ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హోంగార్డ్స్ 60వ రైజింగ్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డా.వినీత్ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోమ్ గార్డ్స్  అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భారీ వరదల నేపథ్యంలో విధులు నిర్వర్తించి ప్రజలకు భరోసా కల్పించారని కొనియాడారు. అనంతరం హోంగార్డ్స్  తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. విధుల్లో ప్రతిభ చూపిన 54 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, పరేడ్ కమాండర్ శేషు శ్రీనివాస్, డీఎస్పీ వెంకటేశ్వర బాబు, ఎస్బీ ఇన్స్​పెక్టర్ స్వామి, హోమ్ గార్డ్స్  ఆర్ఐ సుధాకర్, వెల్ఫేర్  ఆర్ఐ కామరాజు, ఆర్ఐ ట్రైనింగ్స్  నాగేశ్వరరావు, ఆర్ఐ ఆపరేషన్స్  ప్రసాద్ పాల్గొన్నారు.

దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి

మధిర, వెలుగు: దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. మంగళవారం చింతకాని మండలం రామకృష్ణాపురం, అనంతసాగర్  గ్రామాల్లో పర్యటించి గ్రౌండింగ్ అయిన దళితబంధు యూనిట్ల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ మంజూరైన డబ్బులన్నీ ఖర్చు చేయకుండా ఆదాయంతోనే యూనిట్ల నిర్వహణ చేపట్టాలన్నారు. మరికొందరికి ఉపాధి కల్పించేలా ఎదగాలన్నారు. లబ్ధిదారులతో యూనిట్ల నిర్వహణ, లాభాలు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు కలెక్టర్  అంబేద్కర్​ విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సీ కార్పొరేషన్  ఈడీ శ్రీనివాసరావు, డీటీవో టి. కిషన్ రావు, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్​ జ్యోతి, డీసీవో విజయ కుమారి పాల్గొన్నారు.

నైపుణ్యాన్ని పెంచుకోవాలి

ఖమ్మం టౌన్: నైపుణ్యాన్ని పెంచుకొనేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్  వీపీ గౌతమ్  తెలిపారు. ప్రజ్ఞ సమావేశ మందిరంలో ఆటో క్యాడ్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉరిమల్ల నాగరాజు, కందుల సంపత్, శీలం ఇందులకు మిత్ర, సామినేని ఫౌండేషన్  సహకారంతో కలెక్టర్ ల్యాప్ టాప్ లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న స్టూడెంట్స్​ తమ నైపుణ్యతను పెంచుకుంటూ పోటీ ప్రపంచంలో రాణించాలని సూచించారు. ఎంప్లాయిమెంట్​ ఆఫీసర్​ శ్రీరాం, ఐటీఐ ప్రిన్సిపాల్ ఎ శ్రీనివాసరావు, సుడా టీపీవో ఇటికాల భాస్కర్, జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అఫ్జల్ హుస్సేన్, మిత్ర, సామినేని ఫౌండేషన్  ప్రతినిధులు కె. ప్రవీణ్, సామినేని రవి పాల్గొన్నారు.

ఆర్ఎస్పీపై ఆరోపణలు అవాస్తవం

ఖమ్మం టౌన్, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్ పై మహిళా నాయకురాలు విజయకుమారి చేసిన ఆరోపణలు అవాస్తమని పార్టీ జోనల్  మహిళా కన్వీనర్  కొల్లూరి రజిత, జిల్లా కన్వీనర్ బానోత్ రజిని తెలిపారు. మంగళవారం మీడియాతో వారు మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలతో బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆమె ఖమ్మం వచ్చిన ప్రవీణ్ కుమార్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం సరైంది కాదన్నారు. ఉప్పల మంజుల, ఎర్రమళ్ల నాగమణి, కమటం శోభ పాల్గొన్నారు.

భద్రాద్రిలో అంజన్నకు అభిషేకం

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం పంచామృతాలతో అభిషేకం జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సీతారాముల మూలవరులకు సుప్రభాత సేవ నిర్వహించి బాలబోగం నివేదించారు. అనంతరం సమస్త నదీజలాలు, పంచామృతాలతో ఆంజనేయస్వామికి తిరుమంజనం జరిగింది. తమలపాకులు, నిమ్మకాయల, అప్పాల మాలలను నివేదించి హనుమాన్​చాలీసా పారాయణం చేశారు. సీతారాముల కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

ఇస్కాన్​ క్యాలెండర్​ ఆవిష్కరణ

ఇస్కాన్​ సంస్థ రూపొందించిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం–2023 క్యాలెండర్​ను ఈవో శివాజీ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏటా ఇస్కాన్​ సంస్థ సీతారాముల చిత్రాలతో క్యాలెండర్లను ముద్రిస్తోంది. కార్యక్రమంలో ప్రధానార్చకులు, ఆఫీస్​ స్టాఫ్​ పాల్గొన్నారు.

