- జడ్చర్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయం
- మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: కార్యకర్తలు మరింత కష్టపడి పనిచేస్తే జడ్చర్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో పార్టీ ఆఫీస్ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. రైతుల నుంచి లాక్కొన్న భూములకు పరిహారం ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే మన సైన్యాన్ని మనమే తయారు చేసుకోవాలని జితేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల లో 279 పోలింగ్‌బూత్‌ల నుంచి ఆరువేల మంది కార్యకర్తలను తయారు చేయాలని ఆయన సూచించారు. ఈ మీటింగ్‌లో బీజేపీ స్టేట్ట్రెజరర్శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, కౌన్సిలర్లు రాజు,లలిత తదితరులు పాల్గొన్నారు.
కాలేజీ బిల్డింగ్ నిర్మించాలని ఏబీవీపీ దీక్ష
ఆమనగల్లు, వెలుగు : పట్టణంలో ప్రభుత్వ జూనియర్కాలేజీకి సొంత బిల్డింగ్లేక స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే కొత్త బిల్డింగ్నిర్మించాలని ఏబీవీపీ లీడర్లు డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా లో నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు బీజేపీ, బీజేవైఎం లీడర్లు సంఘీభావం తెలిపారు. 2018 ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్కాలేజీ బిల్డింగ్నిర్మిస్తామని హమీ ఇచ్చి నాలుగేండ్లు దాటినా నెరవేర్చకపోవడం బాధాకరమన్నారు. భరత్, మల్లేశ్, శివకుమార్, సురేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి
వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ స్కాలర్ షిప్ లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం గవర్నమెంట్ వుమెన్స్ డిగ్రీ కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏటా విడుదల చేయాల్సిన స్కాలర్ షిప్ లను ఏళ్ల తరబడి పెండింగ్పెట్టడం దుర్మార్గమన్నారు. వెంటనే రిలీజ్చేయకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. లీడర్లు బాలకృష్ణ, జగదీశ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
వడ్లు కొనుమంటే.. ఎమ్మెల్యేలను కొంటున్రు
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, వెలుగు : బీజేపీ సర్కార్ రాష్ట్రంలో పండించిన వడ్లు కొనుమంటే, టీఆర్ఎస్ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్ల కాటన్ మార్కెట్ఆవరణలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. యాసంగి సీజన్ వడ్లను కొనాలని సీఎం కేసీఆర్ ప్రధాని మోడీని ఎన్ని సార్లు కలిసి విన్నవించినా పట్టించుకోలేదని, పైగా బియ్యం బదులు నూకలు తినాలని కేంద్ర మంత్రి చెప్పారని వాపోయారు. అంతకు ముందు కావేరమ్మపేటలో ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీస్‌లో సీఎం రిలీఫ్ఫండ్చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మహబూబ్నగర్జడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జడ్చర్ల మున్సిపల్‌చైర్‌పర్సన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సెక్రటరీ, మాజీ ఉపసర్పంచ్ కొట్టుకున్నారు
గద్వాల, వెలుగు: ‘గట్టు’ పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గుండన్న శుక్రవారం కొట్టుకున్నారు. ఇద్దరికీ దెబ్బలు తగలడంతో పోలీసులకు ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకున్నారు. గ్రామస్తులు, ఎస్సై పవన్కుమార్వివరాల ప్రకారం.. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ మధ్య సంత, అంబ భవాని జాతర వేలం పాట విషయంలో విభేదాలు వచ్చాయి. దీంతో సెక్రటరీ వేలంపాటను వాయిదా వేయడంతో సర్పంచ్ వర్గం మండిపడింది. శుక్రవారం పంచాయతీ ఆఫీస్ కు సర్పంచ్ వర్గానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ గుండన్న వెళ్లాడు. అక్కడ సెక్రటరీ లేకపోవడంతో ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాట మాట పెరిగి కలబడ్డారు. సెక్రెటరీ చొక్కా చినగడంతో పాటు గాయాలవ్వగా, మాజీ ఉప సర్పంచ్ కూడా గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
‘మన ఊరు మన బడి’ పనులు బాగున్నయ్..
స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ‘మనఊరు, మనబడి’ కింద చేపట్టిన పనులు బాగున్నాయని స్కూల్ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన అన్నారు. శుక్రవారం ఆమె హన్వాడ ప్రైమరీ స్కూల్లో ‘మన ఊరు– మనబడి’ పనులను తనిఖీ చేశారు. స్కూల్లో నిర్మాణ పనులు, కిటికీలు, తలుపులు, అన్నీ బాగున్నాయన్నారు. స్టూడెంట్ల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాప్స్ పరిశీలిస్తూ నల్లాలపై టైల్స్ వేయించాలని , స్కూల్ఆవరణలో మంచి మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం టీచర్లతో మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని నిరంతరం నిర్వహించాలన్నారు. సల్లోనిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఒకే చోట ఉండడం వల్ల స్టూడెంట్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, హైస్కూల్‌ను వేరే చోటకు మార్చేందుకు పర్మిషన్ఇవ్వాలని ఎంపీపీ బాలరాజు డైరెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కలెక్టర్ ఎస్. వెంకట్ రావు, ఎంపీపీ బాలరాజు, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, ఏఎస్పీ రమేశ్, ఎంపీడీవో ధనుంజయ గౌడ్ తదితరులు ఉన్నారు.
