శాంపిల్స్ తీసుకోవడం ఆపేసిన ఆఫీసర్లు
వారం రోజులుగా వేల సంఖ్యలో సేకరణ.. ల్యాబుల్లో పేరుకుపోయిన 8 వేల శాంపిళ్లు
సర్కారీ ల్యాబుల్లో టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండటమే కారణం
ఇప్పుడు వాటిని ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్న సర్కారు
ఒక్కో టెస్టుకు రూ.1,900 చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా టెస్టులకు బ్రేక్ పడింది. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల నియెజకవర్గాల్లో వారం రోజులుగా భారీ ఎత్తున శాంపిల్స్ సేకరించిన అధికారులు.. గురువారం నుంచి శాంపిల్ సెంటర్లను బంద్ పెట్టారు. వచ్చిన వాళ్లందరినీ వెనక్కి పంపారు. ఇప్పటికే సేకరించిన సుమారు ఎనిమిది వేల శాంపిళ్లు ల్యాబుల్లో పేరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సర్కారీ ల్యాబుల్లో టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. దీంతో ప్రైవేటు ల్యాబులపై సర్కార్ ఆధారపడుతోంది. ప్రభుత్వ దవాఖాన్లలో సేకరించిన శాంపిల్స్‌ను ప్రైవేటు ల్యాబులకు పంపించి టెస్టులు చేయిస్తోంది. ఇందుకు ఒక్కోశాంపిల్‌కు రూ.1,900 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. ఇలా రోజుకు వెయ్యి శాంపిల్స్‌ను ప్రైవేటు ల్యాబ్స్‌కు పంపిస్తున్నారు.
50 వేల టెస్టుల లక్ష్యానికి గండి
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు పది రోజుల్లో 50 వేల టెస్టులు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న 30 నియోజకవర్గాల్లో 50 వేల మందికి టెస్టులు చేయాలని ఈ నెల 15న హెల్త్ డిపార్ట్మెంటును ఆదేశించారు. దీనితో ఈ జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానాల్లోఈ నెల 16 నుంచి
శాంపిల్స్ సేకరించడం మొదలుపెట్టారు. పెద్ద సంఖ్యలో కరోనా అనుమానితులు వచ్చారు. కొందరికి టోకెన్లు ఇచ్చి తర్వాతి రోజు రావాలని పంపారు. అలా బుధవారం వరకు వేల సంఖ్యలో శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తంగా ఈ తొమ్మిది రోజుల్లో రాష్ట్రంలో 30 వేలకు పైగా టెస్టులు చేయగా.. ప్రస్తుతం ఎనిమిది వేల శాంపిల్స్ ల్యాబుల్లోఉన్నాయి. వాటి టెస్టింగ్ కు మరో మూడు రోజులు పట్టనుంది. ఈ నేపథ్యంలోనే శాంపిల్స్ ఇచ్చిన నాలుగైదు రోజుల తర్వాత కూడా టెస్టుల రిజల్ట్ రావడం లేదు.
టెస్టింగ్ కెపాసిటీ అంతంతే..
మొదట్నుంచీ కరోనా టెస్టులు తక్కువగా చేస్తూ వచ్చిన సర్కారు.. టెస్టింగ్ కెపాసిటీని పెంచుకోవడంపై దృష్టిపెట్టలేదు. ఇప్పుడు టెస్టుల సంఖ్య పెంచాలని నిర్ణయించినా.. రోజుకు 2,500 కంటే ఎక్కువ శాంపిల్స్‌ను పరీక్షించలేకపోతున్నారు. ప్రైవేటు ల్యాబులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్ రాష్ట్రంలోకి ఎంటరై నాలుగు నెలలు అవుతున్నా ఇప్పటివరకు 10 ప్రభుత్వ ల్యాబులను మాత్రమే కరోనా టెస్టులకు సిద్ధం చేశారు. ఇందులో రెండు కేంద్ర సర్కార్ పరిధిలోనివే ఉన్నాయి. మొత్తంగా సర్కారీ ల్యాబుల్లో టెస్టింగ్ కెపాసిటీ రోజుకు 2,290 మాత్రమే. ఇప్పుడు మరిన్ని టెస్టులు చేసేందుకు చర్యలు ప్రారంభించారు.
