ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • సెస్ ​ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు
  • హైకోర్టు ఆర్డర్ తో నోటిఫికేషన్ రిలీజ్​
  • ఓటర్​ లిస్ట్ రెడీ చేస్తున్న సిబ్బంది
  • చైర్మన్ పదవే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న పార్టీలు

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సహకార విద్యుత్ సరఫరా సంస్థ(సెస్) ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కో ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటి సెస్ ఎన్నికలకు సంబంధించి గత మంగళవారం నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో సెస్ సిబ్బంది పట్టణం, గ్రామాలలో ఓటరు నమోదు ముమ్మరంగా చేపట్టారు. వారం రోజుల్లో ఓటర్​నమోదు పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

2.70 లక్షల వినియోగదారులు..

సిరిసిల్ల సెస్ లో 2.70 లక్షల వినియోగదారులున్నారు. 255 గ్రామాలతోపాటు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలకు విద్యుత్ పంపిణీ చేస్తోంది. సెస్ పరిధిలో 275 మంది సిబ్బంది పని చేస్తున్నారు. నెలకు రూ.2.85 కోట్ల జీతాలు చెల్లిస్తున్నారు. ప్రతీనెల రూ.10.96 కోట్ల విద్యుత్ బిల్లులు వసూలవుతాయి.

2016లో ఎన్నికలు..

2016లో సెస్​ఎన్నికలు జరిగాయి. 2016 పాలక వర్గం ఐదేండ్లు పూర్తికావడంతో 2021 మార్చి నెలలోనే ఎన్నికలు నిర్వాహించాల్సి ఉన్నా టీఆర్ఎస్ ఎన్నికలు నిర్వహించలేదు. 2021 నుంచి కొన్ని రోజులు సెస్ చైర్మన్ గా ఉన్న దోర్నాల లక్ష్మారెడ్డినే పర్సన్ ఇన్​చార్జిగా నియమించారు. 2021 నుంచి 2022 వరకు కలెక్టర్ ను పర్సన్ ఇన్​చార్జిగా ప్రభుత్వం నియమించింది. 2022 ఏప్రిల్ లో మంత్రి కేటీఆర్ ఎన్నికలకు వెళ్లకుండా నామినేటెడ్ కమిటీని నియమించారు. 14 మంది డైరెక్టర్లు, గుడూరి ప్రవీణ్ చైర్మన్ గా నామినేటెడ్ పాలక వర్గం కొలువుదీరింది. అయితే నామినేటేడ్ కమిటీ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోయిన్ పల్లి మండలానికి చెందిన బీజేపీ లీడర్ కనకయ్య హైకోర్టును ఆశ్రయించగా   పాలక వర్గాన్ని కోర్టు రద్దు చేసింది. అప్పటి నుంచి కలెక్టర్ పర్సన్ ఇన్​చార్జిగా కొనసాగుతున్నారు.

మొదలైన ఎలక్షన్ హీట్..

వచ్చేనెలలో సెస్ ఎన్నికలలో చైర్మన్ పదవిని చేజిక్కించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇప్ప టి నుంచే పావులు కదుపుతున్నాయి. నలుగురు ఎమ్మెల్యేల పరిధిలో సెస్ ఎన్నిక ఉండడంతో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, మానుకొండూర్ నుంచి బాలకిషన్, సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటున్నారు.

5 నుంచి సెస్ ఎన్నికల ప్రక్రియ..

డిసెంబర్ 5 నుంచి సెస్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు, 16న నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణలు, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు, 24న ఎన్నికలు, 26న ఓట్ల లెక్కింపు, డిసెంబర్ 27న విజేతల ఫలితాల విడుదల చేయనున్నారు. 11 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2021లో నియమించిన నామినేటెడ్ కమిటీలో 14 మంది డైరెక్టర్లకు చోటు లభించగా ప్రస్తుతం 2016 ఎన్నికల ఆధారంగానే సెస్ డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరగుతాయని అధికారులు తెలిపారు.

‘దళిత బంధు’తో ఆర్థిక వృద్ధి: కరీంనగర్ ​కలెక్టర్ కర్ణన్ 

కరీంనగర్ సిటీ, వెలుగు: దళిత బంధు సాయంతో దళితులు ఉపాధి పొంది, ఆర్థికంగా వృద్ధి చెందుతున్నారని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. ఆదివారం నగరంలోని జ్యోతిబా పూలే గ్రౌండ్స్ లో నల్సా, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చట్టపరమైన అవగాహన ద్వారా పౌరుల సాధికారత’ కార్యక్రమంలో జడ్జి శ్రీవాణి, సీపీ సత్యనారాయణతో కలిసి కలెక్టర్​మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కరికి రూ.58,000 వేల విలువగల బ్యాటరీ వీల్ చైర్స్, ఒకరికి రూ.37,000 విలువగల బ్యాటరీ ట్రై సైకిల్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు రూ.513.50 లక్షల శ్రీనిధి రుణాలు, ఇద్దరికి  సదరం సర్టిఫికెట్లు, ముగ్గురికి టీబీ పింఛన్లు, ముగ్గురికి రూ.50,000 చొప్పున కొవిడ్ కాంపెన్సేషన్, పలువురికి షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులు అందించారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి అరుణ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ లో డ్రైపోర్టు నిర్మించాలి
కిసాన్ జాగరణ్​ అధ్యక్షుడు సుగుణాకర్ రావు

