- అసెంబ్లీలో హరీశ్‌రావు
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీంను కొనసాగించాలని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం అసెంబ్లీలో గురుకులాలపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ చానల్ ద్వారా గురుకులాలకు బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తోందని.. కానీ, ప్రస్తుతం రెండు నెలల మెస్, కాస్మెటిక్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. చాలా హాస్టళ్లకు దుప్పట్లు అందలేదని, వెంటనే వాటిని అందించాలని కోరారు.
గర్ల్స్ హాస్టళ్ల వరకైనా గీజర్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బడుల్లో వండిపెట్టే కార్మికులకు జీతాలు, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియెట్కాలేజీల్లో చదివే విద్యార్థులకు మిడ్డెమీల్స్ అందించాలని కోరారు. సమ్మెలో ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులు, ఐటీడీఏలో పనిచేసే సీఆర్టీలతో చర్చించి, వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత 54 మంది చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఏడాదిలో 1,913 బడులు మూతపడ్డాయని, టీచర్లను పెంచి స్కూళ్లు తెరిపించాలని డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్లు, పార్ట్ టైమ్ లెక్చరర్లకు జీతాలు పెంచుతామన్నారని.. కానీ, ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోనూ సభలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, 2014లో గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 2,350 కోట్లను చెల్లించినట్టు హరీశ్‌రావు గుర్తుచేశారు.
రాష్ట్రంలో సీఎం ప్రకటనలే అమలు కావట్లేదు
సీఎం ప్రకటన చేస్తే దాన్ని అమలు చేయాలని, కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్చెబుతున్నవన్నీ వట్టి మాటలేనని ఆరోపించారు. 3.13 లక్షల మంది రైతులకు రెండోసారి రుణమాఫీ చేస్తున్నామంటూ నవంబర్30న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. కానీ, ఇంత వరకు వారి ఖాతాల్లో రూ.2,474 కోట్లు పడలేదని విమర్శించారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో చిట్‌చాట్ చేశారు.
మహిళా సంఘాలకు ఇస్తామన్న నిధులు కూడా ఖాతాల్లో పడలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో పీఆర్సీ బకాయిలకు సంబంధించిన రూ.281 కోట్ల చెక్ కూడా జమ కాలేదని వివరించారు. చివరకు ఆర్టీసీ సంస్థనే వారి ఖాతాల్లో డబ్బులు వేసిందన్నారు. రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తామని చెప్పారని, అది కూడా బోగస్అని తేలిపోయిందని విమర్శించారు. ఆడబిడ్డలకు ఏ ఒక్కటీ ఇవ్వడం లేదని, తులం బంగారం, స్కూటీ, న్యూట్రిషన్ కిట్ వంటివేవీ లేవని తెలిపారు.