- ఈర్లపూడి కన్నీటిసంద్రం
- వేలాదిగా తరలివచ్చిన అటవీశాఖ సిబ్బంది
- అంత్యక్రియలకు భారీగా హాజరైన జనం
- అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళి
ఖమ్మం, వెలుగు: గొత్తికోయల దాడిలో దారుణ హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు సొంతూరు రఘునాథపాలెం మండలం ఈర్లపూడి కన్నీటి సంద్రంగా మారింది. అంత్యక్రియలకు జనంతో పాటు అటవీశాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది భారీగా హాజరయ్యారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆఫీసర్లతో పాటు టీఎన్జీవో సంఘం నేతలు, టీజీవో సంఘం లీడర్లు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు అటెండయ్యారు. అంత్యక్రియల సమయంలో డాడీ అంటూ శ్రీనివాసరావు కుమారుడు యశ్వంత్, కూతురు కృతిక ఏడవడం అక్కడున్న వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. కృతికను హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ దగ్గరకు తీసుకొని మంచినీళ్లు తాగించి ఓదార్చారు. రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీనివాసరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంత్యక్రియలకు హాజరైన అటవీ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది కంటతడి పెట్టారు.
సీతారాములకు పంచామృతాభిషేకం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి బుధవారం బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఆవుపాలు, శక్కర, తేనె, ఆవునెయ్యి, పెరుగుతో అభిషేకం చేశాక స్నపన తిరుమంజనం కన్నుల పండువగా నిర్వహించారు. ఆస్థాన విద్వాంసుల కచేరీతో స్వామికి సంగీతాభిషేకం జరిగింది. అనంతరం కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్రు
ఖమ్మం టౌన్, వెలుగు: దళితబంధు, డబుల్ బెడ్రూమ్ పథకాల్లో తెలంగాణ ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులకు దళిత, గిరిజన బంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో 20 శాతం కేటాయించాలని కోరారు . దళారుల జోక్యంతో అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుతోనే ఎఫ్ఆర్వో శ్రీనివాస్ హత్య జరిగిందని అన్నారు. ప్రభుత్వం ప్రజలు, అధికారుల మధ్య వైరం పెంచుతూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకులు పాలకుర్తి కృష్ణ , గుంతేటి వీరభద్రం, నగర కన్వీనర్ రయీస్ అన్వర్, షేక్ మస్తాన్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ నిరసన నిద్ర
ఖమ్మం టౌన్, వెలుగు: వెల్ఫేర్ హాస్టల్స్ లోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన నిద్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్స్‌లో సౌలతులు కల్పించడం లేదని విమర్శించారు. బెడ్ షీట్లు, దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు చలితో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ సుభాని, యువరాజు, ఉపాధ్యక్షులు సందీప్, సతీశ్, పవన్, సిద్ధు, శివరాం, సాయికుమార్, సురేందర్, నాగరాజ్, చందులాల్, శివ, అయ్యప్ప, సన్నీ పాల్గొన్నారు.
నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
ఖమ్మం టౌన్, వెలుగు: విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని టాస్క్ కో ఆర్డినేటర్ బోధిసత్వ సూచించారు. హిందుస్తాన్ కోకాకోలా బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సౌజన్యంతో టాస్క్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్జేసీ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌కు బుధవారం ‘క్యాంపస్ టు కార్పొరేట్’ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు భాషపై పట్టు పెంచుకోవాలని, స్కిల్స్ మెరుగు పర్చుకోవాలని సూచించారు. సమాజంలో జరిగే ఘటనలపై స్పందించే గుణం అలవర్చుకోవాలన్నారు. కాలేజీకి ప్రతీ రోజు వచ్చి లెక్చరర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ప్రిన్సిపాల్ ఎం శివకుమార్, టీపీవో సీహెచ్ కల్పన పాల్గొన్నారు.
పాపికొండల విహారయాత్రకు బ్రేక్
భద్రాచలం, వెలుగు: పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఈదురుగాలులతో పాటు వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నదిలో పడవ ప్రయాణాలను నిషేధించారు. దీంతో పాపికొండల విహారయాత్రకు సంబంధించిన లాంచీలను నడపొద్దని అల్లూరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు లాంచీలను నిలిపి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో భద్రాచలం నుంచి పాపికొండలకు వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు వెనుదిరిగారు.
‘ఎఫ్ఆర్వోది ప్రభుత్వ హత్యే’
ములకలపల్లి, వెలుగు: ప్రభుత్వ విధానాలతోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడని అశ్వారావుపేట యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరంపల్లి చెన్నారావు విమర్శించారు. ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరిస్తామని హామీలిస్తూ అమలు చేయకపోవడంతోనే ఈ హత్య జరిగిందన్నారు. అటవీ అధికారులు, ప్రజల మధ్య ప్రభుత్వం ద్వేషాన్ని పెంచుతోందని ఆరోపించారు. ఎఫ్ఆర్వోకుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రభుత్వ తీరుతో యుద్ధ వాతావారణం
భద్రాద్రికొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల విషయంలో అనుసరిస్తున్న విధానాలతోనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆదివాసీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని ఆదివాసీ ఐకాస కన్వీనర్ వాసం రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య బాధాకరమని అన్నారు. పోడు వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోందని తెలిపారు. పోడు ఘర్షణలో ఎవరో ఒకరు నష్టపోతుంటే ప్రభుత్వం తమషా చూస్తోందని విమర్శించారు. ఇలాంటి ఘటనలు చూపిస్తూ ఆదివాసీలకు పోడు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నే అవకాశం ఉందని చెప్పారు. ప్రభుత్వం పోడు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఘటనా స్థలంలో పోలీసుల విచారణ
చండ్రుగొండ: రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. బుధవారం ఎర్రబోడులో హత్య జరిగిన ప్లాంటేషన్ పరిసరాలను జూలూరుపాడు సీఐ వసంత కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, హత్యలో ఎంత మంది పాల్గొన్నారు, హత్యకు గల కారణాల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
గరికపాటిపై చర్యలు తీసుకోవాలి
ఖమ్మం టౌన్, వెలుగు: మహిళలను కించపరిచేలా మాట్లాడిన గరికపాటి నరసింహారావుపై చర్యలు తీసుకోవాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ శిరోమణి డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు గోకినపల్లి లలిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి శిరోమణి రాష్ట్ర కమిటీలోకి వెళ్లడంతో సహాయ కార్యదర్శి టి ఝాన్సీని జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శిగా డి శిరీష, జిల్లా కోశాధికారిగా పూలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షురాలు ఆవుల మంగతారాయ్, పరిమళ, చైతన్య, లీల, వసుమతి, లలిత, షాను పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
వైరా, వెలుగు: మండలంలోని గరికపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమై నిరాశ్రుయులైన కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీపీసీసీ సభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్ పరామర్శించారు. తహసీల్దార్ అరుణకు ఫోన్ చేసి ప్రభుత్వం తరపున అందించే సాయం మంజూరు చేయాలని కోరారు. దళితబంధుతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని అన్నారు. అనంతరం రాందాస్‌నాయక్ రూ.10 వేలను అందించారు. పార్టీ మండల అధ్యక్షుడు శీలం వెంకటనర్సిరెడ్డి, రాంపుడి రోశయ్య, యడ్లపల్లి వీరయ్య, పమ్మి అశోక్, పువ్వాళ్ల రాము, పాలేటి నరసింహారావు, ఆది ఆనందరావు, మోదుగు మురళి పాల్గొన్నారు.
యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
వైరా, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పీడీఎస్ యూ ఖమ్మం జిల్లా 22వ మహాసభ సందర్భంగా కొత్త బస్టాండ్ సెంటర్ నుంచి వాసవి కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల సందర్భంగా విద్యారంగాన్ని డెవలప్ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్ ఆజాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, ట్రెజరర్ కిరణ్, నాయకులు దీపిక, శశి, సతీశ్, లక్ష్మణ్, శివ, వాసు, ఉమేశ్, జగదీశ్, గోపి, సతీశ్, రమ్య, అనూష పాల్గొన్నారు.