అబూజ్​మఢ్ మృతుల్లో ఒడిశా స్టేట్ ​కమిటీ మెంబర్

అబూజ్​మఢ్ మృతుల్లో ఒడిశా స్టేట్ ​కమిటీ మెంబర్
  • రామచంద్ర అలియాస్​కార్తీక్​ చనిపోయినట్లు
  • ప్రకటించిన పోలీసులు

భద్రాచలం, వెలుగు: అబూజ్ మఢ్​లో  ఈ నెల 12న జరిగిన ఎన్​కౌంటర్​లో ఏపీలోని గుంటూరుకు చెందిన మావోయిస్టు అగ్రనేత రామచంద్ర చనిపోయినట్టు పోలీసులు ధృవీకరించారు. ఆయన మావోయిస్ట్​ పార్టీ ఒడిశా స్టేట్​ కమిటీ మెంబర్​గా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. చత్తీస్ గఢ్​లోని నారాయణ్​పూర్​ జిల్లా అబూజ్​మఢ్​లోని రేఖవాయ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​ మృతుల వివరాలను బస్తర్​ఐజీ సుందర్​రాజ్​శనివారం మీడియాకు వివరించారు. ఒడిశా స్టేట్​ కమిటీ మెంబర్​పృథ్వీ మోహన్​రావు అలియాస్​రామచంద్ర ( ​ కార్తీక్,  దస్రూ,  దస్రన్న,  నరేశ్, లక్మూ, జీవన్​అన్న పేర్లతోనూ పని చేశారు) ఉన్నారు. ఈయనది ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా పోచంపల్లి గ్రామం.

ఇంజనీరింగ్​ గ్రాడ్యుయేట్​అయిన రామచంద్ర..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో అప్పటి పీపుల్స్​వార్​లో చేరి  నల్లమల అడవుల్లో పని చేసి అక్కడి నుంచి దండకారణ్యానికి వెళ్లారు. ఇతనిపై రూ.25లక్షల రివార్డు ఉంది. మిగిలిన మృతుల మీద కూడా రివార్డ్​ ఉంది. ఇంద్రావతి ఏరియా కమిటీ మెంబర్​ రైనీ అలియాస్​రమిలా మడకంపై రూ.5లక్షలు, సోమారి ఓయాం, గుడ్సా కుచ్చా, రైనూ పోయం, కమలేశ్​ కోహ్లా, సోమారు అలియాష్ మోటూలపై రూ.2లక్షల చొప్పున రివార్డు ఉంది. వీరంతా బీజాపూర్​ జిల్లా వాసులే. ఎన్​కౌంటర్​ ప్రదేశం నుంచి 303 రైఫిల్స్ 2, బీజీఎల్​లాంచర్లు 2, 12 బోరు తుపాకులు 2, బర్మార్​ తుపాకులు 2 స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్​ఐజీ  వివరించారు.