సంగారెడ్డి టౌన్ , వెలుగు : సీఎంను జైలులో పెట్టే రోజులు దగ్గరపడ్డాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో దోచుకున్న డబ్బులతో ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు పెట్టుకుంటున్న సీఎం కుటుంబానికి, ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని, వారంతా త్వరలోనే జైలుకు పోవడం ఖాయమన్నారు. బుధవారం ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ బైక్ ర్యాలీ యాత్ర ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యూ కలెక్టరేట్ వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. మోడల్ తెలంగాణ అంటూ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డిని దత్తతతీసుకొని రాష్ట్రంలోనే మోడల్ గా అభివృద్ధి చేస్తానన్నారని, కానీ కనీసం మున్సిపాలిటీలో చెత్త సేకరణకు డంప్ యార్డ్ కూడా లేని స్థితి ఉందని విమర్శించారు. తెలంగాణ రైతాంగాన్ని దోచిన డబ్బులను ఇతర రాష్ట్రాల రైతులకు ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు? ఈటల రాజేందర్ ను చింత ప్రభాకర్ కలవడం తో సీఎంకు వణుకు పుట్టిందని, అందుకే ఆయనకు కార్పొరేషన్ పదవి కట్టబెట్టారన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వరరావు దేశ్‌పాండే, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జగన్, డాక్టర్ రాజు గౌడ్, నరసింహారెడ్డి, మందుల నాగరాజు, రవిశంకర్, వాసు, పవన్, సురేందర్, డాక్టర్ అరుణ
పాల్గొన్నారు.
మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సిద్దిపేట సీపీ ఎన్. శ్వేత అన్నారు. బుధవారం పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్ సెంటర్ లో మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ కోసం క్యాన్సర్, గైనిక్ ప్రాబ్లంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొనే పీరియడ్స్ సమస్యలపై సదస్సు నిర్వహిస్తున్నట్టు, ప్లాస్టిక్ ప్యాడ్స్ స్థానంలో క్లాత్ ప్యాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచించారు. అనంతరం అంకాలజిస్ట్ డాక్టర్ రోహిణి బ్రెస్ట్ క్యాన్సర్ పై, డాక్టర్ సౌజన్య పీరియడ్స్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అక్కడున్న మహిళలందరికీ శానిటర్ కప్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్వార్డ్ స్వచ్ఛంద సేవ సంస్థ ప్రతినిధి డాక్టర్ శాంతి, సెట్విన్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ అమీనా, మహిళా ఇన్స్పెక్టర్ దుర్గ, ఎస్సై స్రవంతి, ఆర్ఎస్సై పుష్ప, హెడ్ కానిస్టేబుల్ స్వాతి
పాల్గొన్నారు.
సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో వజ్రోత్సవ ఏర్పాట్లపై ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేశ్‌తో కలిసి సమీక్షించారు. దేశంలో అంతర్భాగమై 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి18 వరకు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తుందన్నారు. 16న పట్టణంలో ర్యాలీ నిర్వహించాలన్నారు. 17న ఉదయం 9 గంటలకు కలెక్టర్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. 18న 10 గంటల నుంచి 12 గంటల వరకు స్థానిక ద్వారకా గార్డెన్స్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్య్ర సమరయోధులకు, కళాకారులకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సమ్మేళనం పాంప్లెంట్స్ విడుదల చేశారు. సమావేశంలో డీఎస్పీలు సైదులు, యాదగిరిరెడ్డి, ఆర్డీవోలు సాయిరామ్, వెంకట ఉపేందర్ రెడ్డి, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, ఆర్టీవో శ్రీనివాస్‌గౌడ్, మెప్మా పీడీ ఇందిర, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, జిల్లా అధికారులు కేశూరం, నాగరాజ్, రమేశ్ కుమార్, రాజి రెడ్డి, ఎంపీడీవోలు
పాల్గొన్నారు.
