ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

  • అడ్డగోలుగా నియామకాలు... అందులోనూ అక్రమాలే
  • కొత్తగూడెం మాతా, శిశు కేంద్రంలో కాంట్రాక్టర్, లీడర్ల తీరుపై ఆరోపణలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:భద్రాద్రికొత్తగూడెం రామవరంలోని ప్రభుత్వ మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​లో చేపట్టిన నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులతో కుమ్ముక్కైన కాంట్రాక్టర్​ ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టి నియామకాలు చేపట్టినట్లు చెబుతున్నారు.  స్వీపర్లు, స్కావెంజర్లు, సెక్యూరిటీ గార్డులు, పేషంట్​ కేర్​ కింద 35 మంది అవసరం ఉండగా, 60 నుంచి 70 మందిని నియమించుకున్నాడు. ఎలాంటి ఆర్డర్​ లేకుండానే నియామకాలు చేపట్టినా అధికారులు పట్టించుకోలేదు. మరోవైపు జీతం రూ.12 వేలు చెల్లించాల్సి ఉండగా, రూ. 5వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 

అడ్డగోలుగా నియామకాలు :

కొత్తగూడెం పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ మాతా, శిశు సంరక్షణ హాస్పిటల్​ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. కాంట్రాక్ట్​ పద్దతిపై స్వీపర్​, స్కావెంజర్స్​, సెక్యూరిటీ గార్డులు, పేషంట్​ కేర్​ల నియామకాలకు ఉత్వర్వులు వచ్చాయి. 100 పడకల హాస్పిటల్​కు నిబంధనల ప్రకారం 35 మంది అవసరం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో కలెక్టర్​ ఆదేశాల మేరకు ఇద్దరు, ముగ్గురిని పెంచుకునే అవకాశం ఉంది. కానీ కాంట్రాక్టర్​ రెట్టింపు సంఖ్యలో నియామకాలు చేపట్టాడు. ఒక్కో నియామకానికి రూ. 5వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్​కు ఈ విషయమై ఫిర్యాదులు వచ్చాయి. డబ్బులు తీసుకొని జాబ్స్  ఇస్తున్నారంటూ వైద్య శాఖ అధికారులపై జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలల జీతం ఇవ్వాల్సి ఉండగా, 3 నెలల జీతం మాత్రమే ఇచ్చారని సిబ్బంది వాపోతున్నారు. రూ. 5వేలు మాత్రమే జీతం ఇవ్వడంపై రగడ మొదలవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదిలాఉంటే ప్రజాప్రతినిధుల రికమెండేషన్లతో 35మందికి గాను 70  మందికి పైగా నియమించి అరకొర వేతనాలు ఇవ్వడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే ప్రచారం జరుగుతోంది.

కొత్త కాంట్రాక్టర్​ రాకతో..

35 మంది ఉద్యోగులు అవసరం ఉండగా 70 మందికి పైగా పని చేస్తుండడంతో కొత్తగా కాంట్రాక్ట్​ పొందిన కాంట్రాక్టర్​కు తలనొప్పిగా మారింది. ఎవరిని తొలగిస్తే ఎలాంటి ఇబ్బంది వస్తుందోనని ఆయన అంటున్నాడు. ఎక్కువగా ఉన్న వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అనధికారికంగా తీసుకునేలా కొందరు అధికారులు, కాంట్రాక్టర్​ ప్లాన్​ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

కనీస వేతనం ఇవ్వాలి..

నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టిన కాంట్రాక్టర్​పై చర్య తీసుకోవాలి. నియామకాల కోసం వసూలు చేసిన డబ్బులను కాంట్రాక్టర్​ నుంచి రికవరీ చేయాలి. కార్మికుల పొట్టకొట్టిన కాంట్రాక్టర్​పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి.

-కంచర్ల జమలయ్య, ఏఐటీయూసీ నేత, కొత్తగూడెం

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి..