నేటి నుంచి మరో 3 జిల్లాల్లోని ల్యాబుల్లో టెస్టులు
కొత్తగా నిజామాబాద్, సూర్యాపేట, గద్వాల జిల్లాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబులకు ఐసీఎంఆర్ పర్మిషన్ వచ్చింది. గురువారం ఆ ల్యాబుల్లో ట్రయల్ రన్ చేశారు. శుక్రవారం నుంచి టెస్టులు మొదలుపెట్టనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ మూడింటిలో కలిపి రోజూ గరిష్టంగా 300
శాంపిల్స్ మాత్రమే టెస్టు చేసే అవకాశం ఉంది. కరీంనగర్, మెదక్‌జిల్లాల్లోనూ ల్యాబులు సిద్ధమైనా ఐసీఎంఆర్ నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు. వారం, పది రోజుల్లో అనుమతి వచ్చి, టెస్టులు మొదలుపెట్టే చాన్స్ ఉంది.
నాలుగైదు రోజులైనా రిజల్ట్ చెప్పట్లే..
కరోనా టెస్టులు చేయించుకున్నవాళ్లు తమకు వైరస్ ఉందో, లేదో తెలుసుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు.టెస్ట్ శాంపిల్ ఇచ్చిన నాలుగైదు రోజుల వరకూ రిజల్ట్ చెప్పకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్టింగ్ కెపాసిటీ తక్కువగా ఉండడం, ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్ సేకరించడంతోనే ఈ సమస్య ఏర్పడుతోందని అధికారులు చెప్తున్నారు. జిల్లాల నుంచి వచ్చిన శాంపిల్స్ నాలుగైదు రోజులు ఇక్కడే ఉండిపోతున్నాయి. కొందరు తమకు నెగెటివ్ వచ్చిందేమో అనుకుని యధావిధిగా రోజువారీ పనుల్లో పడిపోతున్నారు. తర్వాత పోలీసుల నుంచి వైరస్ పాజిటివ్ అని ఫోన్ వస్తోంది. ఈ లోగా చాలా మందికి వైరస్ వ్యాపిస్తోంది. టెస్ట్ శాంపిల్ ఇచ్చేటప్పుడు సెల్ నంబర్ నుంచి ఇంటి నంబర్ వరకూ అన్నీ తీసుకుంటున్న అధికారులు.. కనీసం వైరస్ పాజిటివ్ ఉన్నవాళ్లకైనా వెంటనే రిజల్ట్ చెప్పట్లేదు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎస్సెమ్మెస్ విధానం తీసుకొస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టెస్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే బాధితుల సెల్‌కు మెసేజ్ వెళ్తుందన్నారు.
శాంపిల్స్ క్లియర్ చేసేందుకే ఆపినం
కింగ్ కోఠి, ఫీవర్ హాస్పిటళ్లలో శాంపిల్స్ సేకరణ యధావిధిగా జరుగుతోంది. గత వారం రోజుల్లో సేకరించిన వాటిలో 8,253 శాంపిల్స్ ల్యాబుల్లో ఉండిపోయాయి. శాంపిళ్లను నిర్ణీత టెంపరేచర్లో నిల్వచేయాలి, 48 గంటల్లోపు టెస్టు చేయాలి. లేకుంటే ఫాల్స్ పాజిటివ్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే కొన్ని చోట్ల శాంపిల్స్ తీసుకోవడం ఆపేశాం. ఉన్న శాంపిల్స్‌ను రెండ్రోజుల్లో క్లియర్ చేసి.. కొత్తగా శాంపిల్స్
తీసుకోవడం స్టార్ట్ చేస్తం. ఈ లోగా శాంపిల్స్ సేకరిస్తున్న హాస్పిటల్స్‌లో డిస్‌ఇన్‌ఫెక్ట్ స్ర్పే చేస్తం. త్వరగా టెస్టులు కంప్లీట్ చేయడానికి తాత్కాలికంగా ప్రైవేటు ల్యాబ్స్‌కు శాంపిల్స్ పంపిస్తున్నం. మరో వారం రోజుల్లో గవర్నమెంట్ ల్యాబ్స్ టెస్టింగ్ కెపాసిటీ ఆరు వేలకు పెరుగుతుంది. అప్పుడు ఇంకా వేగంగా టెస్టులు చేస్తం.
-డాక్టర్ శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్