మత్స్యావతారంలో యాదగిరీశుడు

మత్స్యావతారంలో యాదగిరీశుడు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనులపండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి స్వామివారికి అలంకార, వాహన సేవలు మొదలయ్యాయి. మొదటిరోజున స్వామి వారు మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. ఉదయం 10 గంటలకు స్వామివారని ప్రత్యేకంగా అలంకరించి ప్రధానాలయ మాఢ వీధుల్లో ఊరేగించారు. 

అనంతరం తూర్పు రాజగోపురం ఎదుట ప్రత్యేక వేదికపై స్వామివారిని అధిష్ఠింపజేసి మత్స్యావతార విశిష్టతను వివరించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి వారిని స్వర్ణ శేష వాహనంపై విహరింపజేశారు. రాత్రి ఆలయంలో నిత్యారాధనలు ముగిసిన అనంతరం లక్ష్మీనారసింహులను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. శేషవాహనంపై స్వామివారిని అధిష్ఠింపజేసి ప్రధానాలయ వీధుల్లో ఊరేగించారు. ఉత్సవాల్లో ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు, చైర్మన్‌‌‌‌‌‌‌‌ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌శర్మ, ఏఈవోలు గజవెల్లి రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు, రఘు, నవీన్ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు..

నారసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారికి వటపత్రశాయి అలంకార సేవ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు స్వామివారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.