కాంట్రాక్ట్​ పద్ధతిపై చేపడుతున్న నియామకాలు నిబంధనల ప్రకారం జరగాలి. నిబంధనలు పాటించకుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. గతంలో జరిగిన నియామకాలపై పరిశీలన చేస్తాం. 
-కుమారస్వామి, హాస్పిటల్​ సూపరింటెండెంట్

  • రామయ్య భూములను కాపాడాలి
  • ఆదివాసీల భారీ ర్యాలీ.. 
  • ఈవో ఆఫీసు ఎదుట ధర్నా

భద్రాచలం,వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంక్షేమ పరిషత్​ ఆధ్వర్యంలో ఆదివారం ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవస్థానం ఈవో ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఏపీలో విలీనమైన ఎటపాక మండలం పురుషోత్తపట్నం, దమ్మక్కగూడెంలోని 900 ఎకరాల భూములను కబ్జాకోరుల నుంచి కాపాడాలని కోరారు. జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ చేపట్టి ఏజెన్సీలోని దేవస్థానం భూములను ఆదివాసీలకు అప్పగించాలని, కబ్జాకోరుల నుంచి కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సున్నం వెంకటరమణ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా వలస గిరిజనేతరులు, దేవస్థానంలోని అవినీతి అధికారుల అండదండలతో పరిహారం, కౌలు చెల్లించకుండా ఆక్రమించుకుని అనుభవించడమే కాకుండా అక్రమ కట్టడాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఏపీలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దేవస్థానం గోశాల అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. వలస గిరిజనేతరుల నుంచి దేవుడి భూములను స్వాధీనం చేసుకుని పోలవరం నిర్వాసితులకు, పునరావాసానికి, సాగుకు, మిగిలిన భూమిని స్థానిక గిరిజనులకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించాలని డిమాండ్​ చేశారు. ఆదివాసీల హక్కులకు, దేవస్థానానికి ఆదాయం వచ్చేలా నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందించక పోతే భూములను స్వాధీనం చేసుకుంటామని అల్టిమేటం జారీ చేశారు. అనంతరం ఏఈవో భవానీ రామకృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉయిక శంకర్, మహబూబ్​బాద్​ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకాల సుధీర్, ఏపీలోని అల్లూరి జిల్లా బాధ్యులు కుంజా అనిల్, వీసాల సంజీవరావు, నెహ్రూ, ఉమ్మల దుర్గారెడ్డి, కూర నాగేశ్వరరావు పాల్గొన్నారు.

హెచ్ఎం బదిలీ రద్దు చేయాలని స్టూడెంట్స్​ ధర్నా

కామేపల్లి, వెలుగు: చదువుతో పాటు తమకు అన్ని విషయాలలో అండగా నిలిచిన స్కూల్​ హెచ్ఎం బదిలీని రద్దు చేయాలని కామేపల్లి ఎస్టీ గురుకుల ఆశ్రమ పాఠశాల స్టూడెంట్స్​ ఆందోళన చేపట్టారు. మండలంలోని రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాల నుంచి ఏడాది కింద హెచ్ఎంగా డిప్యూటేషన్ పై నాగేశ్వరావు వచ్చారు. అప్పటి నుంచి విద్యార్థినులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్ఎస్సీ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది వంద మంది అడ్మిషన్లు తీసుకున్నారు. శనివారం హెచ్ఎంను బదిలీ చేయడంతో స్టూడెంట్స్​ మీరెళ్లొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల స్కూల్​లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. వారికి హెచ్ఎం అండగా నిలిచారు‌. దీంతో హెచ్ఎంను కావాలనే బదిలీ చేయించారని పేరెంట్స్​ ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో డీడీ కృష్ణనాయక్ తో ఫోన్​లో మాట్లాడించారు. హెచ్ఎంను తిరిగి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.  

