- నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
- వేచి చూద్దామన్న ఆలోచనలో హైకమాండ్
- కేకే చేరిక వరకే పరిమితమైన సీఎం ఢిల్లీ టూర్
- నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా మరింత టైం
- ఢిల్లీ నుంచి వెనుదిరుగుతున్న ఆశావహులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలుస్తున్నది. రాష్ట్రంలోని ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ‘కొంతకాలం వెయిట్చేద్దాం..’ అనే నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు సమాచారం. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఏఐసీసీ పెద్దలు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక శ్రావణంలోనే మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం ఉంటాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది.
ఇటు విస్తరణపై అటు పీసీసీ చీఫ్ నియామకంపై బుధవారం సాయంత్రం వరకు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అందుకు తగ్గట్టే సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం.. పార్టీ అగ్ర నేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షీతో భేటీ కావడంతో ఆశావహులంతా హస్తిన పరిణామాలపై ఆసక్తిచూపారు. కానీ, కె.కేశవరావు చేరిక వరకే ఆ భేటీ పరిమితం కావడంతో ఇక ఆషాఢంలోపు తమకు అదృష్టం లేదని, శ్రావణం దాకా వేచి చూడాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చిన ఆశావహులు ఢిల్లీ నుంచి తిరుగుబాట పట్టారు.
ఒక దశలో ఆషాఢంలోపే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం ఉంటాయని వారం రోజులుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. కొందరు మంత్రులైతే మీడియా చిట్ చాట్ లో ఏ జిల్లా నుంచి ఎవరు మంత్రి కాబోతున్నారో చెప్పుకొచ్చారు. దీంతో ఇక ఈ నెల 4లోగా విస్తరణ ఉంటుందని అంతా భావించారు. మంత్రి పదవిని ఆశించిన పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలైతే కొన్ని రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి వీలుదొరికినప్పుడుల్లా ఏఐసీసీ నేతలను కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎం లిద్దరూ దఫదఫాలుగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి మంత్రులు కూడా ఈ భేటీల్లో పాల్గొన్నారు.
ఆశావహుల ఎదురుచూపులు
మంత్రివర్గ విస్తరణలో సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకోవడం, ప్రాతినిధ్యం లేని జిల్లాలకు చోటు కల్పించడం, అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి మంత్రి పదవి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడం లాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇందుకు తగినట్టే ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నలుగురి పేర్లతో లిస్టును రెడీ చేసుకొని హైకమాండ్ ముందుంచారు.
కానీ.. కొందరు ముఖ్య నేతలు ఎవరి స్థాయిలో వారు పట్టుబట్టడంతో పీటముడి బిగిసినట్లు తెలిసింది. ఇలాంటి పరిణామాలతో కేబినెట్ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇక పీసీసీ కొత్త చీఫ్ నియామకం విషయంలో కొంత క్లారిటీ వచ్చినా బీసీల్లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడం, అదే సమయంలో ఎస్టీల్లోని ఓ వర్గానికి ఇవ్వాలనే అంశం ఢిల్లీ పెద్దలకు చేరడంతో ఈ నియామకాన్ని కూడా పెండింగ్ పెట్టినట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీని కూడా కొంత కాలం వాయిదా వేస్తేనే మంచిదనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో ఆశావహులంతా ఇక శ్రావణం వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.