కీసర గుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

కీసర గుట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
  • ఘనంగా శివ పార్వతుల కల్యాణం
  • పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ పట్నం దంపతులు 
  • నేడు మహా శివరాత్రి ఉత్సవాలు

కీసర, వెలుగు : కీసరగుట్టలో మహా శివరాత్రి సందర్భంగా సోమవారం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా, రెండో రోజైన మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం యాగశాలలో రుద్ర స్వాహాకర హోమం నిర్వహించారు. బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకుని  క్యూ లైన్లతో పాటు మంచినీళ్లు, టాయిలెట్లు, పందిళ్లు,  ఇతర ఏర్పాట్లు చేయగా,   కీసర ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి  పరిశీలించారు.  

అలాగే  సాయంత్రం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని కీసర నుంచి కీసర గుట్టకు తీసుకొని వచ్చారు. రాత్రి వేళలో శివ పార్వతుల కళ్యాణం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి  భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ విజయేంద్ర ప్రసాద్ రెడ్డి,ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ, ఈఓ సుధాకర్ రెడ్డి,  కీసర తహసీల్దార్ అశోక్ కుమార్,డిప్యూటీ తహసీల్దార్ అశ్విన్ కుమార్ ఆలయ ఫౌండర్ వెంకటేష్ శర్మ పాల్గొన్నారు.బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, రాత్రికి నందివాహన సేవ కార్యక్రమాలు జరగనున్నాయి.