ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఖమ్మంలో బీజేపీ శ్రేణులు గురువారం సంబురాలు చేశారు. పార్టీ ఆఫీసు ఎదుట పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ మోడీ పాలనపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. దేశాన్ని ప్రపంచంలో ఆగ్రగామిగా నిలిపేందుకు మోడీ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు రుద్రప్రదీప్, నున్నా రవికుమార్, శ్యాంరాథోడ్, మందా సరస్వతి, కుమిలి శ్రీనివాస్, కిరణ్ పాల్గొన్నారు.
సత్తుపల్లి, వెలుగు: గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై సత్తుపల్లిలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. స్థానిక బోసు బొమ్మ రింగు సెంటర్ వద్ద బీజేపీ శ్రేణులు పటాకులు పేల్చి, మిఠాయిలు పంచారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఉడతనేని అప్పారావు మాట్లాడుతు గుజరాత్ లో మాదిరిగానే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, మండల, పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, నాగస్వామి, కార్తీక్, వసంతరావు, ప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామాలయం స్టాఫ్‌కు భోగ్ స్కీంపై ట్రైనింగ్
భద్రాచలం, వెలుగు: భక్తులకు పరిశుభ్రమైన ప్రసాదాలు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన భోగ్ స్కీంపై రామాలయం స్టాఫ్‌కు గురువారం ట్రైనింగ్ ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు డా.ఆంజనేయులు, డా.చేతన్ఎంపికైన 24 మంది టెంపుల్ఎంప్లాయిస్కు ట్రైనింగ్ ఇచ్చారు. భక్తులకు విక్రయించే ప్రసాదాలు, ఉచిత నిత్యాన్నదానం పరిశుభ్రంగా ఉంచేందుకు అనుసరించాల్సిన జాగ్రత్తలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఫుడ్ సేఫ్టీ అండ్స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఫెసాయ్) రిజిస్ట్రేషన్, ఫ్రీ ఆడిట్, పోస్టాక్ ట్రైనింగ్, ఫైనల్ ఆడిట్, ఈట్‌రైట్ భోగ్ సర్టిఫికేట్‌ను ఈవో శివాజీకి అందించారు. రెండేళ్లపాటు ఈ సర్టిఫికేట్పనిచేస్తుంది. దేవస్థానం విక్రయించే ప్రసాదాల కవర్లపై ఫెసాయ్ జారీ చేసిన లైసెన్స్ నంబర్ముద్రించనున్నారు.
చెత్తను వేరు చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్టే..: ఎమ్మెల్యే హరిప్రియ
ఇల్లందు, వెలుగు: తడి, పొడి చెత్తను వేరు చేస్తే పర్యావరణాన్ని కాపాడినట్టేనని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్2023లో భాగంగా గురువారం ఇల్లందు మార్కెట్‌యార్డులో తడి, పొడి చెత్త వేరుచేయడం, తడి చెత్త నుంచి హోమ్ కంపోస్ట్ తయారీ చేసే విధానాలపై పట్టణంలోని మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు దేశ స్థాయిలో అవార్డు అందుకునేలా శ్రమించాలన్నారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పాలకవర్గం శ్రమిస్తోందని, ప్రతి ఒక్కరూ మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, అంగన్ వాడీలు, డ్వాక్రా మహిళలు
పాల్గొన్నారు.
తప్పిపోయిన సర్పంచ్ భర్త మృతి
పెనుబల్లి, వెలుగు: శిరిడీ యాత్ర కు వెళ్లి తప్పిపోయిన వీఎం బంజర్ సర్పంచ్ భూక్యా పంతులి భర్త చందా నాయక్(70) చనిపోయారు. సర్పంచ్ దంపతులు ఈ నెల 5న సుమారు 300 మందితో కలిసి ఖమ్మం నుంచి శిరిడీకి వెళ్లారు. ట్రైన్ నాగర్సోల్ చేరుకునేసరికి చందా నాయక్ తప్పిపోయినట్లు గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం నుంచి నాగర్సోల్ వరకు ఉన్న రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గురువారం ఉదయం లాతూర్ రైల్వే పోలీసులు చందానాయక్ డెడ్‌బాడీని గుర్తించారు. అక్కడి రైల్వే హాస్పిటల్లో మార్చురీలో భద్రపరిచినట్లు సమాచారమిచ్చారు. చందానాయక్ కదులుతున్న ట్రైన్ ఎక్కుతూ జారిపడి చనిపోయి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
రైలు కింద పడి ఆత్మహత్య
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. వైరా మున్సిపాలిటీ బీసీ కాలనీకి చెందిన గరిడేపల్లి రామకృష్ణ(53) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. గురువారం ఖమ్మం పరిధిలోని రైల్వే ట్రాక్‌పై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై నుంచి వెళ్లింది. అతడి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం జిల్లా హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ట్రైన్ నుండి పడి గుర్తుతెలియని వ్యక్తి...
