వరంగల్ ​మాస్టర్‍ ప్లాన్‍కు బ్రేక్‍

వరంగల్ ​మాస్టర్‍ ప్లాన్‍కు బ్రేక్‍
  •     గులాబీ ఎమ్మెల్యేల కోసమే తయారు చేశారన్న మంత్రి పొంగులేటి
  •     ప్రజాభీష్టం మేరకు మారుస్తామని స్పష్టీకరణ
  •     రేపుమాపంటూ పదేండ్లు ఊరించిన బీఆర్ఎస్​ సర్కార్​
  •     అప్పటి సీఎం కేసీఆర్ ​అనుమతి కోసమే 43 నెలల సమయం వృథా
  •     అమలు మరింత లేటయ్యే ఛాన్స్​ 

వరంగల్, వెలుగు : వరంగల్‍ మాస్టర్ ప్లాన్‍కు బ్రేక్‍ పడింది. పదేండ్ల పాటు రేపుమాపంటూ ఊరిస్తూ వచ్చిన బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం మార్పులు చేర్పుల పేరుతో దానిని అమలు చేయకుండానే అధికారం నుంచి దిగిపోయింది. సీఎం కేసీఆర్‍ అప్రూవల్‍ కోసమంటూ ఏకంగా 43 నెలల పాటు ఫైల్‍ను సీఎంవోలోనే పెట్టుకున్నారు. తీరాచూస్తే.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‍ ప్రభుత్వం వరంగల్‍ మాస్టర్ ప్లాన్‍ రూపొందించడంలో కుట్ర జరిగిందని ఆరోపించింది.

బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలు, లీడర్లు తమ భూములు, ఆస్తులకు డిమాండ్‍ పెరిగేలా ఇష్టారీతిన ప్లాన్‍ తయారు చేయించుకున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో దానిని అమలు చేయలేమని.. ప్రజాభీష్టం మేరకు ప్లాన్‍లో మార్పులు చేర్పులు చేస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి - ఈ నెల20న ఉమ్మడి వరంగల్‍ జిల్లా అభివృద్ధి సమావేశంలో స్పష్టం చేశారు. దీంతో వరంగల్‍ మాస్టర్‍ ప్లాన్‍ అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.  

1972 తర్వాత ఇప్పటికీ మార్చలే

గ్రేటర్‍వ వరంగల్‍ సిటీలో ఇప్పటికీ 50 ఏండ్ల కింది మాస్టర్ ప్లాన్‍ నే అమలు చేస్తున్నారు. 1971లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్‍ రూపొందించారు. ఆపై 20 ఏండ్ల అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకుని 1972లో సవరించారు. ఈ లెక్కన 1991లో కొత్త మాస్టర్‍ ప్లాన్‍ తీసుకురావాల్సి ఉండగా.. 52 ఏండ్లు గడుస్తున్నా అతీ గతీ లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) పరిధిలో అధికారులు 40 ఏండ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 2013లో కొత్త మాస్టర్‍ ప్లాన్‍ రూపొందించారు.

రాష్ట్ర ఎలక్షన్ల బిజీ పేరుతో దాన్ని పక్కనపెట్టారు. 2014లో  బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం ఏర్పడ్డాక   మాస్టర్​ ప్లాన్​కు మార్పులు చేర్పులు చేశారు. 2016లో వరంగల్ స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలకు ఎంపిక అవడంతో.. ‘లీ అసోసియేట్స్, కుడా ప్లానింగ్ విభాగం’ ఆధ్వర్యంలో దీనికి తగ్గట్లు ప్లాన్​లో మళ్లీ మార్పులు చేశారు. కుడా పరిధి 1805 చదరపు కిలోమీటర్ల ఉన్నందున డెవలప్‍మెంట్‍ కోసం జోన్లుగా విభజన చేశారు. 3 జిల్లాల పరిధిలోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాల్లో13 లక్షల జనాభా ఉన్న నేపథ్యంలో 2041 వరకు పాపులేషన్​ 30 లక్షల నుంచి 33 లక్షలకు పెరుగుతుందని ఊహించి ప్లాన్‍ రూపొందించారు. అయినా ఇప్పటివరకు అమలు మాత్రం చేయలేదు. దీంతో 52 ఏండ్లకింది ప్లాన్‍నే ఇంకా కొనసాగించాల్సి వస్తోంది.  

2021 గ్రేటర్‍ ఎన్నికల హామీగా..మాస్టర్‍ ప్లాన్‍ 

బీఆర్ఎస్‍ ప్రభుత్వం 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాస్టర్‍ ప్లాన్‍ అమలుపై హడావుడి చేసింది. ఎప్పటికప్పుడు గడువు తేదీలను మార్చుకుంటూ వచ్చింది. 2018 డిసెంబర్‍లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ‘మాస్టర్‍ప్లాన్ 2041’ ఫైల్‍ ఓకే అయిందని చెప్పారు. అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలందరితో రెండుమూడు సార్లు మీటింగ్​పెట్టారు. 2020 మార్చి 11న మంత్రి కేటీఆర్.. ‘కుడా మాస్టర్ ప్లాన్ 2041’ అమలుకు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఆమోదముద్ర కోసం సీఎం కేసీఆర్ ఆఫీస్‍కు పంపించారు.  

