- ఏడాది గడిచినా పిల్లర్ల స్థాయిలోనే..
- నిధులు మంజూరైతేనే పనులు ముందుకు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట వెటర్నరీ కాలేజ్ నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగి పశుసంపద అధికమవుతుందని భావించి సిద్దిపేటలో వెటర్నరీ కాలేజీని నిర్మించాలని బీఆర్ఎస్ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది మే 7న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రూ.120 కోట్ల అంచనాలతో కలెక్టరేట్ ప్రాంగణంలో వెటర్నరీ కాలేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 2024- విద్యా సంవత్సరంలో 120 మంది స్టూడెంట్స్‌కు ప్రవేశం కల్పించి 25 మంది సిబ్బందితో తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.
మొదట రూ.10 కోట్ల నిధులను విడుదల చేయగా పనులు ప్రారంభించారు. తర్వాత సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో పిల్లర్ల స్థాయిలోనే పనులు నిలిచిపొయాయి. ఇదే సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్ వల్ల ఆరు నెలలుగా పనులకు బ్రేక్ పడింది. అంతేకాక కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లలు అందకపోవడంతో పనులు నిలిపివేశారు. గత డిసెంబర్ వరకు జరిగిన పనులే తప్ప మల్లీ మొదలుకాలేదు. ప్రస్తుతం కాలేజీ కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే ముందుకు సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కాలేజీ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న టీజీఎంఎస్ఐడీసీ అధికారులు సైతం పనుల ప్రారంభం పై ఎలాంటి స్పష్టత నివ్వడంలేదు. ఇప్పటికే హైదరాబాద్, కోరుట్ల, వరంగల్‌లో వెటర్నరీ కాలేజీలు ఉండగా సిద్దిపేట చుట్టూ100 కిలోమీటర్ల పరిధిలో వెటర్నరీ కాలేజ్లేకపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్‌ల్లో 240 మంది స్టూడెంట్స్విద్యను అభ్యసిస్తుండగా సిద్దిపేటలో కాలేజ్ఏర్పాటుతో మరో 120 మందికి ప్రవేశం లభించే అవకాశం ఉంది. కాలేజ్భవనం, అడ్మిన్ బ్లాక్, గర్ల్స్, బాయ్స్హాస్టళ్లు, సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. శంకుస్థాపన తర్వాత పనులు పిల్లర్ల దశకు చేరినా గత డిసెంబర్ నుంచి నిర్మాణ పనులు, పరిపాలనా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
స్లోగా నర్సింగ్ కాలేజీ పనులు
సిద్దిపేట గవర్నమెంట్మెడికల్కాలేజీకి అనుబంధంగా కరీంనగర్ రోడ్డులో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ పనులు స్లోగా సాగుతున్నాయి. సిద్దిపేటలో నర్సింగ్ కాలేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.40 కోట్ల నిధులు మంజూరు చేయడంతో గతేడాది పనులు ప్రారంభించారు. పాత ఎంసీహెచ్ భవనంలో తాత్కాలికంగా కాలేజీతో పాటు హాస్టల్ ను నిర్వహిస్తూ ఏడాది లోపు పనులు పూర్తి చేసి ప్రారంభించాలని సంకల్పించినా ఆరు నెలలుగా పనులు నిలిచిపోయాయి. ఇటీవల పనులు ప్రారంభమైనా ఆశించిన రీతిలో సాగడంలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పూర్తి స్థాయిలో నర్సింగ్ కాలేజీని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ఫలించేటట్లు కనిపించడం లేదు.