కల్యాణం.. కమనీయం.. నర్సన్న లగ్గంతో పులకించిన యాదగిరి గుట్ట

కల్యాణం.. కమనీయం.. నర్సన్న లగ్గంతో పులకించిన యాదగిరి గుట్ట
  • భారీ సంఖ్యలో హాజరైన భక్తులు
  • ఉదయం హనుమంత వాహనంపై నృసింహుడి ఊరేగింపు
  • రాత్రి గజవాహనంపై విహరించిన కల్యాణ నారసింహుడు 
  • ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన విప్  బీర్ల అయిలయ్య దంపతులు

యాదగిరిగుట్ట, వెలుగు : అర్చకులు వేద మంత్రాలు చదువుతుండగా.. భక్తులు నమో నారసింహ అంటూ జయజయధ్వానాలు చేస్తుండగా యాదగిరి నర్సన్న అమ్మవారి మెడలో తాళి కట్టాడు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం కనులపండువగా సాగింది. రాత్రి 8.45 గంటలకు ప్రారంభమైన కల్యాణ తంతు సుమారు రెండు గంటల పాటు సాగింది. అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ జీలకర్రబెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి కార్యక్రమాలు జరిపించారు. ముందుగా స్వామిఅమ్మవార్లను పట్టు పీతాంబరాలతో అందంగా ముస్తాబు చేశారు. బంగారు నగలు, వజ్ర వైఢూర్యాలతో పెళ్లికొడుకుగా ముస్తాబైన స్వామివారు గజవాహనంపై ప్రధానాలయ మాడవీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అనంతరం ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం ప్రారంభించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, దేవాదాయ శాఖ కమిషనర్‌‌ శ్రీధర్‌‌తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ‘జై నారసింహా, గోవిందా’ నామస్మరణతో యాదగిరిగుట్ట మారుమోగింది.

హనుమంతవాహనంపై ఊరేగింపు..

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నారసింహుడు శ్రీరామచంద్రుడి అలంకారంలో హనుమంత వాహనంపై ఆలయ తిరువీధుల్లో విహరించారు. అనంతరం ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదుట రామావతార అలంకార సేవను అధిష్టింపజేసి, అలంకార విశిష్టతను అర్చకులు వివరించారు. సాయంత్రం నారసింహుడిని పెండ్లి కొడుకుగా ముస్తాబు చేసిన అర్చకులు గజవాహనంపై 
ఊరేగించారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండపైన నిర్వహిస్తున్న సాంస్కృతిక, ధార్మిక, సంగీత, సాహిత్య మహాసభలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు భక్తులను కట్టిపడేశాయి. ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా భజన కార్యక్రమాలు, నవనారసింహ క్షేత్రంపై ఉపన్యాసం, సుగ్రీవ పట్టాభిషేకం హరికథాగానం, వీణావాద్యం, వేణుగానం, భక్తిసంగీతం నిర్వహించారు. 

నేడు దివ్యవిమాన రథోత్సవం

లక్ష్మీ నారసింహుడిని ఆదివారం ఉదయం 10 శ్రీమహావిష్ణువుగా అలంకరించి, గరుడ వాహనంపై ఊరేగించనున్నారు. రాత్రి 8 గంటలకు దివ్య విమాన రథోత్సవం జరపనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ అధికారులు ఇప్పటికే
 పూర్తి చేశారు.