తెలంగాణ వాదనకే కృష్ణా ట్రిబ్యునల్​ మొగ్గు

  • గంపగుత్త కేటాయింపుల్లో ఏపీ, తెలంగాణ వాటాలు తేల్చడమే ముఖ్యమన్న బ్రజేష్​కుమార్ ​ట్రిబ్యునల్​
  • సెక్షన్​ 3పైనే తొలుత వాదనలు వింటామని వెల్లడి
  • తర్వాతే సెక్షన్​ 89 ప్రకారం కేటాయింపులపై తేలుస్తామని క్లారిటీ
  • రెండు సెక్షన్లలోనూ కొన్ని అంశాలు ఒకేలా ఉన్నాయన్న కేడబ్ల్యూడీటీ -2
  • రెండింటిని కలిపి విచారిస్తే కూడా సమస్యేనని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల వివాదాలపై ఏర్పాటుచేసిన బ్రజేష్​కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ –2)లో తెలంగాణ పంతం నెగ్గింది. సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఇరిగేషన్​ ఆఫీసర్ల కృషి ఫలించింది. తెలంగాణ విజ్ఞప్తి మేరకు తొలుత గంపగుత్త కేటాయింపుల్లో తెలుగు రాష్ట్రాల వాటాలను తేలుస్తామని, ఇందుకు సంబంధించి  అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టంలోని సెక్షన్​ 3పైనే తొలుత వాదనలు వింటామని బ్రజేశ్​ కుమార్​ ట్రిబ్యునల్​ తేల్చి చెప్పింది. గురువారం దీనిపై ట్రిబ్యునల్​ ఆర్డర్స్​ను జారీ చేసింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్​ 89 ప్రకారం ప్రాజెక్టులవారీ కేటాయింపులను తొలుత తేల్చాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్​ కొట్టిపారేసింది. వచ్చే నెల 19 నుంచి 21 వరకు సెక్షన్​ 3పై వాదనలు వింటామని స్పష్టం చేసింది.

రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడమే ఇంపార్టెంట్​

రెండు రాష్ట్రాలకు బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయించిన గంపగుత్త కేటాయింపుల్లో రెండు రాష్ట్రాల వాటాలు తేల్చడమే ప్రాధాన్యాంశమని ట్రిబ్యునల్​ పేర్కొంది. దానికే ఎక్కువ ఇంపార్టెన్స్​ ఉందని, రెండు రాష్ట్రాల వాటాలు తేలాకే ప్రాజెక్టులవారీ కేటాయింపులపైన దృష్టిపెడ్తామని వ్యాఖ్యానించింది. ‘‘సెక్షన్​ 89, సెక్షన్​ 3లోని పలు అంశాలు ఒకేలా ఉన్నాయి. కాబట్టి తొలుత సెక్షన్​ 3కి సంబంధించిన అంశాలను విచారిస్తే.. సెక్షన్​ 89లోని అంశాల ప్రస్తావన కూడా వస్తుంది. అలాంటి సందర్భంలో సెక్షన్​ 89కి సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారంగా ప్రవేశపెడితే పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది’’ అని ట్రిబ్యునల్​ పేర్కొన్నది. రెండు అంశాలను ఒకేసారి విచారిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని ట్రిబ్యునల్​ తెలిపింది.

రెండు అంశాలను కలిపి విచారించి.. ఆర్డర్స్​ జారీ చేస్తే పలు అంశాలపై స్పష్టత ఉండే అవకాశం లేదు. సెక్షన్​–3లోని ఫర్దర్​ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను కొట్టివేయాలంటూ ఏపీ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ఏపీకి అనుకూలంగా వస్తే.. ట్రిబ్యునల్​ గుర్తించిన అంశాలు, ఆర్డర్స్​తో పొంతన ఉండకపోవచ్చు. రెండు రిఫరెన్సుల్లో ఒకేలా ఉన్న అంశాలను వేరు చేయడమూ కష్టమవుతుంది. అందుకే రెండు రిఫరెన్సులను కలిపి విచారించడం సరైన నిర్ణయం కాదు. ఈ నేపథ్యంలోనే తొలుత తెలంగాణ చెప్తున్న సెక్షన్​3పైనే వాదనలు వింటాం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి సెక్షన్​ 89పై వాదనలు కొనసాగిస్తాం’’ అని ట్రిబ్యునల్​ స్పష్టం చేసింది.