ఎర్రుపాలెం, వెలుగు: ఎర్రుపాలెం మండలపరిధిలో డౌన్ లైన్ లో వెళుతున్న రైలు నుంచి జారిపడి ఒకరు చనిపోయినట్లు జీఆర్పీ ఎస్సై భాస్కర్ రావు తెలిపారు. చనిపోయిన వ్యక్తి సుమారు 40 ఏండ్లు ఉండాడని, వంగ పువ్వు రంగులో ఉన్న గళ్లా చొక్కా ధరించి ఉన్నాడన్నారు. అతడి డెడ్‌బాడీని మధిర సివిల్ హాస్పిటల్‌కు తరలించి మార్చురీలో ఉంచినట్లు ఎస్సై
తెలిపారు.
బీజేపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయ్ రాఘవన్
ఖమ్మం టౌన్, వెలుగు: బీజేపీ పాలనలో ఆర్థిక, లౌకిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయ్ రాఘవన్ పేర్కొన్నారు. ఖమ్మం సుందరయ్య భవనంలో గురువారం ఏర్పాటు విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి విజయ్ రాఘవన్ మాట్లాడారు. బీజేపీ పాలనలో దేశంలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. కొవిడ్ తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. పెట్టుబడిదారులు ఎదుగుతుంటే పేదలు జీవనస్థితి మరింత దిగజారుతోందన్నారు.
పరస్పర ఘర్షణలతో ప్రజాసమస్యలు పక్కదారి: తమ్మినేని
బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య ఘర్షణ కారణంగా రాష్ట్రంలోని ప్రజాసమస్యలు పక్కదారి పడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తప్పుచేసిన వారిని శిక్షించడాన్ని సీపీఎం ఎక్కడా తప్పుపట్టదని, విచారణ జరగకుండానే దోష ఆరోపణలు చేస్తూ తిట్టిపోసుకోవడమే బీజేపీ, టీఆర్‌ఎస్‌ల పనిగా ఉందన్నారు. కేంద్ర నిఘా సంస్థలను ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పడం చూస్తే బీజేపీ తెలంగాణలో ఎలాగైనా పాగా వేసేందుకు ప్లాన్లు చేస్తోందనిపిస్తోందన్నారు. షర్మిల తీరు చూస్తే ఆమె బీజేపీ వదిలిన బాణమే అని అనిపిస్తోందన్నారు. సమావేశంలో సీపీఎం జాతీయ నాయకులు ఎన్. చంద్రన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.వెంకట్, పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు
ఖమ్మం టౌన్, వెలుగు: రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం శ్రీనివాస నగర్ లోని అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎంపీ హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన రవిచంద్రకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి, వేద ఆశీర్వచనం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తొలిమెట్టుపై కలెక్టర్ రివ్యూ
భద్రాచలం, వెలుగు: ‘మన ఊరు-–మన బడి’, ‘తొలిమెట్టు’ కార్యక్రమాలపై కలెక్టర్ అనుదీప్ గురువారం ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా12 అంశాలతో స్కూళ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఆఫీసర్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతీ మండలం, మున్సిపాలిటీల్లో రెండు స్కూళ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. 61 మోడల్ స్కూళ్లలో సౌకర్యాల కల్పనపై డీఈవో లిస్టు తయారు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 368 స్కూళ్లలో 61 స్కూళ్లను ప్రస్తుతం ప్రారంభిస్తామని, మిగిలిన వాటిని మార్చి నెలాఖారుకల్లా పూర్తి చేస్తామని వివరించారు. రివ్యూలో డీఈవో సోమశేఖర్ శర్మ, పీఆర్ ఈఈ సుధాకర్, ఇరిగేషన్ ఈఈ సురేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల ర్యాలీ
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు:హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఖమ్మం నగరలంఓని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నార్వహించి ఘనంగా సంబురాలు చేశారు. ర్యాలీ నిర్వహించి పటాకులు కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ఖమ్మం నగర అధ్యక్షుడు మహ్మద్ జావీద్, కార్పొరేటర్ వెంకటేశ్వర్లు, చోటేబాబా, కరుణాకర్‌రెడ్డి, రమేష్, వెంకటరమణ, అబ్బాస్, వెంకన్న పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: లిక్కర్ మాఫియాతో ప్రమేయమున్న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ గిరిజన మోర్చా నాయకులు కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించారు. మోర్చా నాయకులు శ్యాంసుందర్‌నాయక్, రవి రాథోడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వన్‌టౌన్ స్టేషన్‌కు చేరుకొని పోలీసులతో మాట్లాడి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేయించారు.
