శరణు మల్లన్నా.. శరణు అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఐలోని జాతర

  • భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
  • డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో మార్మోగిన ఐనవోలు
  • బోనాలు సమర్పించి, వరాలు పట్టి మొక్కుల చెల్లింపు

హనుమకొండ/వర్ధన్నపేట, వెలుగు : ఒగ్గుడోలు చప్పుళ్లు.. గజ్జెల లాగుల సవ్వళ్లు.. శివసత్తుల పూనకాలతో ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం మారుమోగింది. హనుమకొండ జిల్లాలోని ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రుద్రాభిషేకంతో పాటు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

సోమవారం భోగి పండుగ కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామి వారికి వరం పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గు కళాకారులు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి పసుపు బండారి పట్నాలు వేయగా.. భక్తులు బోనాలతో మల్లన్నకు మొక్కులు సమర్పించారు

భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ధర్మదర్శనానికి సుమారు రెండు గంటలు పట్టడంతో భక్తులు కాస్త ఇబ్బంది పడ్డారు. వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులను ఇబ్బంది పెట్టడంపై మండిపడ్డారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మొత్తంగా 36 మంది సిబ్బందికి మూడు షిఫ్ట్‌‌లలో విధులు కేటాయించారు. హెల్త్‌‌ క్యాంప్‌‌ని సోమవారం డీఎంహెచ్‌‌వో అప్పయ్య సందర్శించారు. 

మొక్కులు చెల్లించుకున్న లీడర్లు

ఐనవోలు మల్లికార్జునస్వామిని సోమవారం పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు దర్శించుకున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌‌ నాగరాజు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, వరంగల్‌‌ మేయర్‌‌ గుండు సుధారాణి, టెస్కాబ్ చైర్మన్‌‌ మార్నేని రవీందర్‌‌రావు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు జాతరలో పర్యటించి భక్తులతో మాట్లాడారు. జాతరలో ఏర్పాట్లు, కలుగుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. 

కొత్తకొండలో...

భీమదేవరపల్లి, వెలుగు : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి. భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం ఆలయంలో అరుణ యంత్ర స్థాపన చేసి, ప్రత్యేకపూజలు చేశారు. ఉల్లిగడ్డ దామెర, కడిపికొండ గ్రామాలకు చెందిన కుమ్మరుల కుటుంబాలు వీరబోనం తీసుకురావడంతో జాతర అధికారికంగా ప్రారంభమైంది. ఉత్తర తెలంగాణతో మహారాష్ట్ర, కర్నాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 500 మంది పోలీస్‌‌ సిబ్బందిని ఏర్పాటు చేయగా, 30 సీసీ కెమెరాలు,2 డ్రోన్‌‌ కెమెరాలు, షీ టీమ్‌‌లతో గస్తీ నిర్వహిస్తున్నారు. జాతర వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని డీఎంహెచ్‌‌వో అప్పయ్య సోమవారం సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిక్సూచి బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు ఆలయ చైర్మన్‌‌ కొమురవెళ్లి చంద్రశేఖర్‌‌ గుప్తా, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌‌ కమిషనర్‌‌ రామాల సునీత తెలిపారు.