ఉమ్మడి కరీంగనర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంగనర్ జిల్లా సంక్షిప్త వార్తలు

 

  • వడ్లు అగ్గువకు కొంటున్రు..
  • సెంటర్లు తెరవక దళారుల దందా

కరీంనగర్, వెలుగు: జిల్లాలో కొనుగోలు సెంటర్లు స్టార్ట్​ కాకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. పండిన  ప్రతి గింజా కొంటామని ప్రభుత్వం చెబుతున్నా అది ఫీల్డ్ లెవల్ లో కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లాలో అన్ని మండలాల్లో ఇప్పటికే వరి కోతలు స్టార్ట్​అయ్యాయి. అయినా నేటినీ ఒక్క కొనుగోలు సెంటర్​కూడా ఓపెన్ కాలేదు. దీంతో రైతులు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేక, అప్పులిచ్చినవారు, ఖర్చుల కోసమని తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే అదునుగా దళారులు కాంటా కొడుతూ, ఇష్టారీతిన వడ్లు కటింగ్​చేస్తున్నారు. 

కల్లాల్లో ధాన్యం.. 

కరీంనగర్ జిల్లాలో శంకరపట్నం, జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, గంగాధర, గన్నేరువరం  లాంటి మండలాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు సెంటర్లు స్టార్ట్​చేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా దీనిపై అవగాహన కల్పించడం లేదు. కోతలు కోసుకుని ఉన్న రైతులు ధాన్యాన్ని ఎక్కడ ఆరబోసుకోవాలో తెలియక కల్లాల్లోనే దళారులకు కాంటా పెడుతున్నారు. కొందరు గతంలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసిన స్థలాల్లోనే వడ్లు పోస్తున్నారు. మరికొందరైతే  కల్లాల వద్ద జాగ దొరకక వరి కోత మిషన్లతో కోసిన వడ్లను అక్కడిక్కడే సంచులు నింపి, అగ్గువకు దళారులకు అమ్ముతున్నారు. ఇదే అదునుగా వడ్లు పచ్చిగా ఉన్నాయని ఇష్టారీతిన కటింగ్​పెడుతున్నారు. జమ్మికుంట  ఏరియాలో వ్యాపారుల కింద పని చేసిన గుమాస్తాలు కూడా దళారుల అవతారం ఎత్తారు. వాళ్లే ఆంధ్రా వాళ్లతో డీల్ కుదుర్చుకుని లారీలు మాట్లాడి, ఇక్కడ నుంచి లోడ్ చేసి పంపిస్తున్నారు.  తక్కువ ధరకు కొని సుమారుగా లారీకి రూ. 25వేల వరకు కమీషన్​రూపంలో తీసుకుంటున్నారు. కొనుగోలు సెంటర్లలో అమ్ముకుంటే క్వింటాకు రూ. 2060 మద్దతు ధర వస్తుంది. దళారులు మాత్రం రూ.1590–1600 లకే కొంటున్నారు.  అంటే క్వింటాల్​కు సుమారుగా రూ. 500 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ లెక్కన తక్కువలో తక్కువ 50 క్వింటాలు అయినా రూ. 25వేలు నష్టపోతున్నారు. 

పెట్టుబడులు తెచ్చినకాడ ఆగుతలేరు

ఈ వానాకాలంలో వడ్లు బర్కత్  లేదు.  ఎకరాన 30 క్వింటాళ్లు పండాల్సిన కాడ 22  క్వింటాళ్లకు మించి వస్తలేవు.  దీనికి తోడు  సర్కార్ వడ్లు కొనకపోవడంతో ఆరబోస్తే ఇంకా వజన్ తగ్గుతున్నయ్. ఎన్ని రోజులు అని ఎదురుచూడాలి. పెట్టుబడులు తెచ్చిన కాడ ఆగుతలేరు. క్వింటాకు రూ. 1600 లోపే  దళారులకు అమ్ముకుంటున్నాం. అదే టైమ్ కు  సెంటర్లు ఓపెన్ చేస్తే మాకు క్వింటాకు రూ.500 దాకా కలిసొచ్చేది.  

- హనుమంతు, రైతు  చెల్పూర్ గ్రామం 

ఎవరూ పట్టించుకుంటలే..  

వడ్లు కొనుగోలు సెంటర్ కు తీసుకపోయి 20 రోజులైతాంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకుంటలే. ప్రజాప్రతినిధులు అంతా మునుగోడు ఎలక్షన్​కు పోయిండ్రట.   ఆ ఎలక్షన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.  ధాన్యం కుప్పల కాడ ఎన్ని రోజులు కాపలా ఉంటాం.  ప్రభుత్వం ఎప్పుడు కొంటదోనని  గతిలేక దళారులకు కు  రూ.1600 కే అమ్ముకుంటున్నాం.

- బోయిని శ్రీనివాస్ రైతు , గన్నేరువరం     

స్వధార్ గృహ్​ను తనిఖీ చేసిన కలెక్టర్

కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ లోని స్వధార్ గృహ్​ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వధార్ లోని  కిచెన్, రూమ్​లు, టాయిలెట్స్, పరిసరాలను, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అందులో ఉన్నవారితో కలెక్టర్​ మాట్లాడుతూ ఎక్కడి నుంచి వచ్చారు... సమస్యేంటి అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనాలు అందించాలని కుక్, వాచ్ మెన్ లను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో స్వధార్ గృహ్​ఇన్​చార్జి రమాదేవి, రజిత పాల్గొన్నారు.

అప్రోచ్ రోడ్డు  పనులను స్పీడప్​ చేయాలి 

కరీంనగర్ సిటీ, వెలుగు: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను స్పీడప్​చేయాలని కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆర్అండ్ బీ అధికారులతో కలిసి కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు  పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో ఈఈ సాంబశివరావు, తహసీల్దార్ సుధాకర్, ఏఈలు, కాంట్రాక్టర్లు 
పాల్గొన్నారు.

  • కేటాయించిన భూమికి హద్దుల ఏర్పాటుకు యత్నం
  • దళితులను అడ్డుకున్న రెవెన్యూ స్టాఫ్, పోలీసులు 

కొడిమ్యాల, వెలుగు: గతంలో దళితులకు కేటాయించిన భూమిలో హద్దులు ఏర్పాటు చేసేందుకు ఎస్సీలు ప్రయత్నించగా వారిని రెవెన్యూ, పోలీసులు అడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి విలేజ్ సర్వే నంబరు 342 లో ఎనిమిది ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో ఎస్సీలకు చెందినదిగా ఉంది. ఈక్రమంలో విలేజ్ కి చెందిన కొందరు దళితులు 96 ప్లాట్లు చేసుకొని కబ్జాలోకి వెళ్లడానికి గురువారం ప్రయత్నించారు. దీంతో తహసీల్దార్ స్వర్ణ తన సిబ్బందితో కలిసి వెళ్లి వారిని అడ్డుకున్నారు. దీంతో దళితులకు, రెవెన్యూ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ భూమిని ఇతరులకు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు.  డీఎస్పీ ప్రకాశ్, సీఐ రమణమూర్తి, కొడిమ్యాల, మల్యాల ఎస్ఐలు ఘటనాస్థలానికి చేరుకొని ఆందోళన కారులను చెదరగొట్టారు. అనంతరం రెవెన్యూ స్టాఫ్  హద్దు రాళ్లను తొలగించారు. 

  • ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూపై..
  • పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్​ నిరసనలు

నెట్​వర్క్, వెలుగు: 
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం బీజేపీ, టీఆర్ఎస్​శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ టీఆర్ఎస్ ​డ్రామా అని, దీనిపై సిట్టింగ్​జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ ​చేస్తూ బీజేపీ ఆందోళన చేసింది.  కరీంనగర్​తోపాటు వివిధ పట్టణాల్లో పోటాపోటీగా బీజేపీ, టీఆర్ఎస్ ​లీడర్లు నిరసనలు చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఎదురుపడి నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.  పోలీసులు వచ్చి ఇరువర్గాలను అడ్డుకున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నిస్తోందని, అందుకే బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని ఆరోపిస్తూ టీఆర్ఎస్ ​లీడర్లు నిరసన చేపట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని బీజేపీపై  ఆపార్టీ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని నిరసిస్తూ కరీంనగర్ కమాన్​ చౌరస్తాలో, నగునూరులోని ​ప్రతిమ కాలేజీ ముందు బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.  మంథనిలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎడ్ల సదాశివ ఆధ్వర్యంలో దహనం చేశారు.  జమ్మికుంట, కోరుట్ల , కథలాపూర్, కోనరావుపేట, వేములవాడ మండలాల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ దిష్టి బొమ్మ దహనం చేశారు. కిసాన్ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిరికొండలో నేషనల్​హైవేపై రాస్తారోకో చేశారు. 

టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో... 

టీఆర్ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు.  మేయర్ యాదగిరి సునీల్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద మోడీ దిష్టి బొమ్మ ను దహనం చేశారు. కోనరావుపేట మండల కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవయ్య ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు.  కోరుట్లలో నేషనల్​హైవేపై ధర్నా చేశారు. 

  • అప్పులు తెచ్చి జీపీ సిబ్బందికి జీతాలు చెల్లిస్తున్నాం
  • కోనరావుపేట సర్వసభ్య సమావేశంలో సర్పంచ్​లు 

కోనరావుపేట, వెలుగు: నాలుగు నెలలుగా జీపీలకు సెంట్రల్,స్టేట్ ఫండ్స్ రావడం లేదని, చేసిన పనులకు సైతం బిల్లులు ఇవ్వడం లేదని, అప్పులు తెచ్చి సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నామని కోనరావుపేట మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు తమ గోడును వెల్లబోసుకున్నారు. గురువారం ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్​కు జడ్పీ చైర్​పర్సన్​ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. సమావేశంలో సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు పర్శరాములు మాట్లాడుతూ పంచాయతీలలో ఫండ్స్ లేక పనులు చేయడానికి సర్పంచ్​లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారన్నారు. జడ్పీ చైర్​పర్సన్​ అరుణ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు.  నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను
 ఆదేశించారు.

  • యువతకు ‘టాస్క్’ ఆధ్వర్యంలో శిక్షణ 
  • మంత్రి గంగుల కమలాకర్ 

కరీంనగర్ సిటీ, వెలుగు:  జిల్లాలోని నిరుద్యోగ యువతకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ (టాస్క్)  ద్వారా  బ్యాంకింగ్, హోటల్ మేనేజ్​మెంట్, సాఫ్ట్​వేర్ స్కిల్స్ డెవలప్మెంట్​ ప్రోగ్రామ్స్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు ఐటీ టవర్ మొదటి అంతస్తులోని ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.  హోటల్ మేనేజ్మెంట్​ కోర్సుకు 18 నుంచి 28 ఏండ్లు ఉండాలన్నారు. ఇప్పటికే శిక్షణ పొందిన కొన్ని వేలమంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారని, ఈ  అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.