అచ్చంపేటకు అసమర్థ ఎమ్మెల్యే అవసరమా?
డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ
ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతల– వంగూరు మండలాల సరిహద్దుల్లో మొలగర వద్ద దుందుభి నదిపై కాజ్ వే పూర్తిగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాల్లో చనిపోతున్నారని, ఇవేమీ పట్టించుకోని అసమర్థ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటకు అవసరమా? అని డీసీసీ ప్రెసిడెంట్చిక్కుడు వంశీకృష్ణ మండిపడ్డాడు. శుక్రవారం పీసీసీ పిలుపు మేరకు స్థానిక కాంగ్రెస్లీడర్లతో కలిసి వంశీకృష్ణ దుందుభి నదిని విజిట్‌చేసి అక్కడున్న హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కాజ్‌వేపై యాక్సిడెంట్జరిగి ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాజ్‌వేను పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే దుందుభిపై హైలెవల్బ్రిడ్జి నిర్మించాలని, అంతవరకు టెంపరరీ రిపేర్లు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కట్టా అనంత రెడ్డి, నేతలు నర్సింహ రావు, గోవర్ధన్ రెడ్డి, నర్సింహారెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసుల్లో పక్కా ఎంక్వైరీ చేయాలి
ఎస్పీ రంజన్ రతన్ కుమార్
గద్వాల/ మహబూబ్‌నగర్‌టౌన్, వెలుగు: ప్రతి ఒక్క కేసును పక్కాగా ఎంక్వైరీ చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్‌లో జిల్లా అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్‌ల వారీగా కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల్లో శిక్ష పడే శాతం పెరిగితే పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. మహిళలపై జరిగే దారుణాలపై పారదర్శకంగా ఎంక్వైరీ చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. డీఎస్పీలు రంగస్వామి, ఇమాన్యుయేల్, సీఐలు చంద్రశేఖర్, సూర్య నాయక్, శివ శంకర్ పాల్గొన్నారు.
వాల్నిర్మాణానికి పునాది తీసిన ఎస్పీ
జిల్లా పరేడ్ గ్రాండ్ లో శుక్రవారం ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు పలుగు పార పట్టి పునాది తీశారు. పరేడ్ గ్రౌండ్ లో పోర్టల్ వాల్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఆయన ఆఫీసర్లు, సిబ్బందితో కలిసి పోర్ట్ వాల్ 158 అడుగుల పొడవు, 2 అడుగుల లోతు పునాది తీశారు.
గవర్నర్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నరు
ఆమనగల్లు, వెలుగు: గవర్నర్ వ్యవస్థను సీఎం కేసీఆర్ అపహాస్యం చేస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌జిల్లా ఆమనగల్లులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో గవర్నర్ ఎక్కడ పర్యటించినా ప్రోటోకాల్ పాటించకుండా అవమానిస్తున్నారన్నారు. పూటకో పార్టీ మారిన మంత్రులతో సీఎం కేసీఆర్ఉద్దేశపూర్వకంగా గవర్నర్‌పై ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలు ప్రగతి భవన్‌కు వెళ్లి సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్‌భవన్‌కు వెళ్లి సమస్యలను ఏకరువు పెడుతుంటే జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. కమ్యూనిస్టులు ఉనికి కోసం పాకులాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసం అవకాశవాద పార్టీలకు వంత పాడుతున్నాయని మండిపడ్డారు. మున్సిపల్చైర్మన్రాంపాల్ నాయక్ పాల్గొన్నారు.
ఎలక్షన్ కమిషన్ కు కళ్లు, చెవులు లేవా?
నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మునుగోడు బై ఎలక్షన్లో విచ్చలవిడిగా లిక్కర్, డబ్బులు పంపిణీ చేసినా ఈసీ చూసీ చూడనట్లు వదిలేసిందని, ఈసీకి కళ్లు, చెవులు లేవా? అని కాంగ్రెస్‌నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో మునుగోడు ఉప ఎన్నికలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అధికారులను చేతిలో పెట్టుకుని ధన బలంతో గెలిచిన గెలుపు గెలుపేనా? అని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేదే అధికారం అని సీఎం కేసీఆర్ చెప్పడంపై ఆయన విమర్శించారు. మార్కండేయ లిఫ్ట్ ఇరిగేషన్ బాధితులకు తక్కువ నష్టపరిహారం ఇవ్వడం ఆయన సరికాదన్నారు. బాధితుల తరఫున పోరాటం చేస్తానని, భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, టి.పాండు, లక్ష్మయ్య, కౌన్సిలర్ నిజాముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.