- ప్రపంచంలోనే తొలి ‘ఏఐ ప్లేన్’ తయారు చేస్తున్న బ్రెజిల్, కెనడా కంపెనీలు
బ్రసీలియా: డ్రైవర్ లెస్ కార్లలాగే పైలట్ లెస్ విమానాలు కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీ సాయంతో ప్రపంచంలోనే తొలి ఏఐ ప్యాసింజర్ ప్లేన్ ను తయారు చేసేందుకు రెండు ప్రముఖ కంపెనీలు జతకట్టాయి. బ్రెజిల్ కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ ఎంబ్రాయెర్, కెనడాకు చెందిన బాంబార్డియర్ కంపెనీ కలిసి పైలట్ రహిత విమానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించాయి. ఈ విమానంలో ప్యాసింజర్లు కాక్ పిట్లో (విమానాల్లో పైలట్లు కూర్చునే ప్రదేశం) కూడా కూర్చుని జర్నీ చేయవచ్చు.
అమెరికాలో ఫ్లోరిడాలోని ఓర్లాండో ఇటీవల జరిగిన ‘నేషనల్ బిజినెస్ ఏవియేషన్ అసోసియేషన్’ కార్యక్రమంలో ఈ పైలట్ రహిత విమానం కాన్సెప్ట్ పై కంపెనీల ప్రతినిధులు ప్రజంటేషన్ ఇచ్చారు. తమ ఏఐ విమానానికి పైలట్ అవసరం ఉండదన్నారు. ‘‘గ్రీన్ టెక్నాలజీ ప్రొపల్షన్ సిస్టంతో ఏఐ ప్లేన్ ను తయారు చేస్తాం. జెట్ అటానమస్ డిజైన్ తో ప్లేన్ లో ఎక్స్ ట్రా రూం క్రియేట్ చేస్తాం. దాంతో కాక్ పిట్ అవసరం రాదు. ఫలితంగా విమానాన్ని పైలట్ ఆపరేట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. అలాగే ప్లేన్ కు టచ్ స్ర్కీన్ విండోస్ ను ఏర్పాటు చేస్తాం. జెట్ ఫ్యూయెల్ వాడి విమానాన్ని ఆపరేట్ చేస్తాం. సంప్రదాయ జెట్లలా కాకుండా, ఏఐ విమానంలో ఇంజిన్లను నిలువుగా ఫిక్స్ చేస్తాం. అందులో ఎయిర్ ఇంటేక్స్.. పైన ఉంటాయి. అలాగే, ఈ విమానానికి ‘వీ’ ఆకారంలో టెయిల్, టర్బో ఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి” అని ఎంబ్రాయెర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు తమ ఏఐ విమానం స్ఫూర్తి అవుతుందని వారు పేర్కొన్నారు.