ఎస్సీ కాలనీని ఖాళీ చేయించండి
కలెక్టర్‌ను కోరిన సింగరేణి జీఎం
గోదావరిఖని, వెలుగు : సింగరేణి రామ గుండం రీజియన్ పరిధి జీడీకే 11వ భూగర్భ గనిలో బొగ్గును వెలికితీస్తున్నందున దాని ఉపరితలంలో ఉన్న చందనాపూర్ ఎస్సీ కాలనీని ఖాళీ చేయించాలని ఆర్జీ 1 జీఎం కె.నారాయణ కలెక్టర్ సంగీతను కోరారు. బుధవారం కలెక్టర్‌ను కలిసి వివరాలు వెల్లడించారు. గనిలో బొగ్గు తొలగించే సమయంలో ఇండ్లు కూలిపోతాయని అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, భూసేకరణ తదితర విషయాలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ద్వారా తెలుసుకున్న కలెక్టర్ ఆర్డీఓ ద్వారా ఇళ్లల్లో నివసిస్తున్న వారికి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రణాళికాబద్ధంగా చదివితే మంచి మార్కులు: డీఈఓ రాధాకిషన్
కోనరావుపేట, వెలుగు : పదో తరగతి విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయని రాజన్న సిరిసిల్ల డీఈఓ డి.రాధాకిషన్ అన్నారు. బుధవారం కోనరావుపేట మండలం మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో సూచనలు, సలహాలు చేశారు. అనంతరం స్కూల్ రికార్డులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, ఎస్ఎంసీ చైర్మన్ మల్లారెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.
‘ధరణి’ని రద్దు చేయాలె
పెద్దపల్లి, వెలుగు: ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పెద్దపల్లి డీసీసీపీ ఈర్ల కొమురయ్య అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఆఫీసులో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్ రద్దు, భూ సమస్యల పరిష్కారం, అర్హులకు పట్టాలు, కౌలు చట్టం అమలు, రైతు రుణ మాఫీ తదితర డిమాండ్ల సాధన కోసం కాంగ్రెస్ పోరాటాలకు సిద్ధమవుతోందన్నారు. నవంబర్ 24న మండల కేంద్రాల్లో నవంబర్ 30న నియోజకవర్గ కేంద్రాల్లో, డిసెంబర్ 5న కలెక్టరేట్ ల ముందు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో లీడర్లు ఎస్కే అక్బర్, రాజయ్య గౌడ్, విజయ్ కుమార్, ఫిరోజ్ ఖాన్, ప్రశాంత్ రాజ్ పాల్గొన్నారు
ఎస్సైల బదిలీ
గోదావరిఖని, వెలుగు : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో ముగ్గురు ఎస్సైలను బదిలీ చేస్తూ సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం ట్రాఫిక్ ఎస్సైగా పనిచేస్తున్న ఎస్.లక్ష్మణ్‌ను లక్సెట్టిపేట ఎస్‌హెచ్‌ఓగా, రామగుండం సీఎస్‌బీ అటాచ్‌గా ఉన్న కె.ప్రసాద్‌ను లక్సెట్టిపేట 2వ ఎస్సైగా, లక్సెట్టిపేట ఎస్సై డి.చంద్రశేఖర్‌ను ఆసిఫాబాద్ జిల్లా వెయికెన్సీ రిజర్వ్‌కు బదిలీ చేశారు.
విధి నిర్వహణలో మేయర్ విఫలం
నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ రోహిత్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: విధి నిర్వహణలో మేయర్ సునీల్ రావు ఘోరంగా విఫలమయ్యారని నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ మెన్నేని రోహిత్ రావు ఆరోపించారు. బుధవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో శానిటేషన్సిబ్బంది చెత్త సేకరించడంలేదని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని మండిపడ్డారు. పార్టీ సభ్యులంతా నగరవ్యాప్తంగా నెలకొన్న సమస్యల్ని పరిశీలించామని, 2 గంటల వ్యవధిలో 300 సమస్యలను ఫొటోలతోసహా గుర్తించామని వెల్లడించారు. అందులో డ్రైనేజీ 77, అస్తవ్యస్త రోడ్లు 51, పందులు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నవి 95 సమస్యలున్నాయని వివరించారు. ఈ అంశాలపై 48 గంటల్లో స్పందించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అబ్దుల్ రహమాన్, బీసీసెల్ డిస్ర్టిక్ట్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్, మోహన్, ఆమీర్, లీడర్లు పాల్గొన్నారు.
రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి చర్యలు: ఎమ్మెల్యే చందర్
గోదావరిఖని, వెలుగు : పట్టణ ప్రగతి నిధులతో రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. బుధవారం 31వ డివిజన్ పరిధిలో రూ.60 లక్షలతో కొత్త కురగాయల మార్కెట్, వరద కాలువ ప్రహరీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుంచి ప్రతి డివిజన్‌లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు. అంతకుముందు స్థానిక మార్కండేయకాలనీలోని నిర్వహించిన తెలంగాణ బాలోత్సవ్‌లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మేయర్ అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు స్వరూప, రామస్వామి, శ్రీనివాస్, సతీశ్ కుమార్, రమణారెడ్డి, శ్రీనివాస్, బాల రాజ్ కుమార్ పాల్గొన్నారు.
‘శానిటేషన్ సిబ్బంది సేవలు మరువలేం’
వేములవాడ, వెలుగు: కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో శానిటేషన్ సిబ్బంది చేసిన సేవలు మరువలేమని వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, చైర్ పర్సన్ మాధవి అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ ఆఫీస్ లో సిబ్బందికి పీపీ కిట్లు, గ్లౌజులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణం పరిశుభ్రంగా ఉందంటే మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితోనేనని, సిబ్బంది తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజలు రోడ్లపై చెత్త పడేయొద్దన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ కిరణ్, మేనేజర్ వంశీ, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
జమ్మికుంట: నిత్యం దుమ్ము, ధూళిలో పనిచేస్తూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పారిశుధ్య కార్మికులు పని చేస్తారని మున్సిపల్ చైర్మన్రాజేశ్వర్ రావు, కమిషనర్సమ్మయ్య, వైస్ చైర్ పర్సన్స్వప్నలు అన్నారు. బుధవారం పట్టణంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 130 మంది పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కొవిడ్సమయంలో కార్మికులు చేసిన సేవలు కొనియాడారు. పట్టణాన్ని సందరంగా తీర్చిదిద్దడంలో తనవంతు పాత్ర పోషిస్తున్న మున్సిపల్శానిటరీ ఇన్ స్పెక్టర్సదానందం, నాగమ్మ, సురేశ్, రమేశ్, రామ, వనితను సన్మానించారు. కార్యక్రమంలో మేనేజర్భూపాల్రెడ్డి, సీనియర్అసిస్టెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
‘అంగారక టౌన్ షిప్ ఆదాయం రూ.86.25 కోట్లు’
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ శివారు తిమ్మాపూర్ మండలంలోని అంగారక టౌన్ షిప్ లో 9 రోజుల్లో 540 ప్లాట్లు వేలం వేయగా రూ.86.25కోట్ల ఆదాయం వచ్చిందని కలెక్టర్ కర్ణన్ తెలిపారు. బుధవారం కరీంనగర్ లోని వాసర గార్డెన్ లో 60 ప్లాట్లను వేలం వేయగా రూ.8.88 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. వేలంలో అత్యధికంగా చదరపు గజానికి రూ.11,200, అతి తక్కువ చదరపు గజానికి రూ.6,000 ధర పలికిందని తెలిపారు. 25వ తేదీన 56 ప్లాట్లతోపాటు 10 రోజుల్లో వేలం వేయగా మిగిలిన 75 ప్లాట్లకు వేలం వేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్ లాల్, మెప్మా పీడీ రవీందర్, తహసీల్దార్ కనకయ్య పాల్గొన్నారు.
దివ్యాంగులకు క్రీడా పోటీలు
సిరిసిల్ల టౌన్, వెలుగు : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్ల పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజం దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు సాంఘిక వికాసానికి దారితీస్తాయన్నారు. అనంతరం జూనియర్, సీనియర్ విభాగంలో క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు డిసెంబరు 3వ తేదీన బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీఓలు ఎల్లయ్య, అలేఖ్య, సుచరిత, ఆనందిని, సఖి అడ్మిన్ రోజా, సిబ్బంది పాల్గొన్నారు.
దళితబంధుతో కార్మికులు యజమానులైన్రు: కరీంనగర్ కలెక్టర్ కర్ణన్
కరీంనగర్ టౌన్,వెలుగు: దళితబంధు పథకంతో కార్మికులు యజమానులయ్యారని కరీంనగర్కలెక్టర్ కర్ణన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన చోట పెట్టుబడి పెట్టి మంచి లాభాలు గడించాలని సూచించారు. వ్యాపారం అనేది కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితం కాదని, కష్టపడే తత్వం, అభిరుచి ఉన్న వారంతా పారిశ్రామికవేత్తలుగా వ్యాపారంలో రాణిస్తారన్నారు. సరికొత్త ఆలోచన ఉండి కష్టపడేతత్వంతో గొప్ప వ్యాపారస్తులుగా ఎదగుతారని అన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రతిభకు, అవకాశాలకు ఏమాత్రం కొదవలేదని చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమ కేంద్రం జీఎం నవీన్ కుమార్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మనోహర్, అధికారులు పాల్గొన్నారు.
నిర్వాసితులు ఆందోళన చెందొద్దు
చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్
గంగాధర, వెలుగు : నారాయణపూర్ ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందొద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం మండలంలోని మధురానగర్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ లు దేశానికి పట్టిన చీడ పురుగులని, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపానికి నారాయణపూర్ రిజర్వాయర్ బాధితులు శాపం అనుభవిస్తున్నారన్నారు. గండిపడిన నారాయణపూర్ రిజర్వాయర్, ఎల్లమ్మ చెరువు కట్టల మరమ్మతుకు నిధులు మంజూరయ్యాయని, పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు. సమావేశంలో వైస్‌ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గంగాధర్, పీఏసీఎస్‌ల చైర్మన్లు తిర్మల్‌రావు, బాలాగౌడ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బియ్యం ఎగుమతులపై సెస్ రైతులకు శాపం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, వెలుగు: బియ్యం ఎగుమతిపై 20 శాతం సెస్ విధింపు, నూకపై ఎత్తి వేత రైతులకు, వ్యాపారులకు శాపంగా మారిందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధ అధ్యక్షతన జరిగిన సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తప్ప, తాల లేకుండా చూడాలని, మిల్లర్లు కోతలు విధిస్తే సహించేది లేదన్నారు. అనంతరం మార్కెట్ లో నిర్మిస్తున్న పండ్ల మార్కెట్ ను పరిశీలించారు. ట్రేడర్లకు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని వచ్చే సీజన్ నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఆసిఫ్, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సింగరేణి వాలీబాల్ పోటీ విజేత శ్రీరాంపూర్
గోదావరిఖని, వెలుగు : సింగరేణి ఆర్జీ 2 ఏరియాలోని ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో బుధవారం జరిగిన కంపెనీ లెవల్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీరాంపూర్ జట్టు విజయం సాధించింది. సింగరేణివ్యాప్తంగా 11 ఏరియాలకు చెందిన క్రీడాకారులు పోటీలో పాల్గొనగా శ్రీరాంపూర్, ఆర్జీ 1,2 జట్ల మధ్య ఫైనల్ జరిగింది. విన్నర్, రన్నర్ జట్లకు ఆర్జీ 2 ఏరియా జీఎం మనోహర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ ఓటు జీఎం రవీందర్, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షులు జి.మోహన్ రెడ్డి, జి.రాజేంద్రప్రసాద్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల దాతృత్వం
గురువు కుటుంబానికి రూ.3 లక్షలు అందజేత
వీణవంక, వెలుగు: స్థానిక సరస్వతి శిశు మందిర్ స్కూల్విశ్రాంత హెడ్మాస్టర్, దివంగత రంగాచార్యులు కుటుంబానికి పాఠశాల పూర్వ విద్యార్థులు రూ.3 లక్షలు సాయం చేశారు. రంగాచార్యులు ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. దీంతో పూర్వ విద్యార్థులు విరాళాలు సేకరించి బుధవారం ఆయన సతీమణి పద్మకు అందించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కొండల్ రెడ్డి, సత్యనారాయణ, నాగరాజు, రాఘవులు, రాజేశ్, రమేశ్తదితరులు పాల్గొన్నారు.
అదనపు బస్సులు నడపాలని డీఎంకు వినతి
కోనరావుపేట, వెలుగు: మండల కేంద్రానికి ఉదయం, సాయంత్రం అదనంగా రెండు బస్సులు నడపాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి సురేందర్ రావు, మండలాధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుతూ మండల కేంద్రంలో కేజీబీవి, మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీలు ఉన్నాయని, సమయానికి బస్సుల్లేక స్టూడెంట్లు స్కూళ్లకు వెళ్లలేకపోతున్నారన్నారు. విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని కోనరావుపేటకు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 5 గంటలకు రెండు బస్సులు నడపాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, తిరుపతి గౌడ్, మోహన్ నాయకులు పాల్గొన్నారు.
=======================
ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు స్థలం కేటాయించాలి
గోదావరిఖని, వెలుగు : కార్మికులు, పేదలకు వైద్యసేవల కోసం కేంద్రం ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను మంజూరు చేసిందని, దాని నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం ఎమ్మార్వో జాహెద్ పాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్పిటల్కోసం స్థలం కేటాయించాలని ఈఎస్‌ఐ ఆఫీసర్లు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు కోరుతున్నా పట్టించుకోవడంలేదని అన్నారు. వారిలో బీజేపీ సీనియర్ లీడర్ గాండ్ల ధర్మపురి, నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేశ్, పి.రవీందర్, ఎస్.లక్ష్మీనర్సయ్య, కె.వెంకటరమణ, జె. నరహరి, ఎస్. మల్లేశ్, కె.సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కుక్కల బెడద అరికట్టాలని వినతి...
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 50 డివిజన్లలో కుక్కల బెడదను అరికట్టాలని బజేపీ లీడర్లు బుధవారం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. వెహికల్స్‌పై వెళ్లే వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని తెలిపారు. బీజేపీ సీనియర్ లీడర్ రాజేశ్, రామన్న, రాజు, గోగుల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.