‘కేసీఆర్​ సర్కార్​ అన్యాయం చేస్తోంది’

శ్రీసీతారామచంద్రస్వామికి కేసీఆర్​ సర్కారు తీరని అన్యాయం చేస్తోందని శ్రీకాకుళం జిల్లా ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆరోపించారు. మంగళవారం రామయ్యను ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేదాశీర్వచనం ఇచ్చి స్వామి వారి శేషమాలికలు, ప్రసాదాలు, జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సుదర్శన రెసిడెన్సీలో మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పిన కేసీఆర్​ ఇప్పటి వరకు రూ.8 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. యాదాద్రి తప్ప భద్రాద్రిని పట్టించుకోని కేసీఆర్​తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏపీలోని రాములోరికి చెందిన 1000 ఎకరాల భూమిని కాపాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, మాజీ డీసీఎంఎస్​ చైర్మన్​ కురిచేటి శ్రీరామచంద్రమూర్తి, బీజేపీ మండల అధ్యక్షుడు ములిశెట్టి రామ్మోహన్​రావు, నిడదవోలు నాగబాబు, పీసీ కేశవ్, కోటేశ్వరి ఉన్నారు.

పోలీస్​ ఈవెంట్స్‭​కు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం టౌన్, వెలుగు: పోలీస్​ రిక్రూట్​మెంట్​లో భాగంగా నిర్వహించనున్న ఈవెంట్స్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ విష్ణు ఎస్  వారియర్ తెలిపారు. ఈ నెల 8 నుంచి ఈవెంట్స్​ నిర్వహించనుండగా, మంగళవారం పరేడ్ గ్రౌండ్​లో ట్రయల్​ రన్ నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి 24,733 మంది అభ్యర్థులు హాజరవుతారని, వీరిలో పురుషులు 20,033 మంది, మహిళలు 4,700 మంది ఉన్నారని చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈవెంట్స్​ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్  డీసీపీలు సుభాష్ చంద్రబోస్, కుమారస్వామి, ప్రసన్న కుమార్, సీసీఎస్ ఏసీపీ రవి, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సీఐలు చిట్టిబాబు, అశోక్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, యూనిట్ డాక్టర్ జితేందర్ పాల్గొన్నారు.

పోలీసుల తీరుపై బీజేపీ ఆగ్రహం

మణుగూరు, వెలుగు: పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంపన సీతారామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రధాని మోడీ దిష్టిబొమ్మకు కాషాయ వస్త్రాలు తొడిగి దహనం చేస్తుంటే సహకరించిన పోలీసులు, బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని హెచ్చరించారు. బీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు మెరుగు రవీందర్, మండల ప్రెసిడెంట్  కుంజా రామకృష్ణ, మీసాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

జర్నలిస్టులను ఆదుకోవాలి

ఖమ్మం టౌన్, వెలుగు: జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం మంగళవారం ధర్నా చౌక్‌లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తి పరమైన భద్రత లేదన్నారు. 90 శాతానికి పైగా జర్నలిస్టులు పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. వచ్చే నెలలో జర్నలిస్టుల సమస్యలపై ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు టీడబ్ల్యూజేఎఫ్‌, టీయూడబ్ల్యూజే(ఐజేయూ), టీజేఎఫ్‌, టీవీజేఏ, టీజేఏ, విద్యావంతుల వేదిక మద్ధతు ప్రకటించాయి. 

కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించండి

కొత్తగూడెం, వెలుగు: గ్రామల్లో ఇంటింటి సర్వే ద్వారా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని డీఎంహెచ్​వో డాక్టర్ దయానంద స్వామి ఆదేశించారు. మంగళవారం  విద్యానగర్–2 హెల్త్ సబ్ సెంటర్​లో ఇంటింటి సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ వో మాట్లాడుతూ కుష్టు వ్యాధిగా అనుమానం వస్తే వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తామని తెలిపారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం వస్తుందని చెప్పారు. వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. కుష్టు వ్యాధి నిర్మూలన జిల్లా ఆఫీసర్ డాక్టర్ శిరీష, మెడికల్ ఆఫీసర్లు  రాకేశ్, మోహన్, డీపీఎంవో పున్నమయ్య, హెచ్ఈవో భాగ్య పాల్గొన్నారు.