భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో మంగళవారం నుంచి బ్రేక్దర్శనాలు మొదలయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల మధ్య భక్తులకు రూ.200 శీఘ్ర దర్శనం టిక్కెట్లను దేవస్థానం విక్రయించింది. ఈవో రమాదేవి ఈ టిక్కెట్ల అమ్మకం ప్రారంభించారు. స్వామికి పూజల అనంతరం గాలి గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. స్నపన తిరుమంజనం తర్వాత హనుమాన్చాలీసా పారాయణం జరిగింది.
అంజన్నకు తమలపాకులు, నిమ్మకాయలు, అప్పాల మాలలను నివేదించారు. బేడా మండపంలో సీతారాముల నిత్య కల్యాణం జరిగింది. 34 మంది భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. సీతారామయ్యకు కాగడా హారతి ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చందలపర్రు గ్రామానికి చెందిన చిటుకుల రంగారెడ్డి, లక్ష్మీ దంపతులు స్వామికి ముత్యాలతో కూడిన రూ.1.90లక్షల విలువ చేసే శ్రీరామపరివార్లాకెట్హారాన్ని డొనేట్ చేశారు. అమలాపురం కల్లకూరుకు చెందిన భక్తులు కూలర్, కూలింగ్వాటర్ డిస్పెన్సర్ డొనేట్చేశారు.