ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

తెలంగాణ పథకాలను దేశమంతా కావాలంటున్రు..

కొమురవెల్లి, వెలుగు : తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ ప్రాంతంలోనూ కావాలని దేశంలోని ప్రజలందరూ అంటున్నారని, కానీ బీజేపీ వాళ్లు మాత్రం ఇక్కడి స్కీమ్​లను బంద్ చేయాలంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం కొమురవెల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సంక్షేమ పథకాలను  బంద్ చేయడం బీజేపీ నుంచి కాకపోవడంతోనే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే వాటా బంద్ చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గుజ్జ సంపత్​రెడ్డి, ఎంపీపీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, ఆలయ చైర్మన్ భిక్షపతి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

దత్తాచల ఆలయ అభివృద్ధికి కృషి

సంగారెడ్డి (హత్నూర), వెలుగు : హత్నూర మండలంలోని మధుర గ్రామశివారులోని దత్తాచల క్షేత్ర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. దత్త జయంతి సందర్భంగా బుధవారం క్షేత్రంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ పూజారి సభాపతి శర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. 

దామోదర ను సన్మానించిన ఎమ్మెల్యే 

దత్తాత్రేయ జయంతి సందర్భంగా క్షేత్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను ఎమ్మెల్యే మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా శాలువా కప్పి సన్మానించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్లు వారు తెలిపారు. 

ఘనంగా ఉత్సవాలు.. 

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు : మెదక్ పట్టణం బ్రాహ్మణ వీధిలోని దత్తాత్రేయ మందిరంలో, పెద్ద శంకరంపేటలోని మాణిక్ ప్రభు దేవాలయం, ప్రియాంక కాలనీ లోని సంతోషిమాత దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పూజారులు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, అలంకరణ చేయగా ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

అధికారులు పనులు చేయట్లే.. 
‘మనఊరు -మనబడి’పై సంగారెడ్డి కలెక్టర్ అసంతృప్తి

సంగారెడ్డి, వెలుగు :  మనఊరు- మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి స్కూళ్లలో అన్ని వసతులు కల్పిస్తుంటే, అధికారులు మాత్రం పనులు చేయించడం లేదని సంగారెడ్డి కలెక్టర్​ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో మనఊరు -మనబడి పనుల పురోగతిపై విద్యాశాఖ, సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. జిల్లాలో మొదటి దశలో 441 పాఠశాలల్లో మనఊరు -మనబడి పనులు ప్రారంభించామని తెలిపారు. పనులు స్లోగా జరుగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి నాంపల్లి రాజేశ్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ. ఇరిగేషన్, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ శాఖల ఈఈలు పాల్గొన్నారు.

భారత త్రివిధ దళాల సంక్షేమానికి చేయూత..

దేశ రక్షణ కోసం, భారత ప్రజల సుఖశాంతుల కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. బుధవారం సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  కలెక్టర్ శరత్ తన వంతు విరాళాన్ని అందజేశారు. 

క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించాలని, లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ, విందు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయమై మైనార్టీ సంక్షేమ అధికారి, ఆర్డీవోలు,  తహసీల్దారులతో బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశంచేశారు. అర్హులైన లబ్ధిదారులకు గిఫ్ట్ ప్యాకెట్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ. 8 లక్షలు, 4 వేల గిఫ్ట్ ప్యాకెట్లు ఇచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ లో ప్రతి నియోజకవర్గానికి  1000 గిఫ్ట్  ప్యాకెట్లు,  విందు భోజనాల కోసం రూ. 2 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గిఫ్ట్ ప్యాకెట్ల  పంపిణీకి  లబ్ధిదారుల జాబితాను  సిద్ధం చేయాలని సూచించారు. 

మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: మహిళలు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు. బుధవారం నారాయణరావుపేట మండలం గుర్రాలగోంది గ్రామంలో రుతుప్రేమ కార్యక్రమంపై మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనుస్ట్రువల్ కప్పుల వాడకంతో మహిళలు ఆరోగ్య వంతంగా ఉంటారని తెలిపారు. రుతుప్రేమ కార్యక్రమంపై మొదట సిద్దిపేట మున్సిపాలిటీ, నారాయణరావుపేట మండలంలో, 10 గ్రామాలలో వారం రోజుల్లో అవగాహన కల్పించి మెనుస్ట్రువల్ కప్పులను పంపిణీ చేశామన్నారు. దేశంలోనే తొలిసారి నారాయణరావుపేట మండలంలో ఈ కార్యక్రమాన్ని  ప్రారంభించి పూర్తి చేశామని చెప్పారు. దేశంలోనే ప్లాస్టిక్ ప్యాడ్స్ రహిత గ్రామీణ మండలంగా నారాయణరావుపేట నిలిచిందన్నారు. రుతుప్రేమ కార్యక్రమం ప్రత్యేక శద్ధ తీసుకొని సేవలందించిన ప్రముఖ డాక్టర్ ​శాంతి, సీపీ శ్వేత, డీపీవో దేవకిదేవి, బీసీ సంక్షేమ అధికారి సరోజను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ ఆకుల హరీశ్, ఎంపీడీవో మురళీధర్ శర్మ, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఏం ధర్మసాగర్ 
పాల్గొన్నారు.

క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

గజ్వేల్, వెలుగు: అవకాశాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం సిద్దిపేట గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోని సురభి దయాకర్ రావు ఫార్మసీ కాలేజీలో ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్స్​ ఓరియంటేషన్​ ప్రోగామ్​కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాకో మెడికల్ కాలేజీ  జరిగిన ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు.

బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు :  బీజేపీకి ప్రజల మద్దుతు పెరుగుతోందని ఆ పార్టీ మెదక్​ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న  ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలో కొనసాగుతుండగా బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు  శ్రీనివాస్, పెద్ద శంకరంపేట మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లావాప్తంగా అన్ని మండలాల్లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామన్నారు. ఆయన వెంట పేట మండల బీజేపీ  ప్రధాన కార్యదర్శి కృష్ణ,  మాజీ ఎంపీటీసీ స్వప్న శ్రీనివాస్, నాయకులు ఉన్నారు.