- పత్తి రైతులు ఆగం
- సర్కారు చెప్పిందని పాలమూరులో లక్ష ఎకరాల్లో సాగు
- రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పంటకు తెగులు, వైరస్
- పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదంటున్న రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు : పత్తి రైతులు ఆగమవుతున్నారు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో నీళ్లు నిలుస్తుండడంతో పంటకు తెగుళ్లు, వైరస్ సోకుతోంది. ఎన్నిమందులు తెచ్చి పిరికారీ చేసినా ఫలితం కనిపించకపోవడతో రైతులు లబోదిబోమంటున్నారు. సర్కారు వరికి బదులు పత్తి వేయమంటేనే వేశామని, ఇప్పుడు మొత్తానికి నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పంట ఆకులు, కాయలు ఎర్రబారుతుండడంతో పత్తి కూడా రంగు మారుతోందని, పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 ఎకరాల్లో అదనంగా పత్తి సాగు
నిరుడు వడ్ల అమ్మకాల సందర్భంగా ఇబ్బందులు ఏర్పడడం, ప్రభుత్వం కూడా వరికి బదులు పత్తి వేయాలని చెప్పడంతో పాలమూరు రైతులు లక్ష ఎకరాల్లో పత్తి వేశారు. సాధారణ విస్తీర్ణం 80 వేల ఎకరాలు కాగా.. అదనంగా 20 వేల ఎకరాలు పెంచారు. జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల మంది రైతులు ఉండగా 52,582 మంది రైతులు పత్తి వైపే మొగ్గు చూపారు. మండలాల వారీగా చిన్నచింతకుంటలో 20,825 ఎకరాలు, మిడ్జిల్‌లో 18,616, జడ్చర్లలో 9,17,472 , దేవరకద్రలో 12,386 , అడ్డాకులలో 4,660, భూత్పూర్‌లో 5,304 , మూసాపేటలో 1,619 , బాలానగర్‌లో 6,793, నవాబ్‌పేటలో 1,587 ఎకరాలు, రాజాపూర్‌లో 6,455 , గండీడ్‌లో 754 , హన్వాడలో 300 ఎకరాలు, కోయిల్‌కొండలో 1,618, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 162, మహబూబ్‌నగర్ రూరల్‌లో 901, మహమ్మదాబాద్‌లో 78 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఒక్కో ఎకరా పంట సాగుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ఆగస్టులో భారీ వర్షాలు లేకున్నా.. సెప్టెంబరు నుంచి తరచూ వర్షాలు పడుతుండడంతో పంటకు తెగులు సోకుతోంది. దేవరకద్ర, సీసీకుంట, మిడ్జిల్, జడ్చర్ల మండలాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
గులాబీ రంగు పురుగు, పారావిల్డ్
జూన్, జూలైలలో సాగు చేసిన పత్తి చేలు ప్రస్తుతం కాయలు పగిలే దశలో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇప్పటకే పత్తితీత కూడా మొదలైంది. కానీ, వర్షాల కారణంగా దాదాపు సగం చేన్లలో నీళ్లు నిల్వ ఉంటున్నాయి. దీంతో పారా విల్ట్ (వడలు తెగులు) సోకుతుంది. కాయలకు కుళ్లు తెగులు సోకుతోంది. పారావిల్డ్ నివారణకు కార్బండిజం, మాంకోజెబ్ కలిసిన మందును 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి, కాయ కుళ్లు తెగులుకు ప్రొపికోనజోల్ మందును ఒక మి.లీ/ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే మెజార్టీ చేన్లకు గులాబీ రంగు పురుగు ఆశిస్తోంది. దీని ప్రభావం కాయలుపై పడుతుంది. తెరుచుకోకుండానే కాయలు రాలిపోతాయి. ఈ పురుగు నివారణ కోసం చేలులో లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి థయోడికార్బ్ 1.5 గ్రాములు / లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి పెరగక ముందే పత్తిని ఏరేయాలి. లేదంటే భారీ నష్టం తప్పదు.
