సింగోటం(నాగర్ కర్నూల్), వెలుగు: రెండో యాదగిరిగుట్టగా పిలిచే సింగోటం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పని చేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆదేశించారు. జనవరి 15 –21 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై గురువారం ఆలయ ప్రాంగణంలో కలెక్టర్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వారికి కేటాయించిన విధులు నిర్వహించాలన్నారు. పార్కింగ్, లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాట్లపై ఫోకస్పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. బ్రహ్మోత్సవాలకు ఇన్చార్జిగా కొల్లాపూర్ ఆర్డీవో ఉంటారని, త్వరలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారని, రథోత్సవం రోజున ఎక్కువగా వస్తారన్నారు. ఆర్డీవో హనుమాన్ నాయక్, ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాజా ఆదిత్య లక్ష్మణరావు,ఈవో, తదితరులు పాల్గొన్నారు.
శబరికి 2 ఆర్టీసీ బస్సులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యం కోసం రెండు కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ అయ్యప్ప ఆలయం నుంచి 35 మంది అయ్యప్ప మాలధారులు, వారి కుటుంబ సభ్యులు వెళ్తున్న ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సును కలెక్టర్ప్రారంభించారు. ప్రతి ఒక్కరు ఆర్టీసీ ని ప్రోత్సహించి సంస్థ లాభాల్లో నడిచేలా కృషి చేయాలన్నారు. డీఎం ధర్మం సింగ్, ఆర్టీసీ ఇన్స్పెక్టర్ స్వామి, నారాయణ పాల్గొన్నారు.
మన బడి కింద 15 రోజుల్లో వసతులు కల్పించాలి
నారాయణపేట/ ధన్వాడ, వెలుగు: స్టూడెంట్లలో ప్రతిభను పెంపొందించేందుకు టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. గురువారం ధన్వాడ, నారాయణపేట మండలాల్లో ‘మన ఊరు– మన బడి’ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల ఏర్పాటు 15 రోజుల్లో పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎస్ఎంసీ మెంబర్లు, సర్పంచ్‌లను కలెక్టర్ ఆదేశించారు. జడ్పీ హైస్కూల్లక్ష్మీపూర్, కొల్లంపల్లి, కొండాపుర్, హనుమాన్ పల్లి లోని స్కూళ్లను విజిట్‌చేసి ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని ఆదేశించారు. లక్ష్మీపూర్ ప్రైమరీ స్కూళ్లో కలెక్టర్ స్టూడెంట్లకు కాసేపు మ్యాథ్స్ క్లాసు చెప్పారు. విద్యాశాఖ సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో విద్యాసాగర్, ఆర్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం నారాయణపేటలో ఆరోగ్య వాహిని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ వైద్య సహాయం కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ ఏడాది కేసులు తగ్గినయ్
వనపర్తి/గద్వాల, వెలుగు: గత రెండేండ్లతో పోలిస్తే ఈ యేడు వనపర్తి జిల్లాలో కేసులు తగ్గాయని ఎస్పీ అపూర్వరావు చెప్పారు. గురువారం ఎస్పీ ఆఫీస్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రైంరేటు బాగా తగ్గించామని , సైబర్ క్రైంలో రికవరీకి స్పెషల్ల్యాబ్ను ఏర్పాటు చేసి వాటిని కూడా అదుపు చేస్తామన్నారు. ఈ యేడాది జిల్లాలో మొత్తం 1707 కేసులు ఫైల్అయ్యాయని ఎస్పీ వివరించారు. 2020 లో 2,346 కేసులు, 2021లో 2,086 కేసులు నమోదయ్యాయన్నారు. సైబర్ కేసులు 35 జరిగాయని, రికవరీ శాతం తక్కువగా ఉందని చెప్పారు. డ్రంకెన్‌డ్రైవ్ ద్వారా రూ. 2 కోట్ల 57 లక్షలు వసూలు చేయగా, 150 మందికి శిక్ష పడిందన్నారు. మహిళలపై వేదింపులు తగ్గాయని ఈవ్ టీజింగ్ కంట్రోల్‌కు 95 షీ టీం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. సీఐలు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
గద్వాల జిల్లాలో..
