సినీ ఫక్కీలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న బ్రెజిల్ దేశస్థుడిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. 9.75 కోట్ల విలువైన 975 గ్రాముల కొకైన్ స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించిన బ్రెజిల్ దేశస్థుడిని ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ కింద అతన్ని అరెస్ట్ చేశామన్నారు. 1,108 గ్రాముల బరువున్న డ్రగ్ క్యాప్సూల్స్ ను బ్రెజిల్ దేశస్థుడి శరీరం నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోని జెజె ఆసుపత్రి వైద్యులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విచారణలో భాగంగా నిషేధిత మాదక ద్రవ్యాన్ని భారత్ కు తరలించే ప్రయత్నంలో కొకైన్ క్యాప్సూల్స్ తీసుకున్నట్లు ఆ వ్యక్తి DRI అధికారులకు చెప్పాడు. కోర్టు ఆదేశాల మేరకు జేజే ఆస్పత్రిలో సదరు వ్యక్తిని చేర్పించారు. వైద్యుల బృందం అతని పొత్తికడుపు నుండి ఏకంగా 74 కొకైన్ క్యాప్సూల్స్ ను తొలగించినట్లు అధికారి తెలిపారు.
ఆ వ్యక్తిని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు ప్రకటన తెలిపింది. సూర్య నటించిన వీడొక్కడే సినిమాలో ఇదే మాదిరి డ్రగ్స్‌ను ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు సరఫరా చేస్తుంటారు. ఈరోజు ముంబై విమానాశ్రయంలో చోటు చేసుకున్న సంఘటన కూడా ఈ సినిమాలోని సన్నివేశాలను తలపించడం విమానాశ్రయ అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.