగ్ని ప్రతిష్ఠాపన, 5న పార్వతీపరమేశ్వరుల కల్యాణం, 6న ధ్వజారోహణ, బలిహరణ, అశ్వవాహన సేవ,7న రథోత్సవం, 8న వృషభ వాహన సేవ, 9 రుద్రహోమం, మహా పూర్ణాహుతి, త్రిశూల స్నానం, తీర్థావళితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ నెల10 నుంచి 30 వరకు జాతర కొనసాగనుంది.
కాశీ తరహాలో కల్ప వృక్షాలు
కాశీలో మారిదిగానే కందూరు క్షేత్రంలో కల్ప వృక్షాలు ఉన్నాయి. ఇక్కడి కోనేరు చుట్టూ కల్ప వృక్షాలు ఉండడం విశేషం. ప్రతి ఏటా కార్తీక మాసంలో ప్రజలు కల్ప వృక్షాల కింద వన భోజనాలు చేస్తారు. అలా చేయడం వల్ల మంచి జరుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ క్షేత్రాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.
రూట్ మ్యాప్
కందూరు టెంపుల్ కొమిరెడ్డిపల్లి–-శాఖాపూర్ టోల్గేట్ మధ్యలో ఉంది. హైదరాబాద్, కర్నూల్ నుంచి వచ్చే వారు ఎన్‌హెచ్-44 మీదుగా కందూరు స్టేజీ వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి రామలింగేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. రైలు మార్గానా వచ్చేవారు మదనాపురం, మహబూబ్‌నగర్‌కు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.