జిల్లాలో ఈ ఏడాది 13 శాతం క్రైమ్ రేటు తగ్గిందని, మోటార్ వెహికల్ యాక్ట్ కింద 1,11,923 కేసులు ఫైల్చేసి, రూ. 8.62 కోట్లు చలాన్లు వేశామని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. గురువారం ఎస్పీ ఆఫీస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పీడ్ గన్స్ ద్వారా 44,780 కేసులు నమోదు చేసి రూ. 4. 63 కోట్లు ఫైన్లు వేశామన్నారు. రెండింటిలో రూ. 13. 25కోట్లు ఫైన్లు వసూలు చేశామన్నారు. డ్రంకెన్డ్రైవ్కేసులు1,974 నమోదు చేసి రూ. 8. 06 లక్షలు వసూలు చేశామని ఎస్పీ చెప్పారు. 2021లో 2,236 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2019 కేసులు ఫైల్చేశామన్నారు. గతంతో పోలిస్తే రేప్ కేసులు పెరిగాయన్నారు. నకిలీ విత్తనాల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఎస్పీ రంగస్వామి, సీఐలు పాల్గొన్నారు.
పేదలకు అందని ప్రభుత్వ వైద్యం
అమ్రాబాద్, వెలుగు: పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిందని బీఆర్ఎస్లీడర్పోతుగంటి భరత్ విమర్శించారు. గురువారం మండలంలోని ఎల్మపల్లి గ్రామంలో వైద్యం అందక మృతి చెందిన స్వర్ణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదలకు సకాలంలో వైద్యమందించడంలో ఆఫీసర్లు విఫలమవుతున్నారన్నారు. వంకేశ్వరం గ్రామం నుంచి మహబూబ్నగర్వరకు వివిధ ఆస్పత్రులు తిరుగుతూ ట్రీట్మెంట్కోసం ప్రయత్నించినప్పటికీ వైద్యమందక తల్లి కూతుళ్లు చనిపోయారన్నారు. జడ్పీ మీటింగ్స్‌లో ఎన్నో సార్లు ఈ అంశాన్ని చర్చించినా మార్పు రావడం లేదని వాపోయారు. పేదల ప్రాణాలు పోతుంటే తట్టుకోలేక ప్రశ్నిస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. ఏజెన్సీ పేరుతో వెనుకబడిన ప్రాంతాన్ని పట్టించుకుంటలేరని, ప్రజలు ప్రశ్నించడం నేర్చుకోవాలని భరత్సూచించారు. బీఆర్ఎస్ లీడర్లు నాగయ్య గౌడ్, శ్రీనివాస్, బాలరాజ్, రమేశ్ పాల్గొన్నారు.
