- రైతు రుణమాఫీపై వేచి చూసే ధోరణిలో ప్రభుత్వం
- దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకూ పైసలు ఇస్తలే
- బీసీలకు లక్ష సాయం జాబితానూ ప్రకటిస్తలే
హైదరాబాద్, వెలుగు : వారం, పది రోజుల కిందటి వరకు ఆగమేఘాల మీద ప్రభుత్వ పథకాలను పట్టాలు ఎక్కించి హడావుడి చేసిన రాష్ట్ర సర్కారు ఇప్పుడు నెమ్మదించింది. స్కీముల అమలులో వేగం తగ్గించి బ్రేకులు వేసింది. జమిలి ఎలక్షన్స్ సంకేతాలు ఉండడంతో పార్టీ కార్య క్రమాలను తగ్గించినట్లే.. ప్రభుత్వ పథకాలపైనా వేచి చూసే ధోరణికి వచ్చింది. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో జరిగే అవకాశం ఉందని ఇప్పటికే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మంత్రులు, లీడర్లకు చెప్పినట్లు తెలిసింది. మంత్రి కేటీఆర్ కూడా అసెంబ్లీ ఎన్నికలు లేటయ్యే చాన్స్ ఉందని మీడియా చిట్ చాట్‌లో తెలిపారు.
అయితే, డిసెంబర్లో ఎలక్షన్స్ జరుగుతాయని భావించి.. అన్ని స్కీముల్లో లబ్ధిదారుల ఎంపిక, పాత పథకాలకు నిధుల విడుదల వంటివి ప్రభుత్వం మొదలుపెట్టింది. దళితబంధు, గృహలక్ష్మి, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష సాయం, రుణమాఫీ వంటివన్నీ తెరపైకి తెచ్చింది. తాజాగా ఎన్నికలు ఆలస్యమయ్యే సూచనలు ఉండటంతో ''ఎందుకైనా మంచిది.. ఓ 10 రోజులు స్కీములకు బ్రేక్ వేయండి'' అంటూ ప్రభుత్వ పెద్దల నుంచి ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్లు తెలిసింది. పార్లమెంట్ సెషన్లో ఓ క్లారిటీ వస్తుందని.. ఆ తరువాత ఎలా ముందుకెళ్లాలనేది డిసైడ్ అవుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. పైగా ఇవన్నీ నిధులతో ముడిపడినవని, అందుకే ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తోందని పేర్కొంటున్నారు.
లిస్ట్ రెడీ.. పైసలు ఇచ్చుడే లేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన స్కీముల్లో గృహలక్ష్మి, దళితబంధు, బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష సాయం, రుణమాఫీ ఉన్నాయి. ఇందులో రూ.లక్ష ఆర్థిక సాయం కొంతమేర, రుణమాఫీ కొంత చేశారు. మిగిలిన రెండు స్కీములకు లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. వాస్తవానికి లబ్ధిదారులు ఎవరనేది కూడా నిర్ణయం జరిగినప్పటికీ.. ఇటీవల కేంద్రం నుంచి వచ్చిన స్పెషల్ పార్లమెంట్ సెషన్ ప్రక టనతో ఇంకా లిస్ట్ రిలీజ్ చేయడం లేదని తెలిసింది. గృహలక్ష్మి స్కీమ్‌కు ఇప్పటికే అప్లికేషన్లు తీసుకుని ప్రాసెస్ చేశారు. అన్ని నియోజకవర్గాల్లో 25 లక్షల పైనే అప్లికేషన్లు రాగా.. అన్నింటిని వడపోశారు.
ఇప్పుడు నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున లబ్ధిదారుల లిస్ట్ ఎమ్మెల్యేల దగ్గర ఉంది. దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే మిగిలింది. దళితబంధు పథకానిదీ ఇదే పరిస్థితి. ఇప్పటికే నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున ఎమ్మెల్యేలే లిస్ట్ రెడీ చేసి.. ఇన్చార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లకు పంపారు. వాళ్లు లిస్ట్ ప్రకటించడమే మిగిలింది. ఇక బీసీలు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయానికి 6 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి.. విడతల వారీగా ప్రతినెలా కొంతమందికి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, గత నెలలో బీసీల లిస్ట్ ప్రకటించలేదు. ఈ నెల 15న మళ్లీ లిస్ట్ ప్రకటించాల్సి ఉన్నా.. ‘గతంలో వాటికే ఇంకా ఇవ్వలేదు.. ఇప్పుడు కొత్తగా ఇచ్చేది ఏముంటుంది.. ఆగాల్సిందే’ అని ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'తో అన్నారు.
ALSO READ: సీఎం కేసీఆర్ 35 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసిన్రు: వివేక్ వెంకటస్వామి
ప్రాధాన్య క్రమంలోకి రుణమాఫీ
సెప్టెంబర్ రెండో వారంలోపు పూర్తి చేస్తామని చెప్పిన రైతు రుణమాఫీని కూడా ప్రభుత్వం ఇంకింత ఆలస్యం చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటి వరకు రూ.99,999 పంట రుణం మాఫీ చేసినట్లు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. ఇందుకుగాను దాదాపు రూ.9 వేల కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నది. అయితే, సరిగ్గా లక్ష రూపాయల రుణం ఉన్న రైతులే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఈ రైతుల రుణమాఫీ కోసం ఏకంగా రూ.12 వేల కోట్లు అవసరం. ముందుగా అనుకున్నదాని ప్రకారం ఈ వారంలోనే రుణమాఫీ ప్రక్రియ పూర్తి కావాలి.
కానీ, ఇంకింత లేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. నిధుల కొరతతో పాటు ఎలక్షన్లు కూడా ఆలస్యమైతే ఇప్పుడు చేస్తున్న మాఫీ రైతులకు గుర్తుంటుందో లేదోనని భావిస్తోంది. అందులో భాగంగానే లక్ష రూపాయల రుణమాఫీకి సంబంధించి ఇకమీదట ప్రాధాన్య క్రమంలో నిధులు విడదల చేసి పూర్తి చేస్తామని ఇటీవల మంత్రి హరీశ్ రావు తెలిపారు. దీంతో రుణమాఫీ ప్రక్రియనూ సాగదీసే అవకాశం ఉంది.