ప్రాణాలు పోయినా ఇండ్లు ఖాళీ చేయం
మెదక్ (శివ్వంపేట), వెలుగు : ప్రాణాలు పోయినా సరే ఇండ్లు ఖాళీ చేయబోమని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామంలో గంగపుత్ర కాలనీవాసులు బుధవారం ఆందోళనకు దిగారు. కాలనీలో దశాబ్దాలుగా 50 కుటుంబాలు, 35 ఇండ్లలో నివాసం ఉంటున్నాయి. కాగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సర్వే నంబర్ 287 లో 27 గుంటల భూమి తనదంటూ సర్వే చేయించేందుకు సర్వేయర్లతో కాలనికి రాగా స్థానికులు వారిని అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్నేండ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని, గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని ఇండ్లు కట్టుకున్నామని, ఏటా పన్ను కూడా కడుతున్నామని తెలిపారు. ఇప్పుడు ఓ వ్యక్తి వచ్చి భూమి తనదని, ఇండ్లు ఖాళీ చేయాలని అనడం ఎంతవరకు సమంజసమన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు ఆఫీసర్లు ఇండ్ల స్థలాన్ని ధరణిలో వ్యవసాయ భూమిగా నమోదు చేసి పట్టా పాస్ పుస్తకం ఇచ్చారని ఆరోపించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
టీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, బీసీలకు అన్యాయం
నర్సాపూర్, వెలుగు : టీఆర్ఎస్ పాలనలో ఎస్సీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ఆరోపించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీ, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన నర్సాపూర్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రగతి భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భజనలు చేసేవారికే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ఆరోపించారు. నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్ఏలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేయడం హర్షణీయమని, అయితే ముందుగా తెలంగాణ సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మునుగోడు ఎన్నికల్లో చెప్పుకోవడం కోసమే చింత ప్రభాకర్ కు నామినేటెడ్ పదవి కట్టబెట్టారని విమర్శించారు.
త్వరలో అక్కన్నపేట-మెదక్ మధ్య రైళ్ల రాకపోకలు
మెదక్, వెలుగు : అక్కన్నపేట–మెదక్ మధ్య కొత్తగా నిర్మించిన రూట్లో త్వరలో రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. బుధవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి స్పెషల్ రైలు లో జిల్లాకు వచ్చారు. రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి మెదక్ వరకు కొత్తగా నిర్మించిన 17 కిలో మీటర్ల బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను, రామాయంపేట మండలం లక్ష్మాపూర్, హవేలీఘనపూర్ మండలం శమ్నాపూర్, మెదక్ రైల్వే స్టేషన్లో ట్రాక్, ప్లాట్ ఫామ్, స్టేషన్ మాస్టర్ రూమ్, సిగ్నల్స్ , పార్కింగ్ ఏరియా, సబ్ వే ను పరిశీలించారు. స్టేషన్ లో పలు లోపాలు గుర్తించి వాటిని సరి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అక్కన్నపేట–మెదక్ రైల్వే ప్రాజెక్ట్ పనులన్నీ పూర్తయ్యాయని, మరో పది, పదిహేను రోజుల్లో ఈ రూట్లో రైళ్ల రాకపోకలు మొదలవుతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఈ రూట్లో రెండు ప్యాసింజర్ రైళ్లు నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు. ట్రాఫిక్ ను బట్టి భవిష్యత్ లో అదనపు రైళ్లు, దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుపుతామని చెప్పారు. అక్కన్నపేట స్టేషన్లో అజంతా ఎక్స్ ప్రెస్ రైలును ఆపాలని రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు అక్కన్నపేట సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానికులు వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట కన్స్‌స్ట్రక్షన్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నీరజ్ అగర్వాల్, హైదరాబాద్డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్, కన్స్‌స్ట్రక్షన్, ప్లానింగ్ చీఫ్ ఇంజనీర్ రవి, రైల్వే అధికారులు
ఉన్నారు.
టీఆర్ఎస్ సమైక్యతా రాగం సిగ్గుచేటు
సిద్దిపేట రూరల్/మెదక్‌టౌన్/నర్సాపూర్/కోహెడ, వెలుగు : అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణ సమైక్యత దినోత్సవం అని మాట మార్చడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు విమర్శించారు. తెలంగాణ విమోచన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు పట్టణాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి, మెదక్‌లో జిల్లా ప్రెసిడెంట్గడ్డం శ్రీనివాస్, బీజేవైఎం ప్రెసిడెంట్ ఉదయ్‌కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జనార్దన్ రెడ్డి, నర్సాపూర్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేశ్, రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, రఘువీర్, హుస్నాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గురుశెట్టి శివ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి మాట్లాడారు. ఎంఐఎం పార్టీకి భయపడి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినానికి బదులు సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రజాకార్ల ఆగడాలపై తెలంగాణ ప్రజలు ఎలా తిరగబడ్డారో నిజాంను మించి పాలిస్తున్న కేసీఆర్పాలనపై కూడా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
జూనియర్‌కాలేజీలో అగ్నిప్రమాదం
జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎన్నికల సామగ్రి కాలిపోయింది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో ఉపయోగించగా మిగిలిపోయిన సామగ్రిని రెవెన్యూ అధికారులు కాలేజీలోని ఓ గదిలో ఉంచారు. క్లాసులు పూర్తవడంతో బుధవారం స్టూడెంట్లు, కాలేజీ సిబ్బంది వెళ్లిపోయారు. సాయంత్రం కాలేజీలో మంటలు చెలరేగుతున్న విషయాన్ని స్థానికులు గుర్తించి ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే ఫైర్‌సిబ్బంది కాలేజీకి చేరుకుని మంటలు ఆర్పేశారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
దళితులకు టీఆర్ఎస్ ఏం చేసింది?
దుబ్బాక, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి తొలుత దళితుడే సీఎం అని, ట్యాంక్ బండ్‌పై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి పట్టించుకోని సీఎం కేసీఆర్దిష్టిబొమ్మను దహనం చేయాలని బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మద్దెల రోశయ్య, బీజేపీ మజ్దూర్ సెల్ జిల్లా కన్వీనర్ మచ్చ శ్రీనివాస్ టీఆర్ఎస్లోని దళిత నాయకులకు సూచించారు. బుధవారం వారు దుబ్బాకలో మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేయడం, ఆయనను విమర్శించే ముందు దళిత సమాజానికి టీఆర్ఎస్ ఏం చేస్తోందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ప్రశ్నించే గొంతైన రఘునందన్‌రావుకు భయపడే రాష్ట్రంలో అరకొరగా అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. వారి వెంట నాయకులు సుంకోజు ప్రవీణ్, బావాజీ రాజేశ్, బద్రి, రాజు, యాదగిరి ఉన్నారు.
జాతీయ సదస్సుకు ఎంపికైన ఎంపీపీకి సన్మానం
మెదక్ (శివ్వంపేట), వెలుగు: కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ స్మార్ట్ పంచాయతీల మీద ఈనెల 15, 16న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుకు మెదక్ జిల్లా శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు హుస్నాబాద్‌కు జేఎస్ఆర్
కోహెడ, వెలుగు : ఇటీవల బీజేపీలో చేరి మొదటిసారిగా గురువారం హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్న జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డికి స్వాగతం పలికేందుకు బీజేపీ లీడర్లు, జేఎస్ఆర్ టీమ్ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు కోహెడ నుంచి హుస్నాబాద్ వరకు సూమారు 3వేల బైక్‌లతో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కోహెడ మండల కేంద్రం నుంచి మండలంలోని శ్రీరాములపల్లి, నకిరేకొమ్ముల, చిరుగుమామిడి మండలం నవాబుపేట, సుందరగిరి, బొమ్మనపల్లి, రాములపల్లి, హుస్నాబాద్ మండలం మడద, హుస్నాబాద్ డిపో క్రాస్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా శుభం గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఫంక్షన్ హాల్లో మీటింగ్, వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు జేఎస్ఆర్ ఆధ్వర్యంలో బీజేపీలో
చేరనున్నారు.
అన్ని వర్గాల ప్రజలనూ ఆదుకుంటున్నాం
మెదక్ టౌన్, వెలుగు : రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటోందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నార్సింగి మండలం సంగపూర్ తండా, శంకాపూర్, శేరిపల్లి, జప్తిశివునూర్ గ్రామాలకు చెందిన 28 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆమె చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నార్సింగి జడ్పీటీసీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ సుజాత, చిన్నశంకరంపేట పార్టీ అధ్యక్షుడు రాజు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.