సందర్భం : అవగాహనతో అడ్డుకట్ట వేయొచ్చు!

సందర్భం : అవగాహనతో అడ్డుకట్ట వేయొచ్చు!

బ్రెస్ట్ క్యాన్సర్​ గురించి అవగాహన కలిగించడం కోసం ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో పలు కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా ఏడాదికి ఒక థీమ్​ తీసుకుంటారు. అలాగే ఈ ఏడాది తీసుకున్న థీమ్​ ‘నో వన్ షుడ్ ఫేస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎలోన్’ అంటే.. బ్రెస్ట్​ క్యాన్సర్​ మీద చేసే పోరాటం క్యాన్సర్​ బారిన పడిన వాళ్ల ఒక్కరిదే కాదని.


బ్రెస్ట్ క్యాన్సర్ ఫలానా కారణాల వల్ల వస్తుందని చెప్పడం కష్టం. కానీ, చాలావరకు హార్మోన్లలో మార్పుల వల్ల వస్తుంది. ‘‘క్యాన్సర్ అనేది ప్రాణాంతకమైనదే. కానీ, బ్రెస్ట్ క్యాన్సర్​ గురించి అంతగా భయపడాల్సిన పనిలేదు. ముందుగా కనుక్కుంటే దాన్ని నయం చేయొచ్చు. అందుకని బ్రెస్ట్​ క్యాన్సర్​ గురించి గాబరా పడొద్దు. బ్రెస్ట్​ క్యాన్సర్​కి భయపడకూడదంటే.. దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఆ అవగాహన కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి’’ అంటున్నారు రేడియేషన్​ ఆంకాలజిస్ట్​ డాక్టర్ సయ్యద్ అక్రమ్.

ఈ లక్షణాలు కనిపిస్తే..

బ్రెస్ట్​లో గడ్డ (లంప్​) ఉంటే అనుమానించాలి. దీన్ని తెలుసుకోవడం చాలా ఈజీ. స్నానం చేసేటప్పుడు చేతులతో బ్రెస్ట్​ను తడిమి చూసుకుంటే తెలుస్తుంది. చనుమొనల (నిపుల్) నుంచి డిశ్చార్జ్​ అవుతుంది. ఆ స్రావం రంగులో లేదా పాలలాగా ఉండొచ్చు. రక్తం కూడా రావొచ్చు. గట్టిపడి చర్మం రఫ్​గా మారొచ్చు. అయితే చాలామంది నొప్పి లేదని పట్టించుకోకుండా వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల రిస్క్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి దశలో క్యాన్సర్ గడ్డ నొప్పి పుట్టదు. 

దశలవారీగా..

బ్రెస్ట్​ క్యాన్సర్​లో నాలుగు దశలు ఉంటాయి. మొదటి దశలో ఈ క్యాన్సర్​ను గుర్తిస్తే 95–98 శాతం, రెండోదశలో 80–95 శాతం, మూడో దశలో 50 నుంచి 80 శాతం మందికి నయమవుతుంది. అదే చివరి స్టేజ్​లో గుర్తిస్తే క్యాన్సర్​ కణాలు బ్రెస్ట్ నుంచి ఇతర అవయవాలకు వ్యాపిస్తాయి. దాంతో ఆ అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆ స్టేజ్​లో క్యాన్సర్​ని తగ్గించలేం. కానీ వ్యాపించకుండా కంట్రోల్ చేయొచ్చు. ట్రీట్​మెంట్​, మందులు ఇస్తుంటే ఐదేండ్లలో 20 శాతం పేషెంట్లను వ్యాధి నుంచి బయటపడేయొచ్చు.

ఇవన్నీ కారణాలే..

ఒబెసిటీ (ఊబకాయం), లేట్​ మ్యారేజి, పిల్లలు పుట్టకపోవడం, తక్కువ మంది పిల్లలు ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్​ వంటివి కారణాలు. అయితే ఈ కారణాల్లో కొన్నింటిని మార్చలేం కానీ  కొన్ని విషయాల్లో మార్పులు చేసుకోవచ్చు. అలా చేస్తే క్యాన్సర్​ బారిన పడే అవకాశం ఉండదు. అవేంటంటే... 

ఒబెసిటీ వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి ఒబెసిటీ ఉన్నవాళ్లు క్యాన్సర్ విషయంలో జాగ్రత్తపడాలి. ఫిజికల్ యాక్టివిటీస్, ఫుడ్​, లైఫ్ స్టయిల్ ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి. 

