బోధన్, వెలుగు: ఈ నెల7న చేపట్టన్న చలో రాజ్ భవన్ విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు కంజర భూమయ్య కోరారు. సోమ వారం పట్టణంలోని సీపీఐ ఆఫీసు వద్ద ప్రెస్మీ ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. బీజేపీ యేతర రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రంలోని అధికార పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పంపిన బిల్లులను పెండింగ్‌లో పెట్టి కేంద్రంలోని అధికార పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ, సీఎంలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారన్నారు. ప్రెస్‌మీట్‌లో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి షేక్ బాబు, రఫత్ బేగ్ పాల్గొన్నారు.
‘ఆధార్’ అక్రమాలకు ఇక చెక్
నిజామాబాద్, వెలుగు: ఆధార్ నమోదు ప్రక్రియలో అక్రమాలకు తావు లేకుండా పర్యవేక్షణ కమిటీ పరిశీలిస్తుందని అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం సంబంధిత శాఖల అధికారులు, మీసేవ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ నకిలీ ఆధార్ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టేందుకు జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారని సీపీ, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఈసేవ జిల్లా మేనేజర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, పోస్టల్, యూఐడీఏఐ, డీఈవో, డీడబ్ల్యూవో, డీఎంహెచ్‌వో మెంబర్ కన్వీనర్లుగా ఉంటారని తెలిపారు. ఆధార్ నమోదు ప్రక్రియలో అక్రమాలకు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. డీఆర్డీవో చందర్, యూఐడీఏఐ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, ఈడీఎం కార్తీక్ పాల్గొన్నారు.
స్వర్ణకారుల ఆందోళన
నిజామాబాద్, వెలుగు: భీంగల్ సీఐ, ఎర్గట్ల ఎస్సైల వేధింపుల నుంచి బంగారు వ్యాపారిని కాపాడాలని జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన స్వర్ణకారులు ఏర్గట్లలో సోమవారం ఆందోళనకు దిగారు. మెట్‌పల్లి చెందిన బంగారు వ్యాపారి ఇందూరి రమణను ఓ కేసు విషయంలో ఏర్గట్ల పోలీసులు నాలుగు రోజుల కింద అదుపులోకి తీసుకుని అరెస్టు చేయకుండా, కేసు నమోదు చేయకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. ప్లకార్డులు పట్టుకుని సీఐ, ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చోరీ సొత్తు కేసులో పోలీసులకు సహకరిస్తామని బాధితులు చెప్పినా అదనంగా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పైఆఫీసర్ల కు కాంప్లెయింట్ చేసినా పట్టించుకోలేదన్నారు.
8న ఆశావర్కర్ల మహాధర్నా
ఎడపల్లి, వెలుగు: ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 8న నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజమణి తెలిపారు. సోమవారం ఎడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు మండల ఆశా వర్కర్లతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డాక్టర్‌కు అందజేశారు. ఆశావర్కర్ల కు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్టుగా కనీస వేతనాలు అమలు చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన
బోధన్, వెలుగు: వరల్డ్ సాయిల్ హెల్త్ డే సందర్భంగా మండలంలోని జాడిజామాల్‌పూర్‌లో రైతు వేదిక వద్ద కృషి విజ్ఞానకేంద్రం రుద్రూర్, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.నవీన్‌కుమార్ మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అశాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల వల్ల సేంద్రియ కర్బనం రోజురోజుకూ తగ్గిపోతుందన్నారు. దీనికి తోడుగా ప్రతి యేట వరి పంటనే పండిచడంతో నేల సారం దెబ్బ తినడమే కాకుండా చీడ పీడల బెడద కూడా పెరుగుతోందన్నారు. రైతులు తప్పనిసరిగా పంట మార్పిడి చేయాలన్నారు. యాసంగిలో ఆరుతడి పంటలైన శనగ, పొద్దుతిరుగుడు, మినుము, మొక్కజొన్న, పెసర, చిరుధాన్యాలు పండించడం వల్ల నేల స్వభావం మెరుగుపడి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందన్నారు. ఏడీఏ సంతోష్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శరత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వి.ఆర్ దేశాయ్, ఎంపీపీ బుద్దె సావిత్రి, శాస్త్రవేతలు డాక్టర్ ఎం.శ్వేత, డాక్టర్ బి.వెంకటరాజ్‌కుమార్, మార్కెట్ కమిటీ వైఎస్ చైర్మన్ షకీల్, రైతులు రాజేంద్ర, రాయన్న, వీరాచారి, రాజేశ్ పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న సైన్స్ ఫెయిర్
నిజామాబాద్ నగరంలోని ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న జిల్లా సైన్స్ ఫెయిర్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. నిజామాబాద్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫెయిర్‌ను జడ్పీ చైర్మన్ విఠల్‌రావు, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఫైర్ స్టెప్ బాంబ్ ఎగ్జిబిట్ అందరినీ ఆకట్టుకుంది.
– వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
రైతు సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన
కామారెడ్డి, వెలుగు: ధరణి పోర్టల్ రద్దు చేయాలని, పోడు భూముల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన లీడర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య కొద్ది సేపు తోపులాట జరిగింది. కొందరు బారికేడ్లను నెట్టి వేస్తూ, వాటిపై నుంచి పైకి దూకి లోపలకు వెళ్లా రు. ఈ క్రమంలో పోశానిపేట సర్పంచ్ మహేందర్‌రె డ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వినతి పత్రం ఇవ్వటానికి షబ్బీర్‌అలీ, ఇతర నేతలు వెళ్లగా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ చాంబర్‌లో బైఠాయించారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సురేశ్ షేట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, ఎల్లారెడ్డి, బాన్సువాడ ఇన్‌చార్జిలు సుభాష్ రెడ్డి, కాసుల బాలరాజు, లీడర్లు ఎడ్ల రాజిరెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, నారెడ్డి మోహన్‌రెడ్డి, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, గణేశ్ నాయక్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం
నిజామాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచేవరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్‌కు మెమోరండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల బడ్జెట్‌లో ఎన్నో ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు నిర్మించినట్లు చెప్పారు. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, అర్బన్ ఇన్‌చార్జి తాహెర్ బీన్ హందాన్, అర్బన్ ప్రెసిడెంట్ కేశ వేణు, పీసీసీ కార్యదర్శులు రాంభూపాల్, రామకృష్ణ పాల్గొన్నారు.
‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీగా ఉండాలి’
పిట్లం, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ బంగారు శృతి అన్నారు. సోమవారం బిచ్కుందలో జరిగిన బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగిందన్నారు. ప్రజలు బీజేపీ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, నాయకులు శృతిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జహీరాబాద్ కన్వీనర్ డాక్టర్ రవికుమార్, జిల్లా ఇన్‌చార్జి బద్ధం మహిపాల్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బానాల లక్ష్మారెడ్డి, నీలం రాజులు, సీనియర్ నాయకులు మురళీధర్‌గౌడ్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి, కాలకుంట్ల రాము, బాపురెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్ పంతులు, మర్రి రాంరెడ్డి పాల్గొన్నారు.