ఏడాదికో సూది.. హెచ్ఐవీ హుష్​కాకి!

 ఏడాదికో సూది..  హెచ్ఐవీ హుష్​కాకి!
  • క్లినికల్ ట్రయల్స్​లో వైరస్​ను అడ్డుకున్న ‘లెనకాపవిర్’​ మందు 
  • ఒక్క సూదితో 56 వారాలు హెచ్ఐవీ నుంచి రక్షణ
  • సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ‘గిలియడ్ సైన్సెస్’ సంస్థ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ప్రాణాంతకమైన ఎయిడ్స్​ వ్యాధికి కారణమయ్యే  హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యూనో డెఫీషియెన్సీ వైరస్) పని పట్టేందుకు కొత్త మందు సిద్ధమవుతున్నది. రోజూ గోలీల మీద గోలీలు వేసుకునే అవసరం లేకుండా.. ఏడాదికి ఒక సూదితోనే హెచ్ఐవీకి చెక్​ పెట్టేలా ఆ మందు ప్రభావం చూపిస్తున్నది. 

అమెరికాకు చెందిన గిలియడ్ సైన్సెస్ బయోఫార్మా సంస్థ అభివృద్ధి చేసిన ‘లెనకాపవిర్’ అనే సూది మందు హెచ్ఐవీపై సమర్థంగా పని చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. ఒక్కసారి ఆ సూది వేసుకుంటే.. 56 వారాలపాటు (395 రోజులు) అది శరీరంలో ఉండి హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పిస్తున్నట్టు తేలింది. సంస్థ చేసిన క్లినికల్ ట్రయల్స్​లో ఈ విషయం వెల్లడైంది. దీనికి సంబంధించిన స్టడీ ఇటీవల లాన్సెట్ జర్నల్​లో ప్రచురితమైంది.   

క్లినికల్ ట్రయల్స్ ఇలా చేశారు.. 

క్లినికల్ ట్రయల్స్ కోసం సైంటిస్టులు 40 మంది వాలంటీర్లను ఎంపిక చేశారు. 5000 మిల్లీగ్రాముల (5 గ్రాముల) డోసున్న సూది మందును రెండు రకాలుగా విభజించారు. 5 శాతం ఆల్కహాల్ ప్రిపరేషన్​తో ఒక మందును, 10 శాతం ఆల్కహాల్ ప్రిపరేషన్​తో మరో మందును సిద్ధం చేశారు. వాలంటీర్లలో 20 మందికి మొదటి మందును, మరో 20 మందికి రెండో మందును సూది ద్వారా కండకు(ఇంట్రా మస్క్యులర్) ఇచ్చి ఏడాది పాటు మానిటర్ చేశారు. అనంతరం ఫలితాలను విశ్లేషించగా.. వారందరిలోనూ ఆ మందు ప్రభావవంతంగా పని చేసిందని తేలింది. లెనకాపవిర్​ను చర్మం కింద (ఇంట్రా క్యుటేనియస్) రెండు డోసులుగా ఇవ్వడం కన్నా కండ ద్వారా ఏడాదికి ఒకసారి ఇవ్వడం వల్ల మూడున్నర రెట్లు బాగా పనిచేసిందని గుర్తించారు. 

వాలంటీర్ల శరీరంలో వైరస్ మరింతగా వృద్ధి చెందకుండా, రెప్లికేట్ కాకుండా ఆ మందు అడ్డుకున్నదని సైంటిస్టులు వెల్లడించారు. ఈ మందు తీసుకున్న వారిలో హెచ్ఐవీ1, హెచ్ఐవీ2 యాంటీబాడీలు బాగా వృద్ధి చెందాయని చెప్పారు. వైరస్ ప్లాస్మిడ్ కణ విభజనతో రెప్లికేట్ కాకుండా హెచ్ఐవీ1, హెచ్ఐవీ2 యాంటీబాడీలు అడ్డుకుంటాయన్నారు. ఇలా ఇంజెక్షన్​ ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీలు వాలంటీర్ల శరీరంలో ఏడాదికిపైగా ఉన్నాయన్నారు. దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తే.. హెచ్ఐవీ పేషెంట్లు ఇకపై రోజూ ట్యాబ్లెట్లు మింగా ల్సిన కష్టం తప్పుతుందని వారు పేర్కొన్నారు. 

ఏటా 13 లక్షల మందికి హెచ్ఐవీ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4.5 కోట్ల మంది హెచ్ఐవీతో బాధపడుతున్నారని యూఎన్​ఎయిడ్స్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. ఏటా 13 లక్షల మంది హెచ్ఐవీ బారిన పడుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం 25 లక్షల మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారని.. ఏటా 66,400 మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇక తెలంగాణలో ప్రస్తుతం లక్షన్నర మంది హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. 2010లో హెచ్ఐవీ పేషెంట్ల సంఖ్య 2.1 లక్షలు ఉండగా.. 14 ఏండ్లలో అది 1.50 లక్షలకు తగ్గింది.

మరింత భారీ స్టడీకి కసరత్తు 

లెనకాపవిర్ సూది మందుతో సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని పరిశోధకులు తేల్చారు. సూది వేసిన చోట కొంచెం నొప్పి ఉన్నా.. అది వారంలో తగ్గిపోయిందని తెలిపారు. ఈ మందుతో ఇతరత్రా పెద్దగా దుష్ప్రభావాలేవీ కనిపించలేదని పేర్కొన్నారు. అయితే, మందుపై మరింత పెద్ద స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకే త్వరలోనే భారీ స్థాయిలో స్టడీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.