ఏడాదిగా నిలిచిన​ ఉపాధి నిధులు .. యాదాద్రి జిల్లాకు రూ. 19 కోట్లు

  • బిల్లు జనరేట్​ కానివి మరో రూ. 20 కోట్లు
  • రెండు నెలలుగా రాని జీతాలు 
  • ఏడాదిగా అందని వెహికల్స్​ అలవెన్స్​

​యాదాద్రి, వెలుగు: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్‌‌‌‌‌‌‌‌ కాంపోనెంట్‌‌‌‌‌‌‌‌ నిధులకు బ్రేక్​ పడింది. ఏడాది కాలంగా ఎంబీ రికార్డ్​ చేసిన దాదాపు 500 పనులకు సంబంధించిన బిల్లులు నిలిచిపోయాయి.ఉపాధి హామీ స్కీంలో  మెటేరియల్​ కాంపోనెంట్​ కింద  40 శాతం ఫండ్స్​ ఖర్చు  చేసే అవకాశముంది.  దీని కింద క్రీడా ప్రాంగణాలు, కొన్ని చోట్ల పంచాయతీ బిల్డింగ్​లు, సీసీ రోడ్ల నిర్మాణం చేశారు. వీటితో హరితహారంలో భాగంగా జిల్లాలోని 418 నర్సరీల్లో మొక్కలకు ప్లాస్టిగ్​ బ్యాగులు, 421 పంచాయతీల్లోని మొక్కలకు ట్యాంకర్లతో నీరు చల్లించడం వంటి పనులు చేశారు.

 వీటికి సంబంధించిన పనులు మెటీరియల్​ కాంపోనెంట్​ కింద  పలు గ్రామాల్లో సర్పంచ్​లు , కాంట్రాక్టర్లు ఈ  పనులు చేశారు. అయితే 2022–-23 ఫైనాన్షియల్​ ఇయర్​కు సంబంధించిన వర్క్స్​ ఎంబీ రికార్డ్​ చేసి బిల్లులను జనరేట్​ చేశారు. గతేడాది మార్చి వరకూ వచ్చిన మెటీరియల్​ కాంపోనెంట్​ వర్క్స్​ బిల్లులు ఆ తర్వాత రాలేదు. అయితే ఇప్పటికి ఇంకా దాదాపు 500 వర్క్స్​ ఎంబీ రికార్డ్​ చేసి రూ. 18.79 కోట్ల బిల్లులు అగిపోయాయి. 

జనరేట్​ కాని బిల్లులు మరిన్ని

బిల్లులు జనరేట్​ చేసినా రాకపోగా 2023–-24 ఫైనాస్షియల్​ ఇయర్​కు సంబంధించిన మరో 500 వర్క్స్​ వరకూ బిల్లులు రావాల్సి ఉంది. వీటికి సంబంధించి మరో రూ. 29 కోట్లు పెండింగ్​ ఉన్నట్టుగా తెలుస్తోంది. 

రెండు నెలలుగా జీతాలు పెండింగ్​.. 

జిల్లాలో ఉపాధి స్కీంలో పని చేస్తున్న  417 మంది ఎంప్లాయిస్​కు  రెండు నెలలుగా జీతాలు రావడం లేదు.  గతేడాది అక్టోబర్​, నవంబర్​ నెలలకు సంబంధించిన జీతాలు ఈ ఏడాది జనవరిలో వచ్చాయని స్టాఫ్​ చెబుతున్నారు. డిసెంబర్​, జనవరి నెలలతో పాటు ఇప్పడు ఫిబ్రవరి నెల సగానికి చేరినా.. జీతాలు రాలేదు. నెలకు రూ. కోటి చెప్పున రెండు నెలలకు రూ. 2 కోట్లు రావాల్సి ఉంది. ఇవే కాకుండా హయ్యర్​ ఆఫీసర్స్​కు సంబంధించిన వెహికల్స్​ అలవెన్స్​ ఏడాదిగా రావడం లేదంటున్నారు. ఒక్కో వెహికల్​కు రూ. 33 వేల చొప్పున 12 నెలలకు సంబంధించి నలుగురు ఆఫీసర్ల వెహికల్స్​కు అలవెన్స్​ రాలేదు.