భద్రాచలం, వెలుగు : పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. తుఫాన్ కారణంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విలీన ఆంధ్రా వీఆర్పురం మండల తహసీల్దార్ విహార యాత్రను నిలిపివేయాలని ఆదేశించారు. లాంచీలు తిప్పొద్దని యజమానులకు నోటీసులు ఇచ్చారు. భద్రాచలం రాములవారి దర్శనం తర్వాత భక్తులు వీఆర్పురంలోని పోచవరం వెళ్లి అక్కడి నుంచి లాంచీల్లో పాపికొండల విహార యాత్ర చేస్తారు. కానీ, అధికారులు సోమవారం వరకు తాత్కాలికంగా యాత్ర నిలిపివేశారు.