ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • అన్ని రంగాల్లో మనమే టాప్​
  • దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు తెలగాణలోనే
  • రూ.7,500 కోట్లతో స్కూళ్ల అభివృద్ధి
  • 7,800 క్రీడా ప్రాంగణాల ఏర్పాటు
  • మినిస్టర్లు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్​

కరీంనగర్ టౌన్, వెలుగు: అన్ని రంగాలలో తెలంగాణ ముందున్నదని, ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని మంజూరు చేసి దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలున్న రాష్ట్రంగా తయారు చేసుకున్నామని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ లో రూ.7కోట్ల ఖేలో ఇండియా నిధులతో  నిర్మించిన 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, 100 మీటర్ల పరుగు పందెం, షార్ట్ ఫుట్ క్రీడలను బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్ పారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.7,500 కోట్లు కేటాయించిందన్నారు.  గ్రామీణ స్థాయి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో 7,800 క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామన్నారు. 90 నియోజకవర్గాల్లో ఇండోర్ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని,- ఇప్పటికి 45 స్టేడియమ్స్  పూర్తి చేశామని పేర్కొన్నారు.  

నిరుద్యోగులతో చెలగాటమాడారు.. 

సమైక్య పాలనలో లీడర్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ఆరోపించారు. తెలంగాణ వచ్చాక దేశ,విదేశాలకు దీటుగా అద్భుతమైన మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని చేపట్టామన్నారు. కుల వృత్తులు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ఉద్యోగులకు కూడా ప్రాధాన్యం కల్పించామన్నారు. క్రీడలతోపాటు విద్యకు ప్రాధాన్యమిచ్చి 1000 గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి కరీంనగర్ పాత పీజీ కాలేజీ మైదానంలోని 12 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. 

టూరిజం కేంద్రంగా కరీంనగర్​..

మానేర్ రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి కరీంనగర్ ను గొప్ప టూరిజం కేంద్రంగా మార్చుకుందామని మినిస్టర్​కమలాకర్ తెలిపారు. పట్టణాన్ని విద్య, వైద్యంతోపాటు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం రాష్ట్ర ప్రణాళిక  సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు కరీంనగర్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని పూర్తిచేసి రంజీ ట్రోఫీ ఆడేవిధంగా ముందుకు సాగుదామన్నారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో బాస్కెట్ బాల్ కోర్టును ప్రారంభించారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, జడ్పీ చైర్ పర్సన్ విజయ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాపును తనిఖీ చేసిన సెంట్రల్ టీం

తిమ్మాపూర్, వెలుగు: మండలంలోని రామకృష్ణ కాలనీలో ఉన్న రేషన్ షాపును సెంట్రల్ టీం సిబ్బంది శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార భద్రత పౌర సరఫరాల శాఖ అండర్ సెక్రెటరీ సుశీల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న రేషన్ సరుకులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీలర్లు ఇబ్బంది పెడితే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆహార పౌరసరఫరాల శాఖ అధికారులు అనూప్ కుమార్, జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా అధికారి సురేశ్, తహసీల్దార్ కనకయ్య, ఆర్ఐ అనీల, తదితరులు పాల్గొన్నారు. 

దోచుకున్నోళ్లే ఓట్లు అడుగుతున్నరు: కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​

సిరిసిల్ల టౌన్, వెలుగు : సెస్​ను దోచుకున్న నాయకులే మళ్లీ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్​పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ఆరోపించారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సెస్​ టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమార్కులకు నిలయంగా మారిందన్నారు. సెస్ ను కాపాడాల్సిన బాధ్యత వినియోగదారులదేనని, కాంగ్రెస్​ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్​, బీజేపీ రెండూ ఒక్కటేనని, ప్రజలను మోసగించేందుకు ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.  

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి:సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

వీర్నపల్లి, వెలుగు: తెలంగాణ వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా పోడు రైతులకు పట్టాలివ్వకపోవడం అన్యాయమని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సీపీఐ ఎప్పుడూ అండగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. శుక్రవారం వీర్నపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోడు రైతులకు పట్టాలు లేకపోవడంతో రైతుబంధు, రైతుబీమా అందక రోడ్డున పడుతున్నారన్నారు. వారిపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. దళితులకు దళిత బంధు, నిరుపేదలకు డబుల్ బెడ్ రూంలు, ఇండ్ల స్థలాలు వచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వెంకట్రాయిని చెరువులో మునిగిన భూములను వెంకట రెడ్డి పరిశీలించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేణు, జిల్లా రైతు సంఘం కార్యదర్శి అంజయ్య తదితరులు ఉన్నారు.  

రైతులపై మోడీ వివక్ష చూపుతున్నరు: ఎమ్మెల్యేలు రవిశంకర్, బాలకిషన్ 

కరీంనగర్ టౌన్, వెలుగు: తెలంగాణ రైతులపై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ఎదుట నిర్వహించిన రైతు మహాధర్నాలో వారు మాట్లాడారు. కళ్లాల నిర్మాణాలు పూర్తి చేసుకున్న రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్​చేశారు. ఇతర రాష్ట్రాల్లో రైతులకు ఇస్తున్న సహకారం తెలంగాణలో ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అనంతరం రైతు వ్యతిరేక విధానాలపై ప్లకార్డులు చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్​ రావు తదితరులు  పాల్గొన్నారు.