ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

  • కరకట్ట కట్టేదెవరు?
  • మొదట్లో తామే కడతామన్న రాష్ట్ర సర్కార్​
  • ఇప్పుడు కేంద్రానిదే బాధ్యత అంటూ దాటవేత
  • కేంద్ర జలమండలి సమావేశంలో తేలనున్న వ్యవహారం

భద్రాచలం, వెలుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్టల నిర్మాణం ఇంకా కొలిక్కి రాలేదు. వరదలు వచ్చిన వెంటనే జులై 17న సీఎం కేసీఆర్ భద్రాచలం వచ్చి వరద సాయం కింద రూ.1000 కోట్లు ప్రకటించారు. ఈ నిధులతో కరకట్టలు నిర్మించుకోవడంతో పాటు, ముంపు బాధితులకు వేరే ప్రాంతంలో ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రకటించారు. ఆ తరువాత వరద ముంపుపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. పోలవరం బ్యాక్​ వాటర్​తో పాటు వరద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు నివేదిక కోరింది. గోదావరికి ఇరువైపులా 124 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు ప్రతిపాదనలు తయారు చేసి అందించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత స్పీడ్ తగ్గింది. ప్రపోజల్స్​  పట్టుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. తొలుత స్టేట్​ గవర్నమెంటే​ కడతామని చెప్పినా తాజాగా గోదావరి బ్యాక్​ వాటర్​ వల్ల ముంపు ఎక్కువగా ఉన్నందున కేంద్రం నిధులు ఇవ్వాలని కోరుతోంది. కానీ పోలవరం బ్యాక్ వాటర్​ వల్ల భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని కేంద్ర జలమండలి అంటోంది. దీంతో కరకట్టలను ఎవరు నిర్మించాలన్న అంశం కొలిక్కి రావడం లేదు.  

భద్రాచలం చుట్టూ 7 కిలో మీటర్లు


1986,1991 గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని 7 కి.మీల మేర భద్రాచలం వద్ద కరకట్టలు నిర్మించారు. 36 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా 80 అడుగుల ఎత్తులో కరకట్ట నిర్మించారు. ఈ కరకట్ట5 అడుగుల మేర కుంగింది. కూనవరం రోడ్డులో కరకట్ట నిర్మాణం ఆగిపోయింది. దీంతో సుభాష్​నగర్, శాంతినగర్​ కాలనీలకు గోదావరి వరద పోటెత్తుతుందని గుర్తించారు. ఇప్పుడు మిగిలిన కొంత భాగాన్నే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న కరకట్టను మరో 15 అడుగుల మేర ఎత్తు, వెడల్పు పెంచి నిర్మించాలని అనుకున్నా నిధులు ఎవరు ఇవ్వాలనే దానిపై చర్చ మొదలైంది. 

తేలేది అప్పుడే..


100 అడుగుల ఎత్తుతో 124 కిలోమీటర్ల మేర కొత్త కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలు పట్టాలు ఎక్కాలంటే ఢిల్లీలో కేంద్ర జలమండలితో పోలవరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్ ముంపు ముప్పుపై చర్చలు ముగిస్తేనే కుదురుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1500కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముప్పు లేదని కేంద్రం అంటోంది. మరో వారం రోజుల్లో ఢిల్లీలో ఏపీ, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో కేంద్ర జలమండలి నిర్వహించే మీటింగ్​ తర్వాత ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ప్రతిపాదనలు ఇచ్చినం

గోదావరి కరకట్టలకు సంబంధించిన సర్వే నివేదికలు, ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఇచ్చినం. ఫైళ్లు తీసుకుని ఢిల్లీ వెళ్తున్నం. చర్చలు జరుగుతున్నాయి. పోలవరం బ్యాక్​ వాటర్​ కారణంగా భద్రాచలానికి ముప్పు ఉన్న నేపథ్యంలో కరకట్టల నిర్మాణం కోసం కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. 
- రాంప్రసాద్, ఇరిగేషన్​ ఈఈ

సర్వేను అడ్డుకున్న గిరిజనులు

అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం వెనక ఉన్న పోడు భూములను మంగళవారం ఫారెస్ట్ అధికారులు సర్వే చేస్తుండగా అదే గ్రామానికి చెందిన గిరిజనులు అడ్డుకున్నారు. గతంలో పోడు సాగును చేయవద్దని సీపీఎం నాయకులతో కలిసి ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో ప్లాంటేషన్లు వేశారు. చిలకలగండి ముత్యాలమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న భూమిని ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల సర్వే పేరుతో తమకు ఇవ్వకుండా వేరే వారికి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారులతో వాదనకు దిగారు. గిరిజనులు రెండు వర్గాలుగా చీలిపోయి వాదోపవాదాలకు దిగారు. దీనిని గమనించిన అధికారులు సర్వే మధ్యలో నిలిపేసి వెళ్లిపోయారు.

