కాలుష్య కంపెనీలను మూసివేయాలి
పోచంపల్లిలో బీజేపీ, ధోతిగూడెంలో కాంగ్రెస్ ధర్నా
భూదాన్‌పోచంపల్లి, వెలుగు : యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో కాలుష్య కంపెనీలను మూసివేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం వేర్వేరుగా ఆందోళనలు చేశారు. భూదాన్‌పోచంపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌రావు, గూడూరు నారాయణరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, ధోతిగూడెంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంపెనీలు రూల్స్ పాటించకుండా కెమికల్స్‌ను రోడ్డు వెంట పారబోయడం, భూమిలోకి వదులుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంపెనీలు ఎక్కువగా అధికార పార్టీ నాయకులవి కావడంతోనే చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కనీసం గ్రామాలకు రాకపోవడం సరికాదన్నారు. నాయకులు సీఎన్‌ఆర్ రెడ్డి, పడాల శ్రీనివాస్, కర్నాటి ధనుంజయ, దాసరి మల్లేశ్, నర్ల నర్సింగరావు, రమణగోని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ మీటింగ్‌ను బహిష్కరించిన అధికార, ప్రతిపక్షాలు
హాలియా, వెలుగు : ఆఫీసర్లు పాలకవర్గ సభ్యులను పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అధికార పార్టీ సభ్యులు, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు హాలియా మున్సిపల్ మీటింగ్‌ను బహిష్కరించారు. చైర్‌పర్సన్ వెంపటి పార్వతమ్మ, కమిషనర్ కందిళ్ల వీరారెడ్డి అధ్యక్షతన మీటింగ్ ప్రారంభం కాగానే టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు నల్గొండ సుధాకర్, వర్ర వెంకట్‌రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, అన్నెపాక శ్రీను, జటావత్ ప్రసాద్ నాయక్ వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ కలిసి ప్రజలకు ఉపయోగం లేని అంశాలపై ఎజెండా తయారు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే టీఆర్‌ఎస్ కౌన్సిలర్లకు సంబంధించిన వార్డుల్లోనే పనులు చేస్తున్నాంటూ కాంగ్రెస్ సభ్యులు మీటింగ్‌ను బహిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని, భగీరథ నీళ్లు రావడం లేదని చెప్పినా చైర్‌పర్సన్, కమిషనర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వాహనాల రిపేర్లు, హరితహారం పేరుతో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఉత్తీర్ణత శాతం పెంచాలి
యాదాద్రి, వెలుగు : టెన్త్‌లో వంద శాతం ఉత్తీర్ణత ఉండేలా కృషి చేయాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. స్టూడెంట్లకు స్పెషల్ క్లాస్‌లు, స్లిప్ టెస్టులు నిర్వహించాలని, ప్రతి రోజు షెడ్యూల్ ప్రకారం బోధన జరపాలని సూచించారు. అనంతరం వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అలాగే ఆయిల్‌పామ్ సాగుపై కలెక్టరేట్‌లో రివ్యూ నిర్వహించారు. ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి, సాగు వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్‌రెడ్డి, హార్టీకల్చర్ ఆఫీసర్ అన్నపూర్ణ, డీఈవో నారాయణరెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ అండాలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జయశ్రీ పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం
నల్గొండ అర్బన్, వెలుగు : శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ పనిచేస్తోందని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి చెప్పారు. జిల్లాలో ఈ సంవత్సరం నేరాల సంఖ్య తగ్గిందన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. 2021లో 9,535 కేసులు నమోదు అయితే ఈ ఏడాది 7,343 కేసులే నమోదయ్యాయని చెప్పారు. అలాగే మునుగోడు ఉపఎన్నికను పకడ్బందీగా నిర్వహించామన్నారు. దేవరకొండ పరిధిలో శిశువులు అమ్మే ముఠా, మిర్యాలగూడ పరిధిలో లారీలు చోరీ చేస్తున్న ముఠా, కార్ల నంబర్లు మార్చి అమ్ముతున్న ముఠాలతో పాటు చైన్ స్నాచింగ్ చేస్తున్న , గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తులను పట్టుకున్నట్లు చెప్పారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ప్రోగ్రాం ద్వారా 230 చిన్నారులను రక్షించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 6,060 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రసాదరావు, డీఎస్పీలు నరసింహారెడ్డి, నాగేశ్వరరావు, మొగులయ్య, రమేష్, సురేశ్ పాల్గొన్నారు.
వడ్ల కొనుగోళ్లలో రూ. 1,150 కోట్ల అవినీతి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని మిల్లర్లు రూ.1,150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఆరోపించారు. బినామీ పేర్లతో నకిలీ ట్రక్‌షీట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. శుక్రవారం స్థానికంగా మాట్లాడుతూ మిల్లర్ల వెనుక మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి ఎమెల్యే గాదరి కిశోర్‌కుమార్, అతడి అతని అనుచరుడు సోమనర్సయ్య ఉన్నారని ఆరోపించారు. 2020 – 21 సంవత్సరంలో కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని బయటపెడితే తూతూమంత్రంగా విచారణ జరిపి చిన్న ఉద్యోగులపై కేసులు నమోదు చేశారని చెప్పారు. ఆఫీసర్లు డబ్బులు తీసుకొని మిల్లర్లపై కేసులు కాకుండా మేనేజ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో వడ్ల అక్రమాలపై సీబీఐ, ఈడీతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కర్నాటి కిషన్, మమతారెడ్డి, కట్కూరి కార్తీక్, హబీబ్, చలమల్ల నర్సింహ, మీర్ అక్బర్ పాల్గొన్నారు.
‘ఉపాధి’ ఆంక్షలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ ధర్నా
యాదాద్రి/సూర్యాపేట/నల్గొండ అర్బన్, వెలుగు : ఉపాధి హామీ నిధులపై కేంద్రం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. భువనగిరిలో రైతు బజార్ వద్ద, నల్గొండలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద, సూర్యాపేటలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కల్లాల నిర్మాణానికి ఉపయోగించిన నిధులను వెనక్కి ఇవ్వాలనడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ పోరాటం చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్‌పై ఉన్న కోపాన్ని రైతులపై చూపడం సరికాదన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నల్గొండలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లబోతు భాస్కరరావు, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, సూర్యాపేటలో జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. కాగా భువనగిరిలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతుబజార్ నుంచి హైదరాబాద్ చౌరస్తా, పాత బస్టాండ్, జగదేవ్‌పూర్ రోడ్డులో వాహనాలు నిలిచిపోయాయి.
‘బీఆర్‌ఎస్ లీడర్లు ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది’
నార్కట్‌పల్లి, వెలుగు : బీఆర్‌ఎస్ నాయకుల ధర్నా చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో కల్లాలు నిర్మించాల్సిన నిధులను బీఆర్‌ఎస్ నాయకులు జేబుల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. భవిష్యత్‌లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తమ రైతు అవార్డు పొందిన బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు మహాలింగాన్ని శాలువాతో సన్మానించారు. అలాగే బీజేపీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు బందారపు లింగస్వామి, యాదగిరిరెడ్డి, మైళ్ల నరసింహ, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, నకరికంటి మొగులయ్య, మండల వెంకన్న, కూరెళ్ల శ్రీను, భాస్కర్‌రావు పాల్గొన్నారు.