​ నెలసరి అప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్​ విడుదలవుతుంది. లేట్​ మ్యారేజెస్​ వల్ల మెనుస్ట్రువల్​ సైకిల్​ వచ్చినప్పుడల్లా ఈ హార్మోన్​ రిలీజ్​ అవుతూనే ఉంటుంది. దాంతో ఎక్కువ కాలం ఈస్ట్రోజన్​ హార్మోన్​కు ఎక్స్​పోజ్​ అవుతారు. కాబట్టి బ్రెస్ట్​ క్యాన్సర్​ రిస్క్​ ఎక్కువ. అందుకని 30 ఏండ్లకు ముందే పెండ్లి చేసుకోవడం బెటర్. అలా చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో తొమ్మిది నెలల పాటు మెనుస్ట్రువల్ సైకిల్ ఉండదు. దాంతో ఈస్ట్రోజన్ విడుదల తగ్గుతుంది. అందుకే క్యాన్సర్​ రిస్క్​ లేకుండా ఉండాలంటే సరైన వయసులో పెండ్లిళ్లు చేసుకోవాలి. పిల్లల్ని కనాలి.

ఎక్కువమంది పిల్లల్ని కన్నవాళ్లకు కూడా బ్రెస్ట్​ క్యాన్సర్ ముప్పు చాలా తక్కువ. తక్కువమంది పిల్లలు ఉన్నవాళ్లకు ఆ రిస్క్ ఎక్కువ ఉండొచ్చు. 

ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్​ బారిన పడినవాళ్లు,  ట్రీట్​మెంట్ తీసుకుంటున్నవాళ్లు ఉంటే కనుక తరువాతి తరం వాళ్లు30 ఏండ్ల వయసు నుంచే స్క్రీనింగ్ టెస్ట్​లు చేయించుకోవాలి. 

ఇవి మాత్రం మారవు

జెనెటికల్​గా వచ్చే క్యాన్సర్​ని మార్చలేం. తల్లికి ఉంటే అది బిడ్డకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని హై రిస్క్ ఇండివిడ్యువల్ అంటారు. అలాంటివాళ్లు కేర్ ఎక్కువగా తీసుకోవాలి. ముందు నుంచే చెకప్​లు చేయించుకోవాలి. 

ఏజ్​ రిలేటెడ్​గా వచ్చే క్యాన్సర్​లు రిస్క్​ పెంచుతాయి. వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు వస్తాయి. అలా యాభై ఏండ్ల తర్వాత క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.

పిల్లలు లేని వాళ్లకు క్యాన్సర్​ రిస్క్​ ఎక్కువ. కారణం పిల్లలు పుట్టకపోతే ఈస్ట్రోజన్​కి ఎక్స్​పోజ్​ కావడమే. దీన్ని వైద్య పరిభాషలో నల్లి పారిటీ (Nulliparity) అంటారు.

90 శాతం కేసులు...

బ్రెస్ట్​లో ఉండే ప్రతి గడ్డ క్యాన్సర్​ అని చెప్పలేం. ఎందుకంటే18 ఏండ్ల నుంచి దాదాపు 40 ఏండ్ల మధ్యలో రకరకాల కారణంగా బ్రెస్ట్​లో గడ్డలు వస్తుంటాయి. నొప్పిగా ఉంటాయి. కానీ, అవి ప్రమాదం లేనివే. అంటే దాదాపు 90 శాతం నార్మల్​ గడ్డలే ఉంటాయి. అవి కొద్దిరోజులకు పోతాయి కూడా. కానీ, అది ఏ కారణంగా వచ్చాయనేది టెస్ట్ చేశాకే తెలుస్తుంది. కాబట్టి అనుమానం రాగానే డాక్టర్​ దగ్గరకి వెళ్లి టెస్ట్​ చేయించుకోవాలి.

నెలకు లేదా రెండు నెలలకు ఒకసారైనా స్నానం చేసేటప్పుడు మీకు మీరుగా బ్రెస్ట్ చెక్ చేసుకోవాలి. మూడు లేదా నాలుగు నెలలకు ఒకసారి డాక్టర్​ దగ్గరికి వెళ్లి టెస్ట్ చేయించుకోవాలి. ఇవికాకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్​లైన్స్ ప్రకారం 40 ఏండ్లు దాటిన ప్రతి మహిళ మూడేండ్లకు ఒకసారి మామోగ్రాఫ్​ టెస్ట్ చేయించుకోవాలి. ఇది ఎక్స్​రేలాంటి టెస్ట్. ఈ టెస్ట్ చేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో.. తెలిసిపోతుంది. ఒకవేళ ఈ టెస్ట్ చేయించుకునేందుకు భయంగా అనిపిస్తే ఏటా అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవచ్చు. అందులో కూడా క్యాన్సర్​ గురించి తెలుస్తుంది.