పోలీస్ ఫిజికల్ టెస్ట్‌లు ప్రారంభం
మొదటి రోజు 494 మంది హాజరు
అర్హత సాధించిన 199మంది అభ్యర్ధులు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల ఎంపికకు చేపట్టిన రిక్రూట్మెంట్లో భాగంగా గురువారం ఫిజికల్ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. ఖమ్మం పోలీస్కమిషనర్విష్ణు ఎస్.వారియర్ ఫిజికల్టెస్ట్లను పరిశీలించారు. 600 మందికి అభ్యర్థులకు 494 మంది హాజరుకాగా, అందులో 199మంది అర్హత సాధించారని సీపీ తెలిపారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసి బయోమెట్రిక్ తీసుకున్నారు. తర్వాత రిస్ట్‌బాండ్ ట్యాగింగ్, ఆర్ఎఫ్ఐడీ చిప్ జాకెట్ అభ్యర్థులు ధరించి ఈవెంట్స్ లో పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఆఫీస్ ఓపెన్
ఖమ్మం టౌన్, కూసుమంచి, వెలుగు: రఘునాథపాలెం మండలం జింకలతండా క్రాస్ రోడ్డు వద్ద కొత్తగా నిర్మించిన సబ్ డివిజన్ ఆఫీస్ ను గురువారం ఎన్పీడీసీఎల్వరంగల్డైరెక్టర్వెంకటేశ్వరరావు ఎస్ఈ ఎ.సురేందర్ తో కలిసి ప్రారంభించారు. ఆఫీసులో డైరెక్టర్ వెంకటేశ్వరరావు కలియదిరిగి శాఖ కు చెందిన స్థల హద్దులను పరిశీలించారు. అనంతరం ఏడీ సంజీవ్ రావు, ఏఈ ఇందిర.. డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్ఈ సురేందర్ ను సన్మానించారు. రఘునాథపాలెం సెక్షన్ ఆఫీస్ తోపాటు ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల వద్ద నిర్మించిన సెక్షన్ ఆఫీస్, పాలేరులోని మరో సెక్షన్ ఆఫీస్ ను డైరెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు.కార్యక్రమంలో ఖమ్మం డీఈ(ఆపరేషన్) రామారావు, టెక్నికల్డీఈ రాము, ఏఈ భాస్కర్ పాల్గొన్నారు.
సబ్ డివిజన్ ఆఫీస్ లో మీటర్ లేకుండా కనెక్షన్
విద్యుత్ శాఖ మనదే మనల్ని అడిగేది ఎవరు అనుకున్నారో ఏమో గానీ.. రఘునాథపాలెంలో కొత్తగా నిర్మించిన సబ్ డివిజన్ ఆఫీసుకు పక్కనే ఉన్న సబ్ స్టేషన్ నుంచి డైరెక్ట్ గా కనెక్షన్ ఇచ్చేశారు. మీటర్ రీడింగ్ మిషన్ లేకుండా ఫ్యూజ్ బాక్స్ ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యులు విద్యుత్ చౌర్యానికి పాల్పడితే అదనపు ఫైన్లు వేసి, కేసులు పెట్టి వేధించే అధికారులే విద్యుత్ చౌర్యానికి పాల్పడటం కొసమెరుపు.
ఉత్సాహంగా ఎన్ఎస్ఎస్ ఫెస్టివ్
ఖమ్మం టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లా స్థాయి ఎన్ఎస్ఎస్ ఫెస్టివ్ఉత్సాహంగా ప్రారంభమైంది. ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్ లో గురువారం నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌లో ఉమ్మడి జిల్లాలోని 50 జూనియర్, డిగ్రీ కాలేజీలకు చెందిన 654 మంది ఎన్ ఎస్ఎస్ స్టూడెంట్స్ 11 అంశాలలో జరిగిన పోటీల్లో పాల్గొన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఇ.నారాయణ ఫెస్ట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎన్.శ్రీనివాసరావు,ఉమ్మడి జిల్లా ఎన్ఎస్ఎస్ అధికారి ఆనంద్ బాబు,శ్రీలత,ప్రొఫెసర్ కృష్ణమూర్తి,కోట అప్పిరెడ్డి,ప్రిన్సిపల్ డాక్టర్ కెవి.రమణారావు లు పాల్గొన్నారు.
ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలి: కలెక్టర్ గౌతమ్
ఖమ్మం టౌన్, వెలుగు: ఆధార్ ను అప్డేట్చేసుకోవాలని ఖమ్మం కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్ల లోపు ఆధార్ నమోదు, అప్డేట్వంద శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. 5 నుంచి 15 ఏండ్లు ఉన్న పిల్లలకు ఆధార్ కేంద్రాలలో అప్డేట్చేయాలని, ఎలాంటి చార్జీలు ఉండవని కలెక్టర్ఆయన తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, యుఐడీఏఐ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.శ్రీనివాసరెడ్డి, డీఎంహెచ్‌వో బి. మాలతి, జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, పోస్టల్ సూపరింటెండెంట్ బి.రవికుమార్, ఏసీపీ ప్రసన్నకుమార్, ఆర్ఎంవో రాజశేఖర్, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి
అన్నపురెడ్డిపల్లి,వెలుగు: ఆడుకునేందుకు ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చిన చిన్నారి(4)ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయాడు. బాధితకుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామానికి చెందిన మాందాసు గోపి, జ్యోతి దంపతుల కుమారుడు శశి ప్రణవ్(4) గురువారం ఇంట్లో నుంచి రోడ్డుపైకి వచ్చాడు. ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్బాలుడిని ఢీకొట్టింది. తలపై నుంచి చిన్నారి స్పాట్లోనే చనిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై విజయ పరిశీలించి కేసు నమోదు చేశారు.
మెడికల్ సీటు సాధించిన స్టూడెంట్ కు ఆర్థిక సాయం
ముదిగొండ, వెలుగు: మెడికల్ సీటు సాధించిన స్కూడెంట్‌కు మహా ఆదిసేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఆర్థికసాయం అందించారు. ముదిగొండ మండలం అమ్మపేట గ్రామానికి చెందిన ఊటుకూరు అశ్విత ఫ్రీ మెడికల్ సీటు సాధించింది. ఆమె యూనివర్సిటీ, హాస్టల్ఫీజు చెల్లించేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో మహా ఆదిసేవా సమితి ఆధ్వర్యంలో గురువారం రూ.27వేలు ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో చింతకాని ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ మంగిలాల్, మధు, అజయ్ కుమార్, బొడ్డు సంజీవరావు, బంక గురువయ్య
పాల్గొన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ఊరుకోం
ఎమ్మెల్సీ తాత మధుసూదన్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఏపీ, తెలంగాణ రాష్ర్టాలను తిరిగి కలపాలంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్‌కుమార్, సజ్జల రామకృష్ణారెడ్డిలకు తెలంగాణ బలిదానాల ఉసురు తగులుతుందనిటీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్ అన్నారు. గురువారం టీఆర్ఎస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవంతో చెలగాటమాడితే ఊరుకోమని హెచ్చరించారు. విడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం కలిసి పోరాడేందుకు సిద్ధమన్నారు. భద్రాద్రి రాముడికి రూ.1000 కోట్లు కేటాయించేలా కేంద్రప్రభుత్వాన్ని ఒప్పించే దమ్ము బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర్లు, ఖమర్, గుండ్లపల్లి శేషగిరిరావు పాల్గొన్నారు.