
- అపార్ట్మెంట్ ఫ్లాట్ల ముందు నుంచి ఎత్తుకెళ్లిన దుండగులు
- హైదరాబాద్ ముసారాంబాగ్‌లో ఘటన
మలక్ పేట, వెలుగు: హైదరాబాద్ సిటీ మలక్‌పేటలో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ల ముందు విడిచిన బ్రాండెడ్ బూట్లు, చెప్పులను కొందరు చోరీ చేశారు. అన్నీ కలిపి ఓ ఆటోలో తీసుకెళ్లిపోయారు. చోరీకి గురైన వాటిలో ఆర్ఎస్ఐకి చెందిన డిపార్ట్మెంట్ బూట్లు కూడా ఉన్నాయి. ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో మైక్రో హెల్త్‌కేర్ అపార్ట్మెంట్ ఉంది. అందులో ఆరు ఫ్లాట్ల ముందు విడిచిన చెప్పులు, బూట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారు. గురువారం ఉదయం నిద్ర లేచి చూసేసరికి అందరి ఫ్లాట్ల ముందు చెప్పులు, బూట్లు కనిపించలేవు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 25 జతల చెప్పులు, 30 జతల బూట్లు పోయాయని తేలింది. బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ బూట్లే ఎత్తుకెళ్లినట్లు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని వివరించారు. తన బిడ్డ అమెరికా నుంచి పంపించిన చెప్పులు పోయాయని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఆటోలో వచ్చిన ముగ్గురు దొంగలే ఈ చోరీ చేశారని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు ఇన్ స్పెక్టర్ పిడమర్తి నరేశ్ తెలిపారు.