భయపడాల్సిన పనేలేదు

బ్రెస్ట్​ క్యాన్సర్​కు ఐదు రకాల ట్రీట్​మెంట్లు ఉంటాయి. మామూలుగా అయితే సర్జరీయే ట్రీట్​మెంట్. అయితే క్యాన్సర్ దశలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్​మెంట్లు చేస్తారు. వాటి తోపాటు హార్మోన్ థెరపీ, టార్గెట్ థెరపీ అనే సిస్టమిక్ ట్రీట్​మెంట్లు ఉంటాయి. వాటిలో బ్రెస్ట్ సర్జరీ విషయాన్నీ తీసుకుంటే..  బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని తెలిస్తే ఇదివరకు రోజుల్లో అయితే బ్రెస్ట్​ తొలగించేవారు. దాంతో బ్రెస్ట్​ ఫ్లాట్​గా కనిపించి చాలా ఇబ్బంది పడేవాళ్లు. సోషల్ లైఫ్ లీడ్ చేయడం కష్టంగా ఉండేది. ఆ బాధ డిప్రెషన్​కు దారితీసేది.

అయితే, ఇప్పుడు అడ్వాన్స్​డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు బ్రెస్ట్ తీసేయాల్సిన పనిలేకుండా గడ్డ ఉన్న చోటే ట్రీట్మెంట్ చేస్తారు. దీన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ (బి.సి.ఎస్.) అంటారు. ఆ తర్వాత రేడియేషన్ ట్రీట్​మెంట్ చేస్తారు. మోడిఫైడ్​ రాడికల్​ మ్యాస్టెక్టమీ (ఎం.ఆర్.​ఎం.)కి బదులు అంటే బ్రెస్ట్​ మొత్తం తీసేయకుండా ఇక్కడ చెప్పిన రెండు ట్రీట్​మెంట్లు కలిపి చేస్తారు. అప్పుడు అదే రిజల్ట్ వస్తుంది.
 
రేడియేషన్​ చికిత్స కూడా ఇంతకుముందు ఎడమవైపు చేయాలంటే గుండె మీద ఎఫెక్ట్ పడుతుందేమోనని భయపడేవాళ్లు. డీప్ ఇన్​హేల్ బ్రీత్​ హోల్డ్ టెక్నిక్, ఇమేజ్ గైడెడ్ రిలేషన్ ట్రీట్​మెంట్ వంటి అడ్వాన్స్​డ్ టెక్నాలజీలు వచ్చాయి. దాంతో శ్వాస ఎలా ఆడుతుందో గమనించుకుంటూ చికిత్స చేస్తున్నారు. దానివల్ల గుండె మీద రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువ పడకుండా ట్రీట్​మెంట్ చేస్తున్నారు. పూర్వం కీమోథెరపీ చేయడం వల్ల జుట్టు బాగా రాలిపోయేది. వాంతులు అయ్యేవి. అందుకని కీమోథెరపీ అంటే చాలామంది భయపడేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ ట్రీట్​మెంట్లతోపాటు సింప్టమాటిక్ ట్రీట్​మెంట్స్​లో కూడా అడ్వాన్స్​డ్ టెక్నాలజీ వచ్చింది. దానివల్ల వాంతులు కాకుండా మందులు ఇస్తున్నారు. 

నలభై ఏండ్లు దాటితే.. 

మనదేశంలోని తల్లుల గురించి చెప్పాలంటే.. వాళ్లకు తమ ఆరోగ్యం మీద కంటే కూడా పిల్లల చదువు, భర్త, కుటుంబ బాధ్యతలు అంటూ వాటిలో మునిగిపోతారు. ఇంట్లో అందరికంటే వాళ్లకి తక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటారు. వయసు రీత్యా ఏవైనా సమస్యలు వచ్చినా వాటిని పట్టించుకోరు. అందుకే ఆడవాళ్లకి చెప్పేదేంటంటే మీకు మీరుగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ‘మన ఆరోగ్యం కూడా ముఖ్యమే’ అనేది అర్థం చేసుకోవాలి. ఏటా మామోగ్రఫీ లేదా అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవాలి. పెండ్లి అయినా, కాకపోయినా నలభై ఏండ్లు దాటిన ప్రతి మహిళా  బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. 

సిటీల్లో ఎక్కువ!

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది సిటీల్లోనే ఎక్కువ ఉంది. కారణం.. ఒత్తిడి ఎక్కువగా ఉండటమే. ఒత్తిడి వల్ల హార్మోన్లు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, మంచి ఫుడ్ తినకపోవడం వంటివి కూడా అందుకు కారణాలే. అదే.. ఊళ్లల్లో అయితే త్వరగా పెండ్లిళ్లు చేస్తారు. ప్రెగ్నెన్సీలు ఎక్కువగా అందుతాయి. పిల్లలకు పాలు ఎక్కువకాలం ఇస్తారు. శారీరక శ్రమ ఎక్కువ. ఒత్తిడికి దూరంగా ఉంటారు. 

వాళ్లు క్యాన్సర్​కి భయపడరు

విదేశాల్లో క్యాన్సర్​కి ట్రీట్​మెంట్ తీసుకునేందుకు భయపడరు. అందుకు కారణం వాళ్లకు దానిమీద ఉన్న అవగాహన. అదే మన దగ్గర పరిస్థితి చూస్తే... క్యాన్సర్ వచ్చిన పేషెంట్​ దగ్గరకి వెళ్తే ఎక్కడ అంటుకుంటుందో అన్నట్టు ప్రవర్తిస్తారు. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే అంటువ్యాధి కాదు. మనవాళ్లలో ఉండే ఇంకో అపోహ ఏంటంటే క్యాన్సర్​ వచ్చిన వ్యక్తి ఉన్న కుటుంబంలో  పెండ్లీడు పిల్లలు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పరు. క్యాన్సర్​ నుంచి రికవర్ అయ్యామని ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పరు. కానీ ఇలా చేయడం మంచిది కాదు. క్యాన్సర్ సర్వైవల్ అని చెప్తే.. మరికొందరికి బాసటగా ఉంటుంది. ఎవరూ దానిగురించి భయపడకుండా ఉంటారు. క్యాన్సర్ మీద అవగాహన పెరుగుతుంది. 

అవగాహన పెంచాలి.

ఎనిమిదేండ్ల కిందట బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవేర్​నెస్ కల్పించేందుకు డాక్టర్లందరం కలిసి ఒక క్యాంపెయిన్​ చేశాం. ఆ క్యాంపెయిన్​లో సినీ నటి గౌతమి పాల్గొన్నారు. ఆవిడ క్యాన్సర్​ బారినపడి  ట్రీట్​మెంట్ తీసుకుని అప్పటికి 10 ఏండ్లు అయిందట. ‘‘క్యాన్సర్​ అని తెలిసినప్పటి నుంచి నేను డాక్టర్లనే నమ్ముకున్నా. ఏదేమైనా సరే వాళ్లు చెప్పినట్లే చేయాలనుకున్నా. ట్రీట్​మెంట్​ వల్ల కొన్ని సైడ్​ ఎఫెక్ట్స్ ఉన్నా వాటిని తట్టుకుని క్యాన్సర్​ని జయించాను” అని చెప్పారామె.

ఈ విధంగా క్యాన్సర్ సర్వైవల్​ సక్సెస్ స్టోరీలను ప్రజలకు చెప్పాలి. సెలబ్రిటీలనేకాదు.. వర్కింగ్ విమెన్, పనులు చేసుకునేవాళ్లు... ఎవరైనా సరే  మీడియా ముందుకొచ్చి మాట్లాడాలి. నలుగురికీ అవగాహన కల్పించాలి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు తొలగుతాయి. ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య లేదా అనుమానం వచ్చినా డాక్టర్ల దగ్గరకి వెళ్తారు. అలా వాళ్లకు టైంకి ట్రీట్​మెంట్ అందుతుంది. డాక్టర్కె సయ్యద్ అక్రమ్  మెడికల్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్

జాగ్రత్తలు

  • ఆకుకూరలు ఎక్కువగా తినాలి. 
  • క్యారెట్, బీట్​రూట్ వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. 
  • రోజుకు 30 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. 
  • వేపుళ్లు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.

మగవాళ్లలో...

సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్​ ఆడవాళ్లకి మాత్రమే వస్తుందనుకుంటారు. కానీ, ఆడవాళ్లకు 99 శాతం ఉంటే, మగవాళ్లలో 1 శాతం వచ్చే ప్రమాదం ఉంది. వయసుపైబడిన వాళ్లలో జన్యువుల్లో మార్పులు  చోటుచేసుకుంటాయి. కాబట్టి ఆ కారణంగా మగవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలతో పోలిస్తే మగవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్​ లక్షణాలు త్వరగా బయటపడతాయి. బ్రెస్ట్ సడెన్​గా పెరగడం, గడ్డ చేతికి తగలడం, రక్తం లేదా ఏవైనా స్రావాలు నిపుల్స్​ నుంచి కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి టెస్ట్ చేయించుకుంటారు. అలా మగవాళ్లలో చాలావరకు స్టేజ్ 1 లేదా 2లోనే డయాగ్నసిస్ చేస్తారు. వెంటనే ట్రీట్​మెంట్ దొరుకుతుంది.