పంటపై ఆశలు వదులుకున్న
నాకు రెండు ఎకరాల పొలం ఉంది. రూ.70 వేల పెట్టుబడి పెట్టి ఈ సీజన్లో పత్తి వేసిన. ఫుల్‌గా వానలు పడుతుండటంతో గుమ్మడి తెగులు సోకింది. ఆకులు ఎర్రగా మారి మొత్తం రాలిపోతున్నయ్. మందులు కొట్టినా కూడా ఏం మారలే. దీంతో చేనుపై ఆశలు వదులుకున్న.
–ఆంజనేయులు, రైతు, మున్ననూరు
రూ.లక్ష నష్టపోయినం
మాకున్న ఐదు ఎకరాల్లో పత్తి వేసిన. చేనుకు మొత్తం ఎర్ర తెగులు సోకింది. ఆకులు రాలినయ్. పత్తికి రేటు ఉందంటున్నరు. కానీ, తెగులుతో అసలు పత్తే పండటం లేదు, పోలో, ఆంప్లిగో మందులు పిచికారీ చేసినా కూడా తగ్గలేదు. దీంతో లక్ష వరకు నష్టపోయినం.
– శ్రీకాంత్, యువ రైతు, మిడ్జిల్
విద్యా ప్రమాణాలు పెంచాలి: కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా ప్రమాణాలు పెంచాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులతో మనఊరు–మనబడి, తొలిమెట్టు కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్కూళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. ఇంకా పనులు చేపట్టని స్కూళ్లు ఉంటే ఆ నిధులు మరో స్కూల్ కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీఈవోను ఆదేశించారు.
కేజీబీవీ, వెల్ఫేర్ హాస్టళ్లలో మరుగుదొడ్లు, డైనింగ్ హాల్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. తొలిమెట్టుపై మాట్లాడుతూ చదవడం, రాయడం రాని 1 నుంచి 5వ తరగతి లోపు విద్యార్థులను గుర్తించి.. వారిలో విద్యాప్రమాణాలు పెంపొందించాలన్నారు. విద్యార్థులను భాగస్వాములను చేస్తూ పాఠాలు బోధించడం, ప్రతి నెల బాల సభలు నిర్వహించడం లాంటివి చేయాలన్నారు. ఎంఈవోలు, నోడల్ అధికారులు ప్రతిరోజు తొలిమెట్టు కార్యక్రమాన్ని పర్యవేక్షించి, రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈవో గోవిందరాజులు, ఈడబ్ల్యూఐడీసీ కార్యనిర్వాహక ఇంజనీర్ రాంచందర్, డీఈ ప్రతాప్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
టార్గెట్ పెట్టుకొని చదవాలి: కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: విద్యార్థులు టార్గెట్ పెట్టుకొని చదివితే అనుకున్నది సాధిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. మంగళవారం ఇటిక్యాల మండలం షాబాద్‌లో సీపీఎస్, హై స్కూల్‌ను తనిఖీ చేశారు. స్వయంగా మ్యాథ్స్ క్లాస్ తీసుకొని.. స్టూడెంట్స్ నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేదల తలరాతలు మార్చే శక్తి కేవలం విద్యకే ఉందని, విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం ప్లేగ్రౌండ్‌ను పరిశీలించి నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మనఊరు–మనబడి కింద స్కూళ్లలో చేపట్టిన పనులను వెంటనే కంప్లీట్ చేయాలన్నారు. అనంతరం అంగన్ వాడీ సెంటర్‌ను పరిశీలించి పిల్లల ఎత్తు, బరువు పరిశీలించారు. పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం పెట్టాలని సూచించారు. అలాగే ఉదండాపురం హైస్కూల్లో ఐదుగురు టీచర్లు లీవ్ పెట్టడంపై సీరియస్ అయ్యారు. కలెక్టర్ వెంట డీఈవో సిరాజుద్దీన్, ఎంఈవో రాజు, తహసీల్దార్ సుబ్రమణ్యం తదితరులు ఉన్నారు.
- పోడు సాగుకు అడవి నరికివేత
- మొలచింతలపల్లిలో రెండు రోజులుగా ఉద్రిక్తత
- 18 మందిపై కేసు పెట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లు
కొల్లాపూర్(నాగర్‌కర్నూల్), వెలుగు: పోడు సాగు కోసం కొల్లాపూర్మండలం మొలచింతలపల్లి పరిధిలోని 15 ఎకరాల అడవిని గ్రామస్తులు నరికివేశారు. సోమవారం గ్రామానికి చెందిన కొందరు బుద్దార్ పెంట, దొక్కలపెంట ప్రాంతంలో కానుగ, నీలగిరి చెట్లు నరికి చదును చేస్తుండగా.. సమాచారం అందుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఫారెస్ట్ అధికారులు వారిని పంపించి.. కొల్లాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం కూడా గ్రామస్తులు చదును చేసేందుకు యత్నించగా.. డీఎఫ్‌వో రోహిత్ , ఎఫ్‌డీవోలు ఫారెస్ట్ రేంజర్ , స్పెషల్ స్కాడ్, సిబ్బంది అక్కడికి చేరుకొని అడ్డగించారు. అక్కడ ఉన్న మహిళలు, రైతులను అదుపులోకి తీసుకొని కొల్లాపూర్ ఫారెస్ట్ ఆఫీస్‌కు తరలించారు. రెండు రోజుల్లో18 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. కాగా, పోడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్యం ప్రకటిస్తే ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు.
హాస్టల్ భవనం ఎప్పుడు ఓపెన్ చేస్తరు?
పెబ్బేరు, వెలుగు : హాస్టల్ భవనం సిద్ధమై ఏడేండ్లవుతున్నా.. ఎందుకు ప్రారంభించడం లేదని పెబ్బేరు మహిళా పాలిటెక్నిక్ కాలేజీ స్టూడెంట్లు ప్రశ్నించారు. మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో కాలేజీ నుంచి పెబ్బేరు చౌరస్తా వరకు ర్యాలీ తీసి.. అక్కడే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్టళ్లలో ఉండడం ఇబ్బందిగా ఉందని, ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోయారు. కాలేజీ 2014లోనే ప్రారంభమైనా.. హాస్టల్ భవనంలో నేటికీ మౌలిక వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. మధ్యాహ్నం భోజనం సమయంలో తాగేందుకు నీళ్లు కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ డెవలప్‌మెంట్ అంటూ ఒక్కో స్టూడెంట్ నుంచి రూ.1000, హరితహారం కోసం రూ.100 వసూలు చేశారని ఆరోపించారు. ఫీజులు కట్టే స్థోమత లేక ప్రభుత్వ కాలేజీలో చేరితే.. ఏదో వంకతో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్, సురేశ్, రవి, చరణ్, యాదగిరి, గిరి, మంజునాథ్, రాకేశ్ గౌడ్, తిరుపతి, విద్యార్థినులు ధరణి, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
- ఓటరు నమోదుకు సహకరించాలి
- అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఓటరు నమోదు విషయంలో అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్లు నవంబర్ 7 లోగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని, 23న ముసాయిదా ఓటరు జాబితా రిలీజ్ చేస్తామన్నారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించి.. డిసెంబర్ 25 న అభ్యంతరాల పరిష్కారం , 30న తుది ఓటర్ జాబితాను రిలీజ్ చేస్తామని వివరించారు. ఈ ఎన్నికలకు ఏఈఆర్వోగా మహబూబ్ నగర్ ఆర్డీవో ఉంటారని, తహసీల్దార్లు డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ గా ఉంటారన్నారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పక్షాలు ఓటర్లలో అవగాహన కల్పించి నమోదు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నేతలు సాయిబాబ, అంజయ్య, జి రవీందర్ రెడ్డి , లక్ష్మయ్య , కిల్లెగోపాల్, సత్యం యాదవ్, సాధతుల్లా, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
- దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి
- ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్
- సెక్రటరీ విజయ్ కుమార్
వనపర్తి, వెలుగు: దళితులు దళితబంధు పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రెటరీ విజయ్ కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పౌల్ట్రీ, డెయిరీ అధికారులు, లబ్ధిదారులకు నిర్వహించిన శిక్షణకు కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా దళితబంధు లబ్ధిదారుల యూనిట్ల వివరాలు, వారి విజయాలను వివరించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్లు ముందుకు సాగాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో 199 యూనిట్లు మంజూరు చేశామని, 2వ విడతలో 500 యూనిట్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ, మత్స్య పరిశ్రమ, డెయిరీ, పౌల్ట్రీ, అక్వా పరిశ్రమలపై ఫోకస్ చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా వ్యవసాయ రంగంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని, వనపర్తి వేరుశనగ, కొల్లాపూర్ మామిడికి, మత్స్య సంపదకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అంతకుముందు స్పెషల్ సెక్రటరీ విజయ్ కుమార్ పెబ్బేరు లోని మత్స్య కళాశాలను సందర్శించి ఫిష్ పాండ్స్, చేపలు, రొయ్యల పెంపకం గురించి విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు అడ్వైజర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, డి. వేణుగోపాల్, సెక్టార్ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, డీఆర్డీవో నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, అడిషనల్ డీఆర్డీవో రేణుక, జిల్లా మైనారిటీ అధికారి కాళి క్రాంతి పాల్గొన్నారు.
టీచర్లు ఓటు హక్కు నమోదు చేసుకోండి: అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో జిల్లాలో అర్హత కలిగిన వారంతా నవంబర్ 7 లోగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ఎస్ మోతిలాల్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో జిల్లాలోని టీచర్ల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలో 2016 నవంబర్ 1 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు ఆరేళ్ల కాలంలో మూడేళ్ల పాటు అసిస్టెంట్ పోస్టుకు సమాన హోదాలో పనిచేస్తున్న వారు ఓటు వేసేందుకు అర్హులని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో 44, ఆఫ్ లైన్లో ఒక్క దరఖాస్తు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు
పాల్గొన్నారు.
జోడో యాత్రను సక్సెస్ చేయాలి: టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి
మరికల్, వెలుగు : భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ మల్లురవి పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ఇందిరగాంధీ చౌరస్తాలో మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ లను చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ యాత్రకు భారీ స్పందన వచ్చిందన్నారు. రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలోకి ఈ యాత్ర ఎంటర్ అవుతోందని, రాహుల్‌గాంధీకి పెద్ద సంఖ్యలో స్వాగతం పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, రాష్ర్ట, జిల్లా, మండల నాయకులు అభిజయ్‌రెడ్డి, సూర్యమోహన్‌రెడ్డి, గొల్ల కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ వీరణ్ణ, సత్యన్న, మొగులప్ప, రామకృష్ణ, గోవర్దన్, హరీశ్ కుమార్ పాల్గొన్నారు.
మద్యం మత్తులో భార్యను చంపిండు
పెబ్బేరు, వెలుగు: మద్యం మత్తులో ఓ భర్త భార్యను కొట్టి చంపాడు. పెబ్బేరు ఎస్సై రామస్వామి వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్జిల్లా జూపాడ్ బంగ్లాకు చెందిన జంగాల జగ్గు, ఈశ్వరమ్మ దంపతులు కొన్ని రోజులగా పెబ్బేరు పట్టణంలోని వినాయకనగర్‌కాలనీలో గుడిసె వేసుకొని ఉంటున్నారు. చిన్నపిల్లల బొమ్మలు, ఇతర వస్తువులు అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్నారు. భర్త జగ్గు మద్యానికి బానిస అయి నిత్యం భార్యతో గొడవపడేవాడు. సోమవారం కూడా గొడవపడ్డాడు.. అర్ధరాత్రి సమయంలో మెడకు తాడు బిగించి చంపేశాడు. మంగళవారం తెల్లవారుజామున అచేతనంగా పడి ఉన్న తల్లిని చూపిన పిల్లలు చుట్టుపక్కల వారికి చెప్పారు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రామస్వామి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈశ్వరమ్మ తమ్ముడు గంజాయి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే డ్రైనేజీల పనులైతలేవ్
కొత్తకోట, వెలుగు : అధికారుల నిర్లక్ష్యం వల్లనే మున్సిపాలిటీలోని డ్రైనేజీలు అసంపూర్తిగా ఉన్నాయని బీసీ పొలిటికల్ జేఏసీ నేత రాచాల యుగేందర్ గౌడ్ మండిపడ్డారు. మంగళవారం కమిషనర్ వెంకటేశ్వర్లుతో కలిసి కొత్తకోట పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇరుకుగా ఉన్న మదనపురం రోడ్డును విస్తరించకుండా అధికార పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపాలిటీకి రూ. 20 కోట్లు తెచ్చామని చెబుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే వాటితో ఏం పనులు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజన్న యాదవ్, మహేందర్, తిరుపతయ్య గౌడ్, రాము, వెంకటేశ్ పాల్గొన్నారు.