- జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు మునుగోడుకు
- నిలిచిన జడ్పీ మీటింగ్
- కోరం లేక వాయిదా వేసిన చైర్పర్సన్
నాగర్‌కర్నూల్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్ ఎఫెక్ట్ నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ మీటింగ్‌పై పడింది. జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు అంతా మునుగోడులోనే మకాం వేయడంతో గురువారం సభ్యులెవరూ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో కోరం లేక చైర్పర్సన్పెద్దపల్లి పద్మావతి సమావేశాన్ని వాయిదా వేశారు. మీటింగ్ వాయిదా పడుతుందనే ఉద్దేశ్యంతోనే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు జిల్లా అధికారులను పంపించి ఇతర కార్యక్రమాల్లో బిజీ అయిపోయారని తెలిసింది. మీటింగ్‌కు హాజరైన జిల్లా అధికారులు ఫైల్స్, మొబైల్స్చూసుకుంటూ కాలక్షేపం చేశారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే జడ్పీ మీటింగ్ కి ఇలా సభ్యులెవరూ హాజరు కాకపోవడంతో.. ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేదెలా? అభివృద్ధి పనులకు మోక్షం ఎప్పుడూ? అంటూ ప్రతి పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నో సమస్యలు చర్చిస్తారనుకుంటే.. జూలై 7న జరిగిన మీటింగ్‌లో ఎంపీ రాములు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తలేరని అధికారుల తీరుపై ఎంపీ మండిపడ్డారు. సామాన్యులకు ఇసుక దొరకకుండా చేస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీని ఫెయిల్ చేసేందుకు కొన్నిశాఖల అధికారులు కష్ట పడుతున్నారని డైరెక్ట్‌గా ఎటాక్ చేశారు. అయితే ఈ సారి మీటింగ్ జరిగితే దళితబంధు ఎంపిక, ఇసుక ఇల్లీగల్ దందా, వైద్యారోగ్య శాఖ ఫెయిల్యూర్స్‌తో పాటు ఈ సారి మీటింగ్‌లో రేషన్ బియ్యం అక్రమ దందాపై సివిల్ సప్లై ఆఫీసర్ల పని తీరును ఎండగట్టాలని సభ్యులు డిసైడ్ అయ్యారు. కానీ వాయిదా పడడంతో విపక్ష సభ్యులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
రేషన్‌బియ్యంపై నిలదీసేందుకు సిద్ధమైన్రు..
జిల్లాలో ఇసుక దందా తర్వాత అంతే స్థాయిలో సాగుతున్న రేషన్‌బియ్యం రీసైక్లింగ్ దందా వెనకాల ఉన్న పెద్దలెవరో తేల్చేందుకు పట్టుబట్టాలని కొందరు సభ్యులు ముందుగానే అన్ని వివరాలతో రెడీ అయ్యారు. ఏండ్ల తరబడి జిల్లాలో పాతుకుపోయిన అధికారులు ఇల్లీగల్ దందాకు సపోర్ట్ చేస్తున్నారని, వారి పనితీరు, పథకాల అమలు, జవాబుదారీతనం లేని వైఖరిపై నిలదీస్తామని కూడా చెప్పారు. ఇలా ప్రజా సమస్యలపై హాట్‌హాట్‌గా సాగుతుందనుకున్న సమావేశం వాయిదా పడడంతో విపక్ష సభ్యులు ఉసూరుమనుకుంటూ వెళ్లిపోయారు.
ఈసారి ఎవరిని వదలం..
వాయిదా వేసిన జడ్పీ మీటింగ్ డేట్ త్వరలో ఫిక్స్ చేస్తారు. కీలక శాఖల్లో జవాబుదారీతనం లేని అధికారులు తప్పించుకుంటున్నారు. ఈసారి ఎవరిని వదలం. లెక్కలతో సహా అన్ని ప్రిపేర్ చేసుకున్నాం. అని కొందరు జడ్పీటీసీ సభ్యులు మీడియాకు ఫోన్‌చేసి చెప్పారు.