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం గర్భగుడిలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. తర్వాత సమస్త  నదీ జలాలు, పంచామృతాలతో తిరుమంజనం జరిగింది. అనంతరం స్వామికి అలంకరణ చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్యకల్యాణం నిర్వహించగా, 80 జంటలు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నాయి. వారి గోత్ర నామాలతో అర్చకులు స్వామి కల్యాణం జరిపించారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక జరిపాక స్వామికి మంత్రపుష్పం నివేదించారు. చిత్రకూట మండపంలో సత్యనారాయణస్వామి వ్రతాలు జరగ్గా 21 జంటలు ఇందులో పాల్గొన్నాయి. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.

దర్శించుకున్న కోలాపూర్​ స్వామీజీ..

కోలాపూర్​ సిద్దగిరి పీఠం సద్గురు శ్రీస్వామి చైతన్య ఆనంద మహరాజ్​ స్వామీజీ రామయ్యను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయాలతో అర్చకులు స్వాగతం పలికారు. ఆలయంలో పూజలు చేసిన ఆయనకు ఆశీర్వచనం ఇచ్చి స్వామి వారి శేషమాలికలు, వస్త్రాలు, ప్రసాదం అందజేశారు. 

హైకోర్టు జడ్జి పూజలు..

హైకోర్టు జడ్జి కాజా శరత్​ రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఈవో శివాజీ ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు. గర్భగుడిలో పూజలు చేసిన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషమాలికలు, వస్త్రాలు, ప్రసాదం, జ్ఞాపికలు అందజేశారు. హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి భద్రాచలం రావడంతో స్వగ్రామంలో ఆయనకు మిత్రులు బ్రహ్మరథం పట్టారు. మిత్రులతో పాటు ఎమ్మెల్యే పొదెం వీరయ్య తదితరులు ఆయనకు సన్మానం చేశారు. 

క్రీడా మైదానాలకు జాగ దొరుకుతలే

భద్రాచలం, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 లక్షలతో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వీటి ఏర్పాటుకు కేటాయిస్తున్న స్థలం వివాదాస్పదం కావడంతో పనులు ముందుకు వెళ్లడం లేదు. రెవెన్యూ ఆఫీసర్లు స్థలాలు చూపిస్తే అనుభవదారుల పేరిట పనులు అడ్డుకుంటున్నారు. ఇలాంటి వివాదాలు సర్పంచులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఏజెన్సీలో భూ వివాదాలు క్రీడామైదానాల ఏర్పాటుకు ఆటంకంగా మారుతున్నాయి. సకాలంలో భూములు చూపించలేక పోవడం, వివాదాలు చోటు చేసుకోవడంతో క్రీడామైదానాల పనులు ముందుకు కదలడం లేదు.

481 హ్యాబిటేషన్లకు 129 పూర్తి.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 481 హ్యాబిటేషన్లలో క్రీడామైదానాలు నిర్మించాలి. రూ.5 లక్షలు సర్కారు ఇస్తోంది. వీటితో భూమిని చదును చేయడం, మొక్కలు నాటడం, బోర్డు, గేటు ఏర్పాటు చేయాలి. 481 క్రీడామైదానాలకు కేవలం 129 మాత్రమే పూర్తయ్యాయి. 121 మైదానాలు ప్రోగ్రెస్​లో ఉన్నాయి. 435 మైదానాల నిర్మాణాలకు రెవిన్యూశాఖ స్థలాలు అప్పగించింది. 46 మైదానాలకు స్థలాలే దొరకలేదు. ఇచ్చిన స్థలాలకు అనుభవదారుల పేరిట కొందరు అడ్డుపడుతున్నారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల హ్యబిటేషన్​లోని సీతానగరంలో సర్వే నెంబరు 14లో తహసీల్దార్​ స్థలాన్ని జూన్​ 8న కేటాయించారు. సర్పంచ్​ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఆ భూమి తమదని అడ్డుపడ్డారు. సెప్టెంబరు 25న గ్రామ కార్యదర్శి దుమ్ముగూడెం పోలీస్​స్టేషన్​లో కంప్లైంట్​ కూడా చేశారు. మరో స్థలం కేటాయిస్తామని రెవెన్యూ ఆఫీసర్లు చెబితే పెట్టిన ఖర్చు ఎలాగంటూ సర్పంచ్​ ఆవేదన వ్యక్తం చేశారు. పినపాక మండలం దుగినేపల్లి, సీతంపేటలో కూడా ఇదే పరిస్థితి. స్థలం కేటాయింపు అడ్డంకిగా మారడంతో క్రీడామైదానాల ఏర్పాటు ముందుకెళ్లడం లేదని అంటున్నారు. 

త్వరలోనే పూర్తి చేస్తాం

క్రీడామైదానాలు త్వరలోనే పూర్తి చేస్తాం. భూ సమస్య ఉన్న మాట వాస్తవమే. రెవెన్యూ స్థలాల కొరత ఉంది. అవసరమైతే ఫారెస్ట్  ల్యాండ్  అయినా తీసుకొని హ్యాబిటేషన్లలో క్రీడామైదానాలు కడతాం. సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తాం.
-మధుసూధనరాజు, డీఆర్డీవో, భద్రాద్రికొత్తగూడెం

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి మౌన పోరాటం

జూలూరుపాడు, వెలుగు: ఏడేండ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మండలంలోని మచినేనిపేటతండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌనపోరాటం చేపట్టింది. అదే గ్రామానికి చెందిన బానోత్ భద్రం, లాకవత్ నందిని ఏడేండ్లుగా ప్రేమించుకోగా, ఇటీవల ముఖం చాటేయడంతో ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నందిని ఆందోళనకు దిశ కార్యకర్తలు మద్ధతు తెలిపారు. 15 రోజుల కింద పోలీసులకు ఫిర్యాదు చేయగా, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని తప్పించుకొని తిరుగుతున్నడని తెలిపింది. పెళ్లి చేసుకునేంత వరకు పోరాటం చేస్తానని తెలిపింది.

టీయూపీఎస్​ జిల్లా అధ్యక్షుడిగా రామ్మోహన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం(టీయూపీఎస్​) జిల్లా అధ్యక్షుడిగా గంజి రామ్మోహన్​ను ఎన్నుకున్నారు. చుంచుపల్లిలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​హాల్​లో ఆదివారం నిర్వహించిన జనరల్​ బాడీ మీటింగ్​లో కొత్త కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం స్టేట్​ ఆర్గనైజింగ్​ సెక్రటరీ, ఎన్నికల అధికారి ఆలె బాలకృష్ణ తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా అనంతుల లక్ష్మీనారాయణ, అసోసియేట్​ ప్రెసిడెంట్లుగా కాసర్ల శ్రీనివాస్, బుజ్జి కన్నయ్య, ఉపాధ్యక్షులుగా చిన్న నాగేశ్వరరావు, గంజి సతీశ్ కుమార్, దానం నరసింహారావు, కాటబత్తిని ఉమేశ్వరి, ట్రెజరర్​గా బేతి రమేశ్, జాయింట్​ సెక్రటరీలుగా పసునీటి వెంకటేశ్వర్లు, దాసి వీరభద్రయ్య, పీవీ సురేశ్, కొండి పద్మజ, ఆర్గనైజింగ్​ సెక్రెటరీలుగా వేముల మురళి, పసునూటి శ్రీనివాస్​, బేతి అనంతలక్ష్మి, పోరండ్ల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శిగా వెలదండి ప్రసాద్, సభ్యులుగా బత్తుల వెంకటేశ్వర్లు, ఎన్  రాకేశ్, సామర్ల వెంకటేశ్వర్లు, కుంట శంకరయ్య, పాశికంటి గాయత్రి, దాసరి సాయికుమార్, బింగి గోపాల్​ ఎన్నికయ్యారు.