సర్వే చేసి భూములు ఇవ్వాలి

తాము పోడు భూములు సాగు చేయట్లేదని, రెవెన్యూ ఆఫీసర్ల ద్వారా సర్వే చేసి తమకు భూములు అప్పగించాలని మండలంలోని వేదాంతపురం గ్రామ గిరిజనులు నిరసన తెలిపారు. ఫారెస్ట్  బౌండరీ బయట ఉన్న 172 ఎకరాల రెవెన్యూ భూమిని 25 ఏండ్లుగా 72 మంది రైతులు సాగు చేస్తున్నామని చెప్పారు. ఫారెస్ట్ పట్టాలు ఇస్తామని సంబంధిత ఆఫీసర్లు తమ భూములను సర్వే చేయాల్సిన అవసరం లేదని, తమ సర్వే నెంబర్లు ఫారెస్ట్  పరిధిలోకి రావని తెలిపారు. అధికారులు సర్వే చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. రికార్డులను పరిశీలించి గెజిట్ ప్రకారం సర్వే చేస్తామని ఆర్ఐ కృష్ణ గిరిజనులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
 

  • దామరతోగులో మెగా హెల్త్​ క్యాంప్
  • 800 మందికి వైద్య పరీక్షలు

గుండాల, వెలుగు: మండలంలోని మారుమూల గ్రామమైన దామరతోగులో మంగళవారం పోలీస్  శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. హెల్త్ క్యాంప్​ను ఓఎస్డీ సాయి మనోహర్  ప్రారంభించారు. ఈ శిబిరంలో వివిధ రకాల వైద్య నిపుణులను రప్పించారు. వైద్య శిబిరానికి 800 మంది పేషెంట్లు హాజరు కాగా, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. శిబిరం నిర్వహణపై ఆదివాసీలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ హెల్త్ క్యాంపులో టెస్ట్ చేయించుకున్న వారికి మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి సాయం అందిస్తామని తెలిపారు. మావోయిస్టులు, ఇతర అసాంఘిక శక్తులు వస్తే వారికి సహకరించవద్దని సూచించారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ఎస్పీతో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇల్లందు డీఎస్పీ రమణ మూర్తి, సీఐ కరుణాకర్, ఎస్సై రాజశేఖర్, ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు, సర్పంచ్ సరోజ, ఎంపీటీసీ కృష్ణారావు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వివిధ కారణాలతో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ డాక్టర్​ వినీత్​ తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్​లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్​ హెడ్​ క్వార్టర్లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఏఆర్​ఎస్సై యాసిన్, క్యాన్సర్​తో బాధపడుతూ భద్రాచలం పీఎస్​లో పని చేస్తున్న కానిస్టేబుల్​ చనిపోయినట్లు తెలిపారు. పోలీసులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యాసిన్​ కుటుంబానికి రూ.8 లక్షలు, కానిస్టేబుల్​ కుటుంబానికి రూ. లక్ష చెక్కులను ఎస్పీ అందజేశారు. డీపీవో ఏవో వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్​ సత్యవతి, పోలీస్​ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు ఎన్నికలతో టీఆర్ఎస్​ పని ఖతం

సత్తుపల్లి, వెలుగు: టీఆర్ఎస్  పతనానికి మునుగోడు ఎన్నికలే నాంది అవుతాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలో ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావుతో కలిసి ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్టాన్ని గాలికి వదిలేసి మద్యం స్కామ్ లో చిక్కుకున్న కూతురి కోసం కేసీఆర్  ఢిల్లీలో మకాం వేస్తే కేటీఆర్ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్  నాయకులు మద్యం, నగదు పారిస్తున్నా గెలిచేది బీజేపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు అంజిరెడ్డి, ప్రకాశ్  పాల్గొన్నారు.
 

పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేసిన సీపీ

కూసుమంచి, వెలుగు: పోలీసుస్టేషన్​ను ఖమ్మం పోలీస్​ కమీషనర్​ విష్ణు ఎస్​ వారియర్​ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసుస్టేషన్​ నిర్వాహణ, పనితీరు, కేసుల వివరాలు, శాంతిభద్రతలు తదితర అంశాలను సీఐ కొప్పుల సతీశ్, ఎస్ఐ​యాసా నందీప్​ను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుస్టేషన్​ పరిసరాలను పరిశీలించారు. 

ముంపు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలె

భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణంలోని ముంపునకు గురవుతున్న కాలనీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని  సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ పట్టణ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరకట్ట ఎత్తు పెంచాలని, స్లూయిజ్ ​లీకులు అరికట్టాలని డిమాండ్​ చేశారు. ఇటీవల రెవెన్యూ టీమ్స్​ సర్వే పేరుతో హడావుడి చేశాయని ఆరోపించారు. వరదలు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వం పక్కన పెట్టడం సరైంది కాదని అన్నారు. పోలవరం బ్యాక్​వాటర్​తో భద్రాచలానికి ముప్పు ఉందని, దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. ముంపు కాలనీల సమస్యలపై అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలని కోరారు. మర్లపాటి రేణుక, గడ్డం స్వామి, ఎంబీ నర్సారెడ్డి, సున్నం గంగ పాల్గొన్నారు.

పుష్యమి వేళ రామయ్యకు పట్టాభిషేకం

భద్రాచలం, వెలుగు: పుష్యమి నక్షత్రం వేళ శ్రీసీతారామచంద్రస్వామికి మంగళవారం పట్టాభిషేకం నిర్వహించారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో రామయ్యకు సుప్రభాత సేవ చేశారు. గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేసి, తమలపాకులు, అప్పాలమాలలు నివేదించారు. హనుమాన్​ చాలీసా పారాయణం చేశారు. తర్వాత సీతారాముల కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకెళ్లారు. అక్కడ నిత్య కల్యాణం జరిపించారు. అనంతరం రామదాసు తయారు చేయించిన బంగారు ఆభరణాలను సీతారాములకు అలంకరించారు. చింతాకు, పచ్చల పతకాలను అలంకరించిన అనంతరం ప్రోక్షణ జలాలను వేదికపై చల్లారు. రాజదండం, రాజముద్రిక పట్టాభిరామయ్యకు సమర్పించాక కిరీటం అలంకరించి పట్టాభిషేక మహోత్సవాన్ని ముగించారు.