కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని మార్కెట్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అంకురార్పణ నిర్వహించారు. ఉదయం కరీంనగర్ పాత బజారులోని శ్రీగౌరీశంకర స్వామి దేవస్థానం(శివాలయం) నుంచి పుట్టమన్ను తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధన నిర్వహించారు. అనంతరం కరీంనగర్ వీధుల్లో నిర్వహించిన స్వామివారి శేషవాహన సేవకు భక్తులు వేలాదిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.