జన జాతరలు.. జనసంద్రమైన కొత్తకొండ, ఐనవోలుకు పోటెత్తిన భక్తులు

జనసంద్రమైన కొత్తకొండ

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. భద్రకాళీ సమేత వీరభద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలేరు గ్రామం నుంచి జనక వంశం వారు మేకపోతుల రథాలతో దేవుడికి ఫలహార బండిని తీసుకువచ్చారు. కొత్తపల్లికి చెందిన 54 రథాలు రంగురంగుల అలంకరణతో బ్రహ్మోత్సవాలకే వన్నె తెచ్చాయి.

ఖాజీపేట ఏసీపీ తిరుమల్​ నేతృత్వంలో 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. కొత్తకొండ వీరన్నను మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్​ నాగరాజు, వరంగల్​ సీపీ అంబర్​ కిశోర్​ ఝూ, ఈస్ట్​జోన్​ డీసీపీ సలీమా, యువ ఐపీఎస్​ పత్తిపాక సాయికుమార్, డీఎంహెచ్​వో అప్పయ్య తదితరులు దర్శించున్నారు. సీపీ ఎడ్ల బండి ఎక్కి గుడి చుట్టూ ప్రదర్శన చేశారు.- భీమదేవరపల్లి, వెలుగు

ఐనవోలుకు పోటెత్తిన భక్తులు

ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఒంటిమామిడిపల్లి, లక్ష్మీపురం, నాగపురం సహా పరిసర గ్రామాల రైతులు ప్రభ బండ్లను ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. మార్నేని వంశస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెద్దబండి శోభాయాత్ర స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఇంటి వద్ద పెద్ద బండికి ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకువచ్చారు

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టగా, సీసీ కెమెరాల పనితీరును, ఏర్పాట్లను ఎమ్మెల్యే నాగరాజు పరిశీలించారు. ఇల్లంద  గ్రామానికి చెందిన గొల్లకుర్మలకు ఎమ్మెల్యే నాగరాజు డోలు పంపిణీ చేసి, వారితో కలిసి డోలు కొట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న గౌడ్, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖ వరంగల్ ఉప కమిషనర్ సంధ్యారాణి, సహాయ కమిషనర్ సునీత తదితరులు దర్శించుకున్నారు.   

వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు