ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • ఫండ్స్​ ఇస్తలే.. పనులు చేయనిస్తలే
  • ప్రతిపక్షాల డివిజన్లపై టీఆర్​ఎస్​ వివక్ష
  • కార్పొరేషన్​ ఫండ్స్​ కావాలంటే పార్టీ మారాలని ఒత్తిడి!


నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఫండ్స్​ కేటాయింపుల్లో వివాదం నెలకొంది. దీంతో డివిజన్​ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. సర్కార్​ ప్రకటించిన రూ. 100 కోట్ల నిధులు బీజేపీ ప్రాతినిథ్యం వహిస్తున్న డివిజన్ లకు ఇవ్వడం లేదని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. నిధులు కావాలంటే తమ పార్టీలోకి రావాలని టీఆర్​ఎస్​ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. కార్పొరేషన్ కొత్త పాలకవర్గం కొలువుదీరి రెండున్నరేళ్లు అయినా సమస్యలను పట్టించుకోవడం లేదు. జనరల్​ బాడీ మీటింగ్​లపై దృష్టి పెట్టడం లేదు. పట్టణ ప్రగతి ఫండ్స్​ నుండి ప్రతి డివిజన్ కు రూ. 40 లక్షలు మంజూరైనా మీటింగ్​లు లేకపోవడంతో పనులు సాగడం లేదని కార్పొరేటర్లు అంటున్నారు. మున్సిపల్​ కార్పొరేషన్ ను అక్టోబర్​ 5 వ తేదీన సీఎం రూ. 100 కోట్లు కేటాయించారు. కార్పొరేషన్​ లో 60 డివిజన్ల అభివృద్ధికి రూ.60 కోట్లు, సీడీఎఫ్​ కింద రూ. 40 కోట్లు కేటాయించారు. అయితే టీఆర్​ఎస్​ , ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో మాత్రమే పనులు చేస్తున్నారు. బీజేపీ కార్పొరేటర్లు ఉన్న డివిజన్లకు ప్రతిపాదనలు మొదలు పెట్టలేదు. గతంలో తెలంగాణ అర్బన్​ ఫైనాన్స్​ డెవలప్​ మెంట్ కార్పొరేషన్​ నుండి రూ. 100 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల విడుదల కోసం కొత్త పాలకవర్గంలో ఊసే ఎత్తడంలేదు. గత కౌన్సిల్​లో విడుదలైన 100 కోట్లతో ఆర్​ అండ్​ బీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే అవి కూడా బీజేపీ నుంచి టీఆర్​ ఎస్​ లో చేరిన కార్పొరేటర్ల డివిజన్లలో మాత్రమే చేస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా సీఎం ప్రకటించిన రూ. 100 కోట్ల అభివృద్ధిఫండ్స్​ కావాలంటే టీఆర్​ ఎస్​ లో చేరాలని అంటున్నట్టు తెలుస్తోంది. 

టీఆర్​ఎస్​లో చేరాలని ఒత్తిడి 

జనరల్ బాడీ మీటింగ్​ లు జరపమంటే టీఆర్​ ఎస్​ లో చేరాలని ఒత్తిడి తెస్తున్నరు. బీజేపీ కార్పొరేటర్ల డివిజన్ లలో అభివృద్ధిని అధికారపార్టీ అడ్డుకుంటోంది. ఇటీవల సీఎం ప్రకటించిన రూ. 100 కోట్ల  పనులకోసం  డివిజన్​ లలో ప్రతిపాదనలు తీసుకుంటలేరు.
-న్యాలంరాజు డిప్యూటీ ఫ్లోర్​ లీడర్ బిజేపీ

డెవలప్మెంట్ లో వివక్ష 
ఎనిమిదేండ్ల నుంచి డెవలప్​ మెంట్​ లో వివక్ష చూపుతున్నరు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక విపక్షాల డివిజన్లను  పట్టించుకోవడం లేదు. సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ చొరవ చూపడం లేదు.  ఏడాది అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మీటింగ్ పెట్టి సమస్యల పరిష్కారించాలే.
మానాల మోహన్​ రెడ్డి,  కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్​

  • ఆదర్శ రైతుల స్ఫూర్తితో పంటలు సాగు చేయాలె
  • డ్రాగన్ ఫ్రూట్ పంటను సందర్శించిన కలెక్టర్ 

నిజామాబాద్, వెలుగు: యువ రైతులు వినూత్న పద్ధతుల్లో ప్రయోగాత్మక పంటలు పండించాలని, ఆదర్శ రైతులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్​ నారాయణ రెడ్డి చెప్పారు. మోపాల్ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. పూర్తిగా సేంద్రియ పద్ధతులతో ఎకరన్నరలో పండిస్తున్న ఈ పంటను చూసి కలెక్టర్​ హర్షం వ్యక్తం చేశారు. డ్రాగన్ ఫ్రూట్ పండించడంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, మెళుకువల గురించి రైతు తమీమ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట పండించేందుకు సుమారు ఐదు నుండి ఆరు లక్షల వరకు పెట్టుబడి   అవుతోందని,  మూడు సంవత్సరాల తరువాత ఫ్రూట్​ దిగుబడులు చేతికందడం ప్రారంభం అవుతుందని వివరించారు. ప్రతిసారి ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, డ్రాగన్ ఫ్రూట్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలిపారు, ఇప్పటికే తాను రిటైల్ గా కిలోకు 200 రూపాయల చొప్పున 3 టన్నుల పంట విక్రయించానని కలెక్టర్ కు వివరించగా, కలెక్టర్​ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు మూస ధోరణిని వీడి, మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన పంటలను సాగు చేయాలని అన్నారు.. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ఎకరానికి మూడు విడతల్లో 96 వేల రూపాయల సబ్సిడీని అధునాతన పద్ధతుల్లో పంటల సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్ దాస్ తదితరులు ఉన్నారు.

లైబ్రరీని అందరూ ఉపయోగించుకోవాలి: డీఈఓ రాజు

లింగంపేట,వెలుగు: మండలం ముంబాజీపేట తండాలో గిరిజన యువకులు దాతల సహకారంతో లైబ్రరీని ఏర్పాటు చేయడం, దానికి డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ పేరు పెట్టడం అబినందనీయమని డీఈఓ రాజు అన్నారు. ముంబాజీపేట తండా ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంగళవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్​ పేరుతో గిరిజన తండాలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ల్లాలోనే మొదటిదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తండాకు చెందిన యువకులు, స్టూడెంట్లు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేటి కాలంలో పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరికీ అలవాటు కావాలని ఆకాంక్షించారు. తండాలో లైబ్రరీ ఏర్పాటు కు కృషి చేసిన బానోత్​ నరేశ్​ను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్​ లక్ష్మి, ఎంపీటీసీ సర్వన్​,ఎంఈఓ రామస్వామి, ఏఎస్​ఐ ప్రకాశ్​నాయక్​, జిల్లా లైబ్రేరియన్​ ఆడిటర్​ గణపతి, హెఎం సుమలత, తండా యువకులు ఓంకార్, దేవిదాస్, పరుశురాం, సురేశ్​, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. 

70 కిలోల గంజాయి స్వాధీనం

కామారెడ్డి , వెలుగు : జిల్లా కేంద్రానికి సమీపంలో టెకిర్యాల్​ బైపాస్​ వద్ద నేషనల్​ హైవేపై మంగళవారం 70 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సోమనాథం తెలిపారు. హైవేపై దేవునిపల్లి పోలీసులు వెహికిల్స్​ తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్​   నుంచి వస్తున్న కారులో ఉన్న వ్యక్తులు పోలీసుల తనిఖీలను గమనించి వెహికిల్​ దూరంగా అపి పారిపోయారన్నారు. పోలీసులు కారు వద్దకు వెళ్లి తనిఖీలు చేయగా.. డిక్కీలో 35ప్యాకేట్లలో గంజాయి ఉందన్నారు. నాగ్​పూర్​ వైపు తరలిస్తున్నారని  అనుమానిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పారిపోయిన వ్యక్తుల గురించి గాలిస్తున్నట్లు చెప్పారు. వునిపల్లి ఎస్సై నర్సయ్య పాల్గొన్నారు. 

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు

భిక్కనూరు,వెలుగు : రాష్ట్రం ఏర్పడితే సాగునీరు,ఉద్యోగాలు వస్తాయని, తద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పిన సీఎం కేసీఆర్​ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాడని మాజీ మంత్రి షబ్బీర్​ ఆలీ ఎద్దేవా చేశారు. మండలంలోని రామేశ్వరపల్లి వడ్డెరకాలనీలో వడ్డెఓబన్న విగ్రహాన్ని మంగళవారం ఆయన అవిష్కరించారు.అనంతరం స్ధానిక ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ర్ట సాధన కోసం ఎంతో మంది బలిదానలు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్​ తెలంగాణను ఇస్తే.. కేసీఆర్​మాత్రం రాష్ర్ట అభివృద్దిని పక్కన పెట్టి కుటుంబపాలన చేస్తున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ పేరుతో వెయ్యికోట్లు వెనకేసుకొని కేవలం సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​లకు మాత్రమే నీళ్లు ఇస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే అధికారంలోకి వస్తే దళితబంధు తరహాలో వడ్డెరబంధు ఇస్తామన్నారు. ఈసమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్​,మండలాధ్యక్షుడు బీమరి హీమ్​రెడ్డి, ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్​రెడ్డి,బద్దం ఇంద్రకరన్​రెడ్డి, బాపూరెడ్డి,సాయిరెడ్డి పాల్గొన్నారు. 

దళిత ఎంపీపీ అని  ​అవమానిస్తున్రు
మండల సమావేశంలో కింద కూర్చుని ఎంపీపీ నిరసన

నవీపేట్, వెలుగు: దళితుడనైనందుకే తనను ఆఫీసర్లు అవమానిస్తున్నారంటూ అధికార పార్టీకి చెందిన ఎంపీపీ మండల సమావేశంలో కింద కూర్చుని నిరసన తెలిపాడు. నవీపేట మండల సమావేశం మంగళవారం ఎంపీపీ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. నిజాంపూర్ ఎంపీటీసీ కృష్ణమోహన్ ఉపాధిహామీ డబ్బులు రావడం లేదని, సంబంధిత ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీఓ గోపాలకృష్ణను కోరారు. అంతలో ఎంపీపీ కలుగజేసుకొని ఎజెండా ప్రకారం చర్చ కొనసాగిద్దామని, తర్వాత ఉపాధిహామీపై మాట్లాడదామని అన్నారు. అయినప్పటికీ ఎంపీడీఓ చర్చను కొనసాగిస్తుండడంతో ఎంపీపీ ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయారు. సభలో ఉన్న సభ్యులు, ఆఫీసర్లు ఎంపీపీకి నచ్చజెప్పడంతో సభ మళ్లీ ప్రారంభమైంది. ఎంపీటీసీ కృష్ణ మోహన్ సభలో బైఠాయించి ఆఫీసర్లు తమ మాటలు వినిపించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతలో ఎంపీపీ వచ్చి కింద బైఠాయించారు. దళితుడినైన తనను ఎంపీడీఓ, లీడర్లు అవమానిస్తున్నారని ఆరోపించారు. దీంతో మండల సమావేశం అర్ధంతరంగా ముగిసింది. 

ఓటర్​  లిస్ట్​లో మార్పులకు అవకాశం

కామారెడ్డి, వెలుగు: ఓటర్​ జాబితాల్లో మార్పులు చేర్పులతో పాటు, కొత్తగా ఓటర్​గా నమోదు చేసుకొవచ్చని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ తెలిపారు. కలెక్టరేట్​లో మంగళవారం రాజకీయ పార్టీల లీడర్లతో మీటింగ్​ నిర్వహించారు. బూత్​ లెవల్​ ఆఫీసర్లతో, హెల్ప్​లైన్​లో ఓటర్​ ఐడీ అప్లయ్​ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో 790 పోలింగ్​ సెంటర్లు ఉన్నాయని, కామారెడ్డిలో 266, ఎల్లారెడ్డిలో 269, జుక్కల్​లో 225 సెంటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ చంద్రమోహన్​, ఆర్డీవో శీను, తహసీల్ధార్​ ప్రేమ్​కుమార్​, ఎలక్షన్​ సెల్​ ఇన్​చార్జీలు సాయి భూజంగ్​రావు, నాయబ్​ తహసీల్ధారులు ప్రియదర్శిని, శ్రావణి, నరేంధర్​, నవీన్​ 
తదితరులు పాల్గొన్నారు. 

లైబ్రరీని అందరూ ఉపయోగించుకోవాలి: డీఈఓ రాజు

లింగంపేట,వెలుగు: మండలం ముంబాజీపేట తండాలో గిరిజన యువకులు దాతల సహకారంతో లైబ్రరీని ఏర్పాటు చేయడం, దానికి డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ పేరు పెట్టడం అబినందనీయమని డీఈఓ రాజు అన్నారు. ముంబాజీపేట తండా ప్రైమరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మంగళవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్​ పేరుతో గిరిజన తండాలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం ల్లాలోనే మొదటిదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తండాకు చెందిన యువకులు, స్టూడెంట్లు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేటి కాలంలో పుస్తకాలు చదవడం ప్రతి ఒక్కరికీ అలవాటు కావాలని ఆకాంక్షించారు. తండాలో లైబ్రరీ ఏర్పాటు కు కృషి చేసిన బానోత్​ నరేశ్​ను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్​ లక్ష్మి, ఎంపీటీసీ సర్వన్​,ఎంఈఓ రామస్వామి, ఏఎస్​ఐ ప్రకాశ్​నాయక్​, జిల్లా లైబ్రేరియన్​ ఆడిటర్​ గణపతి, హెఎం సుమలత, తండా యువకులు ఓంకార్, దేవిదాస్, పరుశురాం, సురేశ్​, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.