2021లో గ్రేటర్ వరంగల్‍ ఎన్నికలు అనగానే.. కేటీఆర్‍ తన ప్రచారంలో మాస్టర్ ప్లాన్‍ అమలు తన బాధ్యత అని మాటిచ్చారు. త్వరలోనే దానికి ఆమోదముద్ర వేసి వరంగల్‍ను ఫ్యూచర్‍ సిటీ చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా 2013లో తయారు చేసిన ప్లాన్‍ను మంత్రి కేటీఆర్‍ 2020 మార్చిలో సీఎంఓ ఆఫీస్‍ కు పంపినా.. ప్రభుత్వం రద్దయ్యేంత వరకు అంటే దాదాపు 43 నెలల పాటు సీఎం కేసీఆర్‍ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా మాస్టర్​ప్లాన్​పై పదేండ్ల టైం వేస్ట్ చేశారు.  

ప్లాన్‍ లేకుండానే..పనులకు కేటీఆర్ శిలాఫలకాలు

కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ పరిధిలో అభివృద్ధి పనులను 2041 కొత్త మాస్టర్ ప్లాన్‍ ప్రకారమే చేపడతామన్నారు. ఈ ప్లాన్​ను 11 జోన్లతో రూపొందించగా, ఇందులో రెసిడెన్సియల్ జోన్, కమర్శియల్ జోన్, మిక్సుడ్ ​యూజ్ జోన్, ఇండ్రస్ట్రియల్ జోన్, గ్రోత్ 
కారిడార్స్, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్షర్వేషన్..ఇలా జోన్ల ఆధారంగా డెవలప్ చేయాల్సి ఉంది. రిక్రియేషన్ జోన్ కింద పార్కులు, గార్డెన్లు, గ్రీన్ బఫర్​, ప్రొటెక్టెడ్.. ఆన్ డెవలబుల్ జోన్ కింద వాటర్ బాడీస్, ఫారెస్ట్, కెనాల్స్ అభివృద్ది చేయాలి. కాగా, ఫ్యూచర్‍సిటీ ఆధారంగా మాస్టర్‍ప్లాన్‍ 2041 అమలు చేయాల్సిన మున్సిపల్​ మంత్రి కేటీఆర్‍ తన వరంగల్‍ పర్యటనల్లో ఇష్టారీతిన వేలాది కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. దీంతో గ్రేటర్ వరంగల్‍ నిర్మాణం అడ్డదిడ్డంగా జరుగుతోందనే విమర్శలున్నాయి.

లీడర్ల భూములకు డిమాండ్‍ పెరిగేలా మాస్టర్‍ ప్లాన్‍?

కొత్త రాష్ట్రంలో బీఆర్‍ఎస్‍ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే జిల్లా అధికారులు 2013లో మాస్టర్ ప్లాన్‍ రూపొందించారు. కాగా, కేసీఆర్‍ సర్కారు పవర్‍లోకి వచ్చాక పలుమార్లు ప్లాన్‍ను మార్చారు. గ్రేటర్​ వరంగల్​తో పాటు చుట్టుపక్కల 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు భూముల ధరలకు రెక్కలు రావడంతో..పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‍ లీడర్లు బినామీల పేరుతో ఎకరాల కొద్దీ భూములు కొన్నారు. ఇంకొందరు తమ అనుచరులతో రియల్‍ ఎస్టేట్‍ బిజినెస్‍ కూడా చేయించారు. ఇందుకోసం తమ భూములు, ఆస్తులు ఉన్నచోటు నుంచి రింగురోడ్డు తదితర ప్రాజెక్టులు వచ్చేలా మాస్టర్‍ ప్లాన్‍లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేశారనే ఆరోపణలున్నాయి.

సిటీ శివారులో వారు కొన్న భూములకు దగ్గర్లో భవిష్యత్తులో టెక్స్​టైల్ పార్కులు, ఐటీ, సాఫ్ట్​వేర్​ కంపెనీలు, ఫైవ్‍ స్టార్‍ హోటల్స్​ వచ్చేలా ప్లాన్‍లోని జోన్లను తమకు అనుకూలంగా విభజించుకున్నారన్న విమర్శలు వచ్చాయి. కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ పరిధిలో మేజర్‍ ప్రాజెక్టులు వచ్చే ప్రాంతాల్లో చూస్తే ఎమ్మెల్యేలు, వారి బంధువులకు సంబంధించి భూములే ఎక్కువగా ఉన్నాయి. 10 ఏండ్లలో ఇష్టారీతిన అలైన్‍మెంట్లు మారడంతో ల్యాండ్‍ ఆక్విజేషన్‍ సమయంలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది..

గత ప్రభుత్వ మాస్టర్‍ ప్లాన్‍ అమలు చేయం

హైదరాబాద్‍ మాస్టర్ ప్లాన్‍ ఒక్కటే కాకుండా వరంగల్‍ మాస్టర్‍ ప్లాన్‍పై చిత్తశుద్ధితో ఉన్నాం. గత ప్రభుత్వం..వరంగల్‍ మాస్టర్‍ ప్లాన్‍ అమలు చేస్తామంటూ వదిలేసింది. అప్పటి కొందరు లీడర్లు ఈ ప్రాజెక్టు పేరుతో ఇష్టానుసారం ఔటర్‍ రింగురోడ్ల ఎలైన్‍మెంట్లు మార్చుకున్నారు. ఇలాంటి తప్పులను మా ప్రభుత్వం ఒప్పుకోదు. గత ప్రభుత్వంలో లీడర్ల కోసం వారి స్థలాలకు ఆనుకుని పోయేలా వేసిన ప్లాన్లు ఉండవు. అందులో సవరణలు, సరిదిద్దాల్సినవి చాలా ఉన్నయ్‍.  

-  ఈ నెల20న ఉమ్మడి వరంగల్‍ జిల్లా అభివృద్ధి సమావేశంలో ఇన్​చార్జి మంత్రి పొంగులేటి