ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

బహిరంగ సభతో బీజేపీ శక్తి చూపెడతాం: కృష్ణారెడ్డి

గంగాధర, వెలుగు: కరీంనగర్​ లో నిర్వహించే బహిరంగ సభతో తమ శక్తేంటో చూపెడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం చొప్పదండి నియోజకవర్గంలోని 6 మండలాల బీజేపీ లీడర్లతో మధురానగర్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 16న కరీంనగర్​ చేరుకుంటుందన్నారు. ఎస్సారార్​ కాలేజీలో చేపట్టే సభకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారన్నారు. కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ శ్రావణ్​కుమార్, మాజీ మంత్రి దేవయ్య, మాజీ ఎమ్మెల్యే శోభ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 

మృతుల కుటుంబాలకు వివేక్ పరామర్శ

వెల్గటూర్, వెలుగు: మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మంగళ వారం జగిత్యాల జిల్లాలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో ని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం అక్క గురువమ్మ అనారోగ్యంతో చనిపోయారు. కొత్తపేటలోని మాజీ సర్పంచ్ భార్య బొమ్మరవేణి కవిత, పాషిగామా గ్రామానికి చెందిన బీజేపీ లీడర్ గోపతి జనార్దన్ తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను వివేక్​ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట బీజేపీ లీడర్లు, తదితరులు ఉన్నారు. 

ఇంటి స్థలం ఉంటే రూ.3 లక్షలు

జమ్మికుంట, వెలుగు : ఇంటి స్థలం ఉన్న ప్రతి పేదవాడికి రూ.3 లక్షలు అందిస్తామని ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపల్లిలోని వైస్ చైర్మన్ స్వప్న నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలో సుమారు 3,500 మందికి ఆర్థిక సాయం అందిస్తారన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఎలాంటి సమస్యలు లేవని ప్రతిపక్ష పార్టీలే రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నాయన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్లు, లీడర్లు పాల్గొన్నారు.