కరీంనగర్ టౌన్,వెలుగు: జిల్లాలోని ఖనిజ వనరులు సద్వినియోగం చేసుకునేందుకు డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ నేత, కిసాన్ జాగరణ్‍జాతీయ అధ్యక్షుడు సుగుణాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక జ్యోతినగర్ లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలోని పచ్చునూర్ లో 500 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉందని, సముద్రం నుంచి నేరుగా పచ్చునూర్ గ్రామానికి చేపలు, రొయ్యలు తదితర మత్స్య సంపదను రవాణా చేసుకునేందుకు అనువుగా ఉందన్నారు. కిసాన్ మేళాను విజయవంతం చేసినందుకు రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో తాళ్లపల్లి హరికుమార్ గౌడ్, సుజాతరెడ్డి, మొలుగూరి కిషోర్, లింగంపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

  • భూమికి బరువయ్యే పంటలు పండిస్తున్నం
  • తెలంగాణను చూసి ఢిల్లీ పాలకుల కడుపు మండుతోంది 
  • మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్​ రూరల్​, వెలుగు: కాళేశ్వరం ద్వారా భూమికి బరువయ్యే పంటలు పండిస్తున్నామని, పంటలతో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఢిల్లీ పాలకుల కడుపు మండుతోందని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతారం, బహదూర్ ఖాన్ పేట్, మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, బొమ్మకల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఆదివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడి బొగ్గు, నీరు, హైదరాబాద్ సొత్తును దోపిడీ చేసి మళ్లీ తెలంగాణను గుడ్డిదీపంగా మార్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. గతంలో యూరియా కోసం లైన్లో చెప్పులు పెట్టి, పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి ఉండేదన్నారు. టీఆర్ఎస్ పాలనలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారం రోజుల్లో రైతులకు డబ్బులు అందజేస్తున్నామన్నారు.  ఎలాబోతారంలో రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 15,887 మెట్రిక్​టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి అన్నారు. అనంతరం మండలంలోని బహదూర్​ఖాన్​పేట్ లో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. బొమ్మకల్​లో నిర్వహించిన సర్పంచ్ కప్ క్రికెట్ పోటీలలో ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్​ లాల్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

వైభవంగా లక్ష దీపోత్సవం

జగిత్యాల, గోదావరిఖని, వెలుగు: కార్తీక పౌర్ణమి సందర్భంగా జగిత్యాల ఆత్మారాం ఫంక్షన్ హాల్ లో,  గోదావరిఖనిలోని మార్కండేయ దేవాలయంలో మహిళలు లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తులసి కల్యాణం, లింగోద్భవం, మహా రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు పూజ సామగ్రి, దీపాలు ఉచితంగా అందజేశారు. అనంతరం భక్తులు ప్రసాదంగా భిక్షను స్వీకరించారు. 

ఉద్యోగ నియామకాలు చేపట్టాలి: బీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్తయ్య

గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమలో కొత్తగా మైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభించి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని బీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనుబంధ సింగరేణి కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్మిక సంఘం‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం 17న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆదివారం యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడారు. బొగ్గు గని కార్మికులకు 11వ వేతన ఒప్పందం త్వరగా పూర్తి చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు 8 గంటల పని కల్పించి హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు సతీశ్, సిరిపురం నర్సయ్య, తాట్ల లక్ష్మయ్య, గాజుల వెంకటస్వామి, ఎల్లావుల కోటయ్య, ఆరెల్లి శ్రీకాంత్, యాట శ్రావణ్, గుండెబోయిన భూమయ్య పాల్గొన్నారు.

  • చెరువు తూము నుంచి వాటర్ ​లీక్
  • అర్దరాత్రి గేటునుపైకి లేపిన దుండగులు

వీర్నపల్లి, వెలుగు: మండల కేంద్రంలోని వెంకట్రాయిని చెరువు తూము గేటును శనివారం అర్దరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పైకిలేపి వదిలేయడంతో నీరు వృథా అవుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో చేపల కోసం రెండేళ్లుగా వీర్నపల్లి, కంచర్ల గ్రామస్తుల మధ్య వివాదం కొనసాగుతోంది. అలాగే చెరువులో భూములు మునిగిన రైతులు నష్టపరిహారం ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటనతో వెంకట్రాయిని చెరువు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ సత్యనారాయణ మాట్లాడుతూ తూము గేటును పైకిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక బస్తాలతో నీటిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.