హత్య కేసు నిందితుడి అరెస్ట్
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మాచారం గ్రామంలో ఈ నెల 23న జరిగిన హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు. సీఐ ఆదిరెడ్డి వివరాల ప్రకారం.. ఏడాది కింద నిందితుడు జ్ఞానేశ్వర్ కు మన్ననూర్గ్రామానికి చెందిన ఒక యువతితో పెళ్లి సంబంధం వచ్చింది. కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని, చేసుకోనని ఏదీ చెప్పలేదు. అయితే సదరు అమ్మాయి లింగస్వామి అనే మరో యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలిసిన జ్ఞానేశ్వర్ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడు. ఈ విషయం యువతి తన లవర్లింగస్వామికి చెప్పింది. దీంతో అతడు ఆ అమ్మాయి వెంటపడొద్దని జ్ఞానేశ్వర్‌ను హెచ్చరించాడు. దీంతో ఎలాగైనా యువతిని పెళ్లి చేసుకోవాలని, అందుకు అడ్డుగా ఉన్న లింగస్వామిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 23న అచ్చంపేట నుంచి బైక్ పై వస్తున్న లింగస్వామిని అనుకరించి మాచారం చేరుకోగానే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి పరారయ్యాడు. గురువారం పోలీసుల ఎదుట లొంగిపోవడంతో పోలీసులు అతడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఎస్సైలు వీరబాబు, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఒత్తిడితోనే బీజేపీ లీడర్లపై కేసులు
వనపర్తి, వెలుగు: ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ధర్నాలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించారని ఆరోపిస్తే.. సమాధానం చెప్పలేని మంత్రి బీజేపీ లీడర్లపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నారాయణ ఆరోపించారు. గురువారం పార్టీ ఆఫీస్‌లో ప్రెస్మీట్లో మాట్లాడారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బి.కృష్ణ, మంత్రి నిరంజన్ రెడ్డికి గల వందల ఎకరాల భూమికి వచ్చే ‘రైతు బంధు’ సొమ్మును పేదలకు పంచాలని డిమాండ్ చేశామని నారాయణ వివరించారు. మంత్రిని అసభ్య పదజాలంతో దూషించలేదని, అయినా పోలీసులకు కంప్లైంట్‌చేసి పలువురు లీడర్లపై కేసులు పెట్టించారన్నారు. గతంలో ప్రధాని మోడీ ని మంత్రి నిరంజన్‌రెడ్డి దూషించారని ఆయనపై కేసు ఫైల్చేయాలని డిమాండ్‌చేశారు. జిల్లా కార్యదర్శి బి.పరశురాం, జిల్లా అధికార ప్రతినిధులు పెద్దిరాజు, బచ్చు రాము, లీడర్లు రామ్మోహన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్లాట్లు కబ్జా చేస్తున్రు.. న్యాయం చేయండి సారూ..
కొల్లాపూర్‌లో బాధితుల ర్యాలీ
కొల్లాపూర్(నాగర్ కర్నూల్), వెలుగు: పట్టణంలోని చౌటబెట్ల సమీపంలోని సర్వేనెం.104లో 2014లో కొన్న ప్లాట్లను వదిలేసి వెళ్లమని మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఖాదర్ పాషా బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ గురువారం కొల్లాపూర్ టౌన్లో బాధితులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి అనుచరుడైన ఖాదర్ పాషా నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు చంద్రకళ, కుర్మయ్య, నవీన్, పద్మ నర్సింహ్మతో పాటు 25 మంది ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ప్లాట్లను కబ్జా చేసి ఖాదర్‌పాషా కొత్తగా ఏర్పాటు చేసిన వెంచర్లో వారు రాళ్లు పీకేశారు. గోడలు కూలగొట్టారు. ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి న్యాయం చేయాలని కోరారు.
‘రైతుబంధు’ రాలేదని ట్యాంక్ ఎక్కిన యువరైతు
మదనాపురం, వెలుగు : మండలంలోని కొన్నూరు గ్రామంలో ‘రైతు బంధు’ నగదు జమ కాలేదని ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి తన ఎకరా భూమికి సంబంధించిన ‘రైతు బంధు’ నగదు జమ కాలేదు. దీంతో మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకుంటానని ‘భగీరథ’ ట్యాంక్ఎక్కాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై మంజునాథరెడ్డి, రెవెన్యూ ఆఫీసర్లు అక్కడికి చేరుకుని రైతు బంధు నగదు ఖాతాలో వేయిస్తామని ఎంత నచ్చజెప్పినా వినలేదు. అయితే ఆఫీసర్లు మాట్లాడుతూ 20 రోజుల కింద అప్లై చేశాడని, అందుకే రైతు బంధు రాలేదని చెప్పారు. రాత్రి అయినంక గ్రామస్తులు సర్దిచెప్పడంతో ట్యాంక్ దిగి వచ్చాడు. ఇటీవల వెంకటేశ్వర్‌రెడ్డి మానసిక స్థితి కూడా సరిగా లేదని గ్రామస్తులు చెప్పారు.