
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతా, జవాబుదారీతనాన్ని పెంపొందించడం కోసం రైల్వే సిబ్బందికి మద్యం మత్తును నిర్ధారించే బ్రీత్ అనలైజర్ (డ్రంక్ అండ్ డ్రైవ్ మాదిరి) పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులతో పాటుగా బయోమెట్రిక్ హాజరు వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిశ్చయించింది. ఈ మేరకు 2025, ఏప్రిల్ 4 నుంచి పైలట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మొదట హైదరాబాద్ డివిజన్లో టికెట్ తనిఖీ చేసే సిబ్బందికి తప్పనిసరి బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరు నెలల తర్వాత జరిగే సమీక్షలో ఈ విధానాన్ని అన్ని విభాగాలకు విస్తరించాలా లేదా అన్నది నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చింది. సిబ్బంది కార్యకలాపాలలో జవాబుదారీతనాన్ని పెంపొందించడం, పారదర్శకతను నిర్ధారించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సీఆర్ స్పష్టం చేసింది. బయోమెట్రిక్ వ్యవస్థ ఉద్యోగుల హాజరు పర్యవేక్షణను క్రమబద్ధీకరిస్తుందని.. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు డ్యూటీలో ఉద్యోగుల మత్తు గురించి తలెత్తుత్తోన్న సందేహాలను పరిష్కరిస్తుందని రైల్వే బోర్డు పేర్కొంది.
ఎస్సీఆర్ నిర్ణయంపై ఆల్ ఇండియా టికెట్ చెకింగ్ స్టాఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్ సింగ్ స్పందించారు. టికెట్ చెకింగ్ సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలను ఆయన స్వాగతించారు. ఈ నిర్ణయం విధి నిర్వహణ సమయంలో సిబ్బంది మద్యం సేవించడాన్ని నిరోధించడమే కాకుండా.. ప్రయాణికుల తప్పుడు ఆరోపణల నుంచి సిబ్బందిని కూడా రక్షిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమతుల్య జవాబుదారీతనం అవసరమని అన్నారు.