13 స్థానాలపై ఫ్లాష్​ సర్వే .. రంగంలోకి సునీల్ కనుగోలు టీం

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల పంపిణీకి బ్రేక్ పడింది. కాంగ్రెస్ అధినాయకత్వం వాస్తవానికి నిన్న 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు బ్లూ ప్రింట్ కూడా రెడీ అయ్యింది. ప్రదేశ్ ఎన్నికల కమిటీ కూడా సింగిల్ నేమ్స్ లిస్ట్ ను ఏఐసీసీకి పంపింది. అయితే అనూహ్యంగా కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. అర్ధరాత్రి వరకు తర్జనభర్జనల తర్వాత పలువురి పేర్లను హోల్డ్ లో పెట్టి జహీరాబాద్ కు సురేశ్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బల్ రాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. మిగతా స్థానాలు పెండింగ్ లో పెట్టింది. 
 
పీఠముడి ఎందుకంటే..?

ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పంపిన సింగిల్ నేమ్స్ లో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే  పార్టీలో చేరిన నలుగురు పేర్లు ఉండటం, వారంతా వరుసగా ఉన్న సెగ్మెంట్లలో పోటీకి దించాలని పీఈసీ ఏకాభిప్రాయానికి రావడం ఈ సర్వేకు కారణమైనట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ నలుగురు కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారే. ఇక్కడి నుంచి ఆల్ రెడీ పార్టీ కోసం పనినిచేసిన వారు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై  పునరాలోచించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం నిన్న ప్రకటించిన నాలుగు స్థానాలు కాకుండా మిగతా 13 సెగ్మెంట్లలో ఫ్లాష్​ సర్వే చేయించాలని నిర్ణయంచింది. కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నేతృత్వంలోని సర్వే టీం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో పడిందని తెలుస్తోంది. సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 

జాయినింగ్స్ పైనా దృష్టి

పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా సర్వే టీములు ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్‌‌ఎస్ నేత కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? గెలిచే అవకావం ఉందా..? అనే అంశంపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇలా మరికొన్ని సెగ్మెంట్లలోనూ జాయిన్ చేసుకోబోయే లీడర్ల గురించి .. వారిని అభ్యర్థులుగా ఖరారు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశాలపైనా ఫీడ్ బ్యాక్ తీసుకొని సర్వే నివేదికను సమర్పించే అవకాశం ఉంది. 

11న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ

హోల్డ్ లో పెట్టిన స్థానాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 11న మరో మారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అప్పటిలోగా ఫ్లాష్ సర్వే పూర్తి చేయాలని సునీల్ కనుగోలు టీం కు సూచించినట్టు తెలుస్తోంది. ఫ్లాష్​ సర్వే నివేదికపై సమావేశంలో చర్చించి అభ్యర్థులు తేల్చే అవకాశం ఉందని సమాచారం.

ALSO READ :- రాష్ట్రంలో ఒంటరి పోరు : కిషన్ రెడ్డి