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు : గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామం ‘మెగా పల్లె ప్రకృతి పార్కు’ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిశుభ్రత పాటించాలన్నారు. అనంతరం గ్రామంలోని, పాతపాలెంలోని హైస్కూళ్లు, సీపీఎస్ స్కూళ్లను తనిఖీ చేశారు. టీచర్లు బయోమెట్రిక్ఇన్టైంలో చేసి రిపోర్టు పంపించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని క్వాలిటీ గా పెట్టేలా చూడాలన్నారు.‘మన ఊరు మనబడి’ పనులను పరిశీలించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో సిరాజుద్దీన్, ఎంఈవో సురేశ్ ఉన్నారు.
భక్తులకు అన్ని సౌలతులు కల్పించాలి.
వెంకటాపురం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌలతులను కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం గుడిలో ప్రత్యేక పూజలు చేసి సౌకర్యాలపై ఆరా తీశారు.
- అభివృద్ధి పనుల వివరాలు ఆన్ లైన్లో ఎంట్రీ చేయాలి
- కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వనపర్తి, వెలుగు: జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల ఎంపిక కోసం చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను ఆన్ లైన్ లో పొందుపర్చాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల పూర్తి వివరాలు మండల స్థాయిలో హార్డ్ కాపీలు, సాప్ట్ కాపీలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉత్తమ పంచాయతీలుగా వివిధ విభాగాల్లో అభివృద్ధి సాధించాలని ఆమె సూచించారు. జిల్లాలోని 255 పంచాయతీలు ఉత్తమ పంచాయతీ అవార్డుకు పోటీ పడాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్డీవో నరసింహులు, డీపీవో సురేశ్, డీఎంహెచ్ వో డాక్టర్ రవి శంకర్, పాల్గొన్నారు.
- వైద్య సేవలు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
- కలెక్టర్ ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : వైద్య సేవలు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం జిల్లాలోని పెద్దకొత్తపల్లి పీహెచ్సీ, కొల్లాపూర్ సీహెచ్‌సీ, రామాపురంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సరిగా మెయింటెయిన్చేస్తలేరని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్డాక్టర్ యాదగిరికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలని ఆదేశించారు. పెద్దకొత్తపల్లి పీహెచ్సీ ఫార్మసిస్ట్ సురేశ్ ను మెడికల్ స్టోర్ రికార్డులు చూపించాలని అడగగా, రికార్డులు ఇంటి వద్ద ఉన్నాయని సమాధానం ఇవ్వడంతో షోకాజ్నోటీస్ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రామాపురం మాత శిశు ఆరోగ్య కేంద్రంలో 18 మందికి గాను నలుగురు మాత్రమే విధుల్లో ఉండడమేమిటని కలెక్టర్ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో మార్పులు రాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం కొల్లాపూర్ తహసీల్దార్ఆఫీస్ను సందర్శించారు. ల్యాండ్ కంప్లైంట్ఫైల్స్ను పరిశీలించారు. డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్, ఆర్టీవో హనుమాన్ నాయక్, తహసీల్దార్ రమేశ్ పాల్గొన్నారు.
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి
లింగాల, వెలుగు : అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ లింగమ్మ అన్నారు. గురువారం లింగమ్మ అధ్యక్షతన లింగాల మండల పరిషత్ ఆఫీస్‌లో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం లేదని, మూడు నెలలకోసారి జరిగే మండల సమావేశాలకు అధికారులు హాజరు కాకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడే అభివృద్ధి ఫలాలు పేదలకు అందుతాయన్నారు. వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, ఎంపీడీవో గీతాంజలి, తహసీల్దార్ మునిరుద్దీన్, పీఆర్డీఈ బాషు వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ బస చేసే చోట భద్రత పక్కాగా ఉండాలి
ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు
మరికల్, వెలుగు : కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ బస చేసే శిబిరం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండాలని నారాయణపేట ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు పోలీసులను ఆదేశించారు. గురువారం భారత్‌జోడో యాత్రలో భాగంగా మండలంలోని ఎలిగండ్ల, పస్పుల గ్రామాల మధ్య రాహుల్ బస చేయనున్నారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. రాత్రి వేళ గార్డ్డ్యూటీలో ఉన్న పోలీసులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సీఐ రాంలాల్‌నాయక్, ఎస్సై అశోక్‌బాబు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
‘నర్తన చూడామణి’ అవార్డు గ్రహీతకు సన్మానం
వనపర్తి, వెలుగు: జిల్లాలోని బాలభవన్ లో డ్యాన్స్ టీచర్ గా పనిచేస్తూ ‘నర్తన చూడామణి’ అవార్డుకు ఎంపికైన కూచిపూడి శిక్షకురాలు బక్షి ప్రసన్న ను గురువారం సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో ఎందరినో డ్యాన్సర్లుగా తీర్చిదిద్దిన ప్రసన్న ను ‘ఏబీసీ పౌండేషన్ భరత్ ఆర్ట్స్ అకాడమీ’ నర్తన చూడామణి అవార్డుకు ఎంపిక చేయడం గొప్ప విషయమని సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనే గొప్ప నృత్య శిక్షకురాలిగా పేరు తెచ్చుకున్న ప్రసన్నకు ఈ అవార్డు రావడం గర్వకారణమన్నారు. సాహితీ వేత్తలు నారాయణరెడ్డి, జనజ్వాల, బైరోజు చంద్రశేఖర్, ఎంఏ.సత్తార్ పాల్గొన్నారు.
యాక్సిడెంట్లో చిన్నారి ..
పెద్దమందడి, వెలుగు: మండల పరిధిలోని దొడగుంటపల్లి రోడ్డుపై గురువారం ఆటో, మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో ఓ చిన్నారి చనిపోయింది. ఎస్సై హరిప్రసాద్వివరాల ప్రకారం.. కొత్త కుంట తండాకు చెందిన లోకేశ్, మోహన్, దానమ్మ ఆమె మనుమరాలు అక్షిత(2) నలుగురు టీవీఎస్ ఎక్సెల్ పై పెద్దమందడికి బయలుదేరారు. పెద్దమందడి నుంచి నుంచి బలిజపల్లికి వెళ్తున్న ఆటో ఓవర్‌స్పీడ్‌తో ఎదురుగా వస్తున్న టీవీఎస్ఎక్సెల్ను ఢీకొట్టింది. దీంతో అక్షిత ఎగిరి రోడ్డుపై పడి స్పాట్లోనే చనిపోయింది. లోకేశ్, మోహన్, దానమ్మ కు కూడా తీవ్రగాయాలు కాగా వారిని వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చిన్నారి తల్లి కాట్రావత్ అనిత కంప్లైంట్మేరకు కేసు ఫైల్చేసి దర్యాప్తు చేస్తున్న తెలిపారు. శుక్రవారం చిన్నారి అక్షిత బర్త్‌డే కావడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రేపు వెహికిల్స్ వేలం
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వెహికల్స్‌ను ఈ నెల 29 న బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎస్పీ కె.అపూర్వరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం125 వెహికల్స్‌కు రేపు ఉదయం 11:00 గంటలకు నాగవరంలోని పోలీస్ సాయుధ దళ కార్యాలయం ఆవరణలో వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో 2 ఫోర్ వీలర్లు, 6 ఆటోలు, 117 బైక్ లు ఉన్నాయన్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు వెహికల్స్‌ను ముందుగా పరిశీలించి, ఆధార్ కార్డు జీరాక్స్ఇచ్చి పాల్గొనాలన్నారు. వివరాలకు ఇన్స్పెక్టర్వెంకట్ ను లేదా, 8498974640, 7901153006 నంబర్లకు ఫోన్‌చేయాలని ఎస్పీ తెలిపారు.
- భారత జోడో యాత్రకు తరలి రండి
- మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రకు ప్రజలు తరలి రావాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం తెలకపల్లి, తాడూరు, బిజినేపల్లి మండలాల కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. హాజరైన నాగం మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ జోడో యాత్రలో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్ పాదయాత్రకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారని, నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి భారీగా పాల్గొని సక్సెస్చేయాలని కోరారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతాలు, టి.పాండు, రాము